Travel to Taiwan: టూర్ మీది.. ఖర్చు మాది.. పర్యాటకులకు తైవాన్ బంపర్ ఆఫర్..
తైవాన్ ప్రభుత్వం ప్రపంచ పర్యాటకులకు ఆకర్షించేందుకు అలవెన్స్ ప్రకటించింది. సింగిల్ గా వస్తే 165 డాలర్లు, గ్రూప్ గా వస్తే 658 డాలర్లను ఇస్తామని ఆఫర్ ఇచ్చింది.

సాధారణంగా విదేశాలకు టూర్ వెళ్లాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. అది కూడా ఫ్యామిలీలతో లేదా స్నేహితులతో బృందంగా వెళ్లాలంటే భారీగా చేతి చమురు వదులుతుంది. అయితే ఒక దేశం మాత్రం తమ దేశానికి పర్యాటకులు వస్తే తామే ఎదురు డబ్బులిస్తామంటోంది. సింగిల్ వచ్చినా లేదా గ్రూప్ గా వచ్చినా టూరిస్ట్ భత్యం కింద అందజేస్తామంటోంది. బావుంది కదూ ఆఫర్. ఇంతకీ ఆ దేశం పేరు ఏంటి? ఎందుకిలా చేస్తోంది? దాని వల్ల దానికి ఒనగూరే ప్రయోజనాలు ఏంటి? ఇప్పుడు చూద్దాం..
పర్యాటకులకు డబ్బులు ఇస్తామంటున్న తైవాన్..
ప్రపంచ వ్యాప్తంగా బెస్ట్ టూరిస్ట్ స్పాట్ లలో తైవాన్ కూడా ఒకటి. కరోనాకు ముందు ప్రపంచలో ఎక్కువ మంది సందర్శించే నగరాలలో ఇది కూడా ఒకటి. అయితే కరోనా సంక్షోభం కారణంగా టూరిజమ్ మీద ఆధారపడిన అనేక దేశాలు ఇబ్బందులు పడ్డాయి. ఇదే క్రమంలో తైవాన్ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకూ పూర్తి స్థాయిలో కోలుకోలేదు. టూరిజమ్ మునుపటి స్థాయికి చేరలేదు. దీంతో తైవాన్ ప్రభుత్వం ఓ మహత్తరమైన ప్రణాళిక చేసింది. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించింది. తామే పర్యాటకుల ఖర్చులకు డబ్బులిస్తామని ప్రకటించింది.
ప్యాకేజీలు ఇలా..
కరోనాకు పూర్వ ఉన్న స్థితికి తమ పర్యాటక వ్యవస్థను తీసుకెళ్లేందుకు తైవాన్ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు తీసుకొచ్చింది. అందుకోసం ప్రపంచ పర్యాటకులకు అలోవెన్స్ ప్రకటించింది. సింగిల్ గా వస్తే 165 డాలర్లు, గ్రూప్ గా వస్తే 658 డాలర్లను ఇస్తామని తైవాన్ ప్రభుత్వం పేర్కొంది. దీనికి సంబంధించిన వివరాలను తైవాన్ ప్రీమియర్ చెన్ చియెన్ జెన్ వివరించారు.
లక్ష్యం ఇదే..
2023లో ఆరు మిలియన్ల మంది పర్యాటకులను ఆకర్షించాలని ఆ ప్రభుత్వం ప్రణాళిక చేస్తోంది. 2022 లో ఈ ద్వీపానికి కేవలం 9,00,000 మంది సందర్శకులు మాత్రమే వచ్చారు. ఇది గత రికార్డులతో పోల్చితే చాలా తక్కువ. తైవాన్ టూరిజం బ్యూరో ప్రకారం 2019 లో ద్వీపంలో 11.8 మిలియన్ల అంతర్జాతీయ పర్యాటకులు సందర్శించారు.
కొన్ని షరతులుంటాయ్..
అయితే ఇచ్చిన అలవెన్సులపై తైవాన్ ప్రభుత్వం కొన్ని షరతులు విధించిందని ఆ దేశ రవాణా శాఖ మంత్రి వాంగ్ క్వాత్సాయ్ తెలిపారు. ఈ డబ్బును పర్యాటకులకు డిజిటల్ రూపేణా ఇస్తామని, వాటిని విహారయాత్రలో వారి ఖర్చులకు మాత్రమే వినియోగించగలుగుతారని పేర్కొన్నారు. అంటే హోటల్ ఖర్చులు, వసతి వంటి వాటికి ఖర్చు చేయాలన్నారు. వీటి కోసం ప్రీ బుకింగ్ చేసుకోవాలని సూచించింది. కేవలం 5,00,000 మంది వ్యక్తులకు అలాగే 90,000 గ్రూపులకు మాత్రమే ఈ ప్యాకేజీలు అందిస్తామని వివరించారు. దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలనే దానిపై ఇంకా స్పష్టత లేదు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..