Health Tips: రాత్రి బ్రష్ చేయకపోతే ఏమవుతుంది..? నోటికి-నిద్రకు ఉన్న లింక్ ఏంటో తెలిస్తే అవాక్కే..
పళ్లు తోముకోవడానికి - నిద్రకు సంబంధం ఉందనే విషయం మీకు తెలుసా..? అవును రాత్రిపూట బ్రష్ చేసుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి. ఉదయం కంటే రాత్రిపూట బ్రష్ చేసుకోవడమే ఆరోగ్యానికి మంచిది. దంతాలు శుభ్రం చేసుకోకపోతే.. అది మీ చిరునవ్వుతో పాటు ప్రశాంతమైన నిద్రను కూడా దూరం చేస్తుంది.

చాలామందికి రాత్రి భోజనం చేశాక బ్రష్ చేసే అలవాటు ఉంటుంది. కానీ అది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు.. మీ నిద్ర, మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపే కీలకమైన అంశం. పడుకునే ముందు దంతాలు శుభ్రం చేసుకోకపోతే.. అది మీ చిరునవ్వుతో పాటు ప్రశాంతమైన నిద్రను కూడా దూరం చేస్తుంది. మనం నిద్రపోతున్నప్పుడు నోటికి విశ్రాంతి దొరుకుతుందని అనుకుంటాం. కానీ అప్పుడే నోటి వాతావరణంలో పెద్ద మార్పులు చోటుచేసుకుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట లాలాజలం ఉత్పత్తి దాదాపు సగానికి పడిపోతుంది. లాలాజలం అనేది నోటికి సహజమైన రక్షణ వ్యవస్థ లాంటిది. ఇది యాసిడ్స్‌ను అదుపులో ఉంచి, దంతాలపై ఉన్న ఎనామిల్‌ను రిపేర్ చేస్తుంది.
లాలాజలం తగ్గడం వల్ల బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. ఇది దంతాలపై పాచి పేరుకుపోవడానికి, చిగుళ్లు బలహీనపడటానికి కారణమవుతుంది. రాత్రి సమయంలో మన శరీరం తనను తాను రిపేర్ చేసుకుంటుంది. కానీ నోట్లో బ్యాక్టీరియా యాక్టివిటీ ఎక్కువగా ఉంటే ఈ హీలింగ్ ప్రాసెస్ ఆగిపోయి, ఇన్‌ఫ్లమేషన్ మొదలవుతుంది అని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఉదయం బ్రష్ చేయకపోవడం కన్నా రాత్రి బ్రష్ చేయకపోవడం ఎక్కువ హానికరమని హెచ్చరిస్తున్నారు.
నిద్ర సమస్యలు, నోటి ఆరోగ్యం
సరైన నిద్ర లేకపోతే రోగనిరోధక శక్తి తగ్గి, చిగుళ్ల సమస్యలు పెరుగుతాయి. అదేవిధంగా పుచ్చిపోయిన పళ్లు, చిగుళ్ల ఇన్ఫెక్షన్లు, లేదా నిద్రలో పళ్లు కొరుక్కోవడం వంటి సమస్యలు మీ నిద్ర నాణ్యతను దెబ్బతీస్తాయి. రాత్రిపూట మీ నోటిని పట్టించుకోకపోతే, అది మీ చిరునవ్వును, నిద్రను రెండింటినీ పాడు చేస్తుంది అని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.
ప్రశాంతమైన నిద్ర కోసం కొన్ని సూచనలు:
భోజనం, స్నాక్స్: పడుకోవడానికి కనీసం 60-90 నిమిషాల ముందు ఏమీ తినకండి. రాత్రిపూట తినే ఆహారం బ్యాక్టీరియాకు ఆహారంగా మారుతుంది.
పూర్తి శుభ్రత: రోజూ రాత్రి బ్రష్ చేయడం, ఫ్లాసింగ్, టంగ్ క్లీనింగ్ తప్పనిసరి.
మౌత్‌వాష్: ఘాటైన మెంతాల్ ఉన్న పేస్ట్‌లు కాకుండా, పుదీనా లేదా లవంగ నూనె ఉన్న మౌత్‌వాష్ వాడటం మంచిది. ఇది నోటి pH బ్యాలెన్స్‌ను కాపాడటానికి సహాయపడుతుంది.
ఇతర ఆరోగ్య సమస్యలున్నవారికి
గురక, పళ్లు కొరకడం వంటి సమస్యలు ఉన్నవారు డాక్టర్లు సూచించిన నైట్ గార్డులు వాడాలి. ఇవి దవడ కండరాలకు విశ్రాంతినిచ్చి, గాలి ప్రసరణను మెరుగుపరుస్తాయి. అలాగే రాత్రిపూట చిగుళ్ల వాపు రక్తంలో కలిసి గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి ప్రమాదాలను పెంచుతుంది. ముఖ్యంగా పిల్లలు, పంటి క్లిప్పులు ఉన్న టీనేజర్లు, మందులు వాడే వృద్ధులు, ఒత్తిడితో బాధపడేవారు రాత్రిపూట నోటి ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. పడుకోవడానికి మూడు, నాలుగు గంటల ముందు షుగర్ ఉన్న పానీయాలు, కెఫీన్, ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండటం వల్ల నిద్ర, నోటి ఆరోగ్యం రెండూ మెరుగుపడతాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




