Animal Emotions: జంతువులకూ ఎమోషన్స్ ఉంటాయ్! ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు!
సాధారణంగా భావోద్వేగాలు మనుషులకే ఉంటాయి అనుకుంటారు అందరూ. ఎవరైనా ఎమోషన్స్ లేకుండా కఠినంగా ఉంటే ‘నువ్వు మనిషివా జంతువువా?’ అంటుంటారు. ఇక మీదట అలా అనడానికి వీల్లేదు. ఎందుకంటే భావోద్వేగాలు మనుషులకే కాదు జంతువులకీ ఉంటాయని రుజువైంది. ఎవరైనా దగ్గరి వాళ్లు చనిపోతే మనుషులు ఎంత బాధపడతారో, కొన్ని జంతువులు కూడా అలాగే బాధపడతాయని పరిశోధనలో వెల్లడైంది

జంతువులకు కూడా మనుషుల్లాగా భావోద్వేగాలు ఉంటాయంటున్నారు పరిశోధకులు. చాలారకాల జంతువులు ఎమోషన్స్‌ని వ్యక్తపరుస్తాయని ఇటీవల కనుగొన్నారు. తన పార్ట్‌నర్ మరణిస్తే… దాని గురించి బాధపడే జంతువులు చాలా ఉన్నాయట. జంతువుల ఎమోషన్స్‌పై చేసిన అధ్యయనంలో రకరకాల జంతువులు రకరకాల విధాలుగా ఎమోషన్స్‌ని వ్యక్తపరుస్తున్నాయట. కొన్నిరకాల జీవులు కేవలం దుఃఖించడం మాత్రమే కాకుండా, కొన్ని ఆచారాలను కూడా పాటిస్తున్నాయి. మరికొన్ని మనుషుల లాగానే అంత్యక్రియలు చేస్తూ కనిపించాయట.
అంత్యక్రియలు చేస్తూ…
చింపాంజీలు మనిషితో పాటుగా భావాలను వ్యక్తపరచగలవు. చింపాజీల్లో ఒక చింపాంజీ మరణిస్తే.. ఆ బాధ నుంచి కోలుకోవడానికి మిగతా చింపాంజీలకు కొన్ని వారాల సమయం పడుతుంది. చింపాంజీ కుటుంబంలో ఏదైనా చనిపోయినప్పుడు , మిగిలిన చింపాంజీలు తమ కుటుంబ సభ్యులందరితో కలిసి మృతదేహం చుట్టూ గుండ్రంగా చేరి, మృతదేహాన్ని తాకుతూ ఉంటాయట. ఇది దాదాపు అన్ని చింపాంజీ గుంపులో కనిపిస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. అంతే కాకుండా…కొన్ని సందర్భాలలో, బిడ్డ చనిపోతే ఆ శరీరాన్ని అంటిపెట్టుకుని కొన్ని నెలలపాటు ఆ కళేబరాలను మోసుకుంటూ తిరుగుతూ కనిపిస్తుంటాయట.
భావోద్వేగంతో..
చింపాంజీల తర్వాత అంతలా బాధపడేది కుక్కలు. పెంపుడు కుక్కలు తమ యజమాని మరణించినపుడు ఎంతో భావోద్వేగానికి లోనవుతాయి. తమ గుంపులో ఏదైనా మరణిస్తే, ఏడుస్తూ దేహాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటాయి. జంతువులన్నింటిలో కుక్కలే ఎక్కువ ఎమోషనల్ అవుతాయని పరిశోధకులు అంటున్నారు.
సంతాపం తెలుపుతాయి
గుర్రాల్లో ఏదైనా మరణించిన్నప్పుడు, మిగతా గుర్రాలు ఆ మృతదేహం చుట్టూ నిలబడి నిశ్శబ్ద౦గా గంటల తరబడి ఉంటాయట. కొన్ని సార్లు తలను క్రిందకు దించి, మృతదేహానికి సంతాపం తెలుపుతాయట. అదే బాధలో నెలల తరబడి ఉంటూ మానసికంగా కృంగిపోతాయట.
ఓదార్పుతో…
మనిషి తర్వాత తెలివైన జీవుల్లో డాల్ఫిన్స్ కూడా ఒకటి. డాల్ఫిన్స్ తమ జంట కోల్పోయినప్పడు మనిషిలాగే మృతదేహాన్ని తట్టిలేపే ప్రయత్నం చేస్తుందట. ఒక డాల్ఫిన్ చనిపోయినప్పుడు, దానికి సన్నిహితమైన డాల్ఫిన్ బాధపడుతుంటే మిగిలిన డాల్ఫిన్స్ బాధపడుతున్న డాల్ఫిన్‌ని నిమురుతూ ఓదారుస్తాయట.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




