Goa Tour: గోవా వెళ్లేవారికి అలర్ట్.. కొత్త రూల్స్ వచ్చేశాయి.. ఈ చిన్న పని చేసినా 24 గంటలు జైల్లోనే..
గోవా వెళ్లేవారికి అక్కడి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. గోవాకు తరచూ వేలామంది వెళ్తూ ఉంటారు. దేశంలోని నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా వందల మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. ఈ క్రమంలో భద్రత కోసం కొత్త రూల్స్ విడుదల చేశారు.

ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులు ఎక్కువమంది సందర్శించే ప్రాంతాల్లో గోవా కూడా ఒకటి. ఇక్కడికి భారతదేశం నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా టూరిస్టులు వస్తూ ఉంటారు. ఎప్పుడూ పర్యాటకులతో గోవా సందడిగా ఉంటుంది. గోవాలోని బీచ్‌లు, హోటళ్లు సందర్శకులతో నిండిపోయి ఉంటాయి. ఇక విదేశాల నుంచి పెద్ద మొత్తంలో టూరిస్టులు గోవాను విజిట్ చేస్తూ ఉంటారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులకు కేరాఫ్ అడ్రస్‌గా గోవా మారింది. ఈ క్రమంలో గోవాలో భద్రతపై అక్కడి పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటీవల గోవాలో టూరిస్టులపై దాడులు జరగడం, మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువవుతున్న క్రమంలో పోలీసులు రంగంలోకి దిగారు. టూరిస్టులకు కొత్త రూల్స్ ప్రవేశపెట్టారు. అవేంటో చూద్దాం.
ఆ పని చేస్తే 24 గంటలు జైల్లోనే..
మహిళలపై ఇటీవల గోవాలో లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో మహిళా పర్యాటకుల భద్రతపై పోలీసులు ప్రత్యేక శ్రద్ద పెట్టారు. ఇందులో భాగంగా కట్టుదిట్టమైన భద్రత, మహిళల రక్షణ కోసం కొత్త రూల్స్ జారీ చేశారు. ఇక నుంచి ఎవరైనా గోవాలో టూరిస్టుల అనుమతి లేకుండా వారి ఫొటోలు లేదా వీడియోలు తీసుకుంటే 24 గంటల పాటు పోలీస్ కస్టడీలో ఉంచుతారు. ఈ మేరకు తాజాగా పోలీసులు ఈ కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. భారత టూరిస్టులతో పాటు విదేశీ పర్యాటకులకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని గోవా పోలీసులు స్పష్టం చేశారు. ఇక నుంచి పక్కవారికి అనుమానం రాకుండా వారి ఫొటోలు, వీడియోలు తీయడం నిషేధమని తెలిపారు. అలా చేస్తే 24 గంటల పాటు ఇబ్బంది పడాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
వారెంట్ లేకపోయినా..
ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు ఎలాంటి వారెంట్ లేకపోయినా అదుపులోకి తీసుకునే హక్కు పోలీసులు ఉంటుందని తెలిపారు. భారతీయ నాగరిక సురక్షా సంహిత సెక్షన్ 170 ప్రకారం ప్రివెంటివ్ డిటెక్షన్ కింద అదుపులోకి తీసుకొవచ్చని అన్నారు. అటు బీచుల్లో పోలీసులు భద్రత మరింత పెంచారు. కొంతమంది విదేశీయులను వీడియోలు తీసి నెట్టింట్లో పెట్టడం, వారిని సెల్పీల కోసం ఇబ్బంది పెట్టడం వంటి చేస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడటం వల్ల భారతదేశానికి చెడ్డపేరు వచ్చే అవకాశముంటుంది. ఇటీవల రష్యా మహిళ బీచ్‌లో స్విమ్మింగ్ చేస్తుండగా.. ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అలాగే మరో రష్యా మహిళలను ఒడిశాకు చెందిన ఇద్దరు వ్యక్తులు వేధింపులకు గురి చేశారు. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
