Jabardasth: జబర్దస్త్ మానేసి తప్పు చేశాను.. మాటలు నమ్మి అలా జరిగింది.. జబర్దస్త్ కమెడియన్..
జబర్దస్త్ నటి తన్మయి తన కెరీర్ ఒడిదుడుకులను, వ్యక్తిగత కష్టాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తెలిసినవారి ప్రోత్సాహంతో జబర్దస్త్ నుంచి మరో ఛానల్ కు వెళ్లడం వల్ల తానెంత నష్టపోయిందో వివరించారు. భయంకరమైన ప్రమాదం, తండ్రి మరణం వంటి విషాదాల్లో పరిశ్రమ నుంచి తగిన మద్దతు లభించలేదని, కేవలం నూకరాజు ఒక్కరే తనకు అండగా నిలిచారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

జబర్దస్త్ నటి తన్మయి తన కెరీర్ ప్రారంభం నుంచి ఎదుర్కొన్న కష్టాలను, జబర్దస్త్‌తో తన అనుబంధాన్ని, వ్యక్తిగత జీవితంలో ఎదురైన తీవ్ర విషాదాలను, పరిశ్రమ నుంచి అందిన, అందని మద్దతు గురించి ఓ ఇంటర్వ్యూలో వివరించారు. అప్పట్లో నాగబాబు, రోజా వంటి ప్రముఖులు, దర్శకులు నితిన్, భరత్ ఆమెకు ఎంతో సపోర్టివ్‌గా ఉండేవారని, వారి యాక్సెప్టెన్స్ లేకపోతే తాననే పర్సన్ లేదని ఆమె పేర్కొన్నారు. మధ్యలో జబర్దస్త్ మానేయడానికి గల కారణాలను తన్మయి వివరించారు. నితిన్, భరత్, మల్లెమాల మధ్య ఏవో ఇష్యూస్ వచ్చాయని, ఆ సమయంలో జీ తెలుగులో అదిరింది అనే కొత్త షో ప్రారంభమైందని తెలిపారు. ఛానెల్స్ మధ్య ఇంత డిఫరెన్స్ ఉంటుందని తనకు తెలియదని, చమ్మక్ చంద్ర, ఆర్పీ, నితిన్, భరత్ అందరితో కలిసి ఒక మీటింగ్‌లో “తన్మయి నువ్వు మంచి పొజిషన్‌లో ఉన్నావు, నీకు ఇంకా మంచి లైఫ్ వస్తుంది” అని ప్రోత్సహించారని తెలిపారు. ఆయన మద్దతుతో ఈటీవీ నుంచి జీ తెలుగుకు వెళ్లడం జరిగింది. కానీ ఈ నిర్ణయం వల్ల తాను చాలా నష్టపోయానని, ఆ షోస్ కూడా ఒక సంవత్సరం మాత్రమే కొనసాగాయని చెప్పారు. ఆ తర్వాత మాట ఇచ్చిన వారందరూ తమ జీవితాల్లో బిజీ అవ్వడంతో తాను ఒంటరినయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత మళ్లీ జబర్దస్త్ మల్లెమాల టీంతో రిక్వెస్ట్ చేసుకొని తిరిగి వచ్చానని తెలిపారు.
ఇప్పుడు లేడీ గెటప్స్ తగ్గి, అమ్మాయిలు ఎక్కువ రావడంతో కామెడీలో మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. అయితే, వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాల్లో పరిశ్రమ నుంచి మద్దతు ఎలా లేదో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. జబర్దస్త్ నుంచి బయటికి వచ్చిన రెండేళ్లకు తాను ఒక కారు ప్రమాదానికి గురై, తలకు తీవ్ర గాయం, రైనోప్లాస్టీ ఆపరేషన్ జరిగాయని చెప్పారు. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే దారిలో బర్రెను గుద్దడంతో ప్రమాదం జరిగిందని, ఆ గాయం వల్ల కోమాకి వెళ్లే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఆ సమయంలో తాను బ్రతికానా చచ్చానా అని కూడా ఎవరూ పట్టించుకోలేదని, ఎవరూ సహాయం చేయలేదని చెప్పారు. అంతకు ముందు, తర్వాత కూడా చాలా మందికి సహాయం చేసినప్పటికీ, తనకు కష్టం వచ్చినప్పుడు ఎవరూ నిలబడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Tanmay New
అంతేకాకుండా, తన తండ్రి అకస్మాత్తుగా మరణించిన విషయాన్ని కూడా తన్మయి ప్రస్తావించారు. శ్రీదేవి షూట్ పూర్తి చేసుకున్న మరుసటి రోజు ఉదయం 11 గంటలకు తండ్రి చనిపోయిన వార్త తెలిసిందని, రాత్రి వీడియో కాల్ మాట్లాడిన తండ్రి అకస్మాత్తుగా లేరనే వార్త తనను షాక్‌కు గురిచేసిందని చెప్పారు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఇమ్మాన్యుయేల్‌కు ఫోన్ చేస్తే, అతను షూట్‌లో ఉన్నానని చెప్పాడని, అయితే నూకరాజు మాత్రం తన షూటింగ్‌ను వదిలేసి, తన కోసం కారు తీసుకొని వచ్చి, తన తండ్రి దగ్గరికి వెళ్లేంత వరకు హైదరాబాద్‌లో తన చేయి పట్టుకొని “ఏడవకు, మేము ఉన్నాము” అంటూ తనకు అండగా నిలిచాడని అన్నారు. తనకు సహాయం చేసిన వ్యక్తి నూకరాజు ఒక్కడేనని, డబ్బుల పరంగా కూడా ఎవరూ సహాయం చేయలేదని తన్మయి స్పష్టం చేశారు. షోలలో మద్దతు, సహాయం ఉన్నట్లు చూపించినప్పటికీ, వ్యక్తిగత జీవితంలో అలాంటివి ఉండవని ఆమె అన్నారు.
