Skin Whitening: ఖరీదైన ఫేస్‌ప్యాక్స్ వద్దు.. ఇంట్లో దొరికే చింతపండుతో నిమిషాల్లో అందాన్ని పెంచుకోండి!
Natural Skin Whitening: ఈ మధ్య కాలంలో చాలా మంది అందగా కనిపించాలని అనుకుంటున్నారు. చర్మం నలుపు రంగులోకి మారకుండా, కళ్ళ కింద లేదా ముఖంపై మచ్చలు రాకుండా, చర్మం కాంతివంతంగా, మెరుస్తూ ఉండాలని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే ఇందులో బయట దొరికే అనేక రకాల క్రీములను వాడుతూ ఉంటారు. కానీ వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందలేక పోతారు. కాబట్టి ఇంట్లో సహజంగా ముఖాన్ని ఎలా మెరిసేలా చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

మన వంటిట్లో దొరికే కొన్ని పదార్థాలు మన చర్మ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడుతాయని చాలా మందికి తెలియదు. అవును ఆరోగ్య నిపుణుల ప్రకారం మన ఇంట్లొ దొరికే చింతపండును చర్మానికి లేదా ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం కాంతి వంతంగా మెరుస్తుందట. చింతపండులో ఉండే ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు చర్మంపై బాహ్యంగా శుభ్రపరిచే ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఈ ఆమ్లాల ఎక్స్‌ఫోలియేటరీ ఎఫెక్ట్ వల్ల చర్మంపై పేరుకుపోయిన డెడ్ సెల్ లేయర్‌లు సులువుగా తొలగిపోతాయి. మొత్తంగా మన చర్మపై దాదాపు 16 నుండి 17 పొరలు ఉంటాయి. పైన ఉండే డెడ్ సెల్ లేయర్‌లు త్వరగా తొలగిపోవడం వల్ల లోపల ఉండే కొత్త, కాంతివంతమైన చర్మం బయటకు కనిపిస్తుంది. అప్పుడు మీ ముఖం ప్రకాశవంతంగా మెరుస్తుంది.
చర్మం లోపల ఉండే మెలనోసైట్స్ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణజాలం. కొన్నిసార్లు ఈ కణాలు మెలనిన్ అనే పదార్థాన్ని అధికంగా ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల చర్మం నలుపు అవుతుంది, ఎరుపు వర్ణం తగ్గిపోతుంది, కాంతి మందగిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో మీరు చింతపండు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు ఈ మెలనోసైట్స్‌ను నియంత్రించి, నలుపు వర్ణం ఉత్పత్తిని తగ్గిస్తాయి. తద్వారా చర్మ కాంతి పెరుగుతుంది. ఈ రెండు రకాల ప్రయోజనాలను చింతపండు మరియు, చింత గింజలు అందిస్తాయని 2012లో థాయ్‌లాండ్‌లోని కాస్మొటిక్స్ అండ్ నాచురల్ ప్రోడక్ట్స్ రీసెర్చ్ సెంటర్ వారు శాస్త్రీయంగా పరిశోధించి నిరూపించారు.
చింతపండును ఎలా ఉపయోగించాలి
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. గింజల కంటే చింతపండు సులభంగా లభిస్తుంది కాబట్టి, నాలుగు లేదా ఐదు చింత రెబ్బలు తీసుకుని పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌కు మూడు నుండి నాలుగు చెంచాల తేనె, ఒకటి నుండి రెండు చెంచాల నిమ్మరసం కలిపి బాగా మిశ్రమం చేయాలి. ఈ మిశ్రమాన్ని కాంతివంతంగా మారాలని, డెడ్ సెల్ లేయర్‌లు తొలగిపోవాలని, నలుపు తగ్గాలని కోరుకునే చేతులు, మెడ, ముఖ భాగాలకు మాస్క్‌లాగా అప్లై చేసి 20-25 నిమిషాల పాటు ఉంచి, ఆపై శుభ్రంగా కడిగేయాలి. ఇలా చేయడం వల్ల డెడ్ సెల్ లేయర్‌లు తొలగిపోయి చర్మ కాంతివంతంగా మెరుస్తుంది.
చింతగింజలను ఎలా ఉపయోగించాలి
చింత గింజలను వాడాలనుకునే వారు, చింత గింజలను పౌడర్ చేసుకుని, ఒకటి నుండి రెండు చెంచాల పౌడర్‌ను తమ అవసరాన్ని బట్టి తీసుకోవాలి. దీనికి సమానపాళ్లలో శనగపిండిని కలిపి, ఒకటి నుండి రెండు చెంచాల నిమ్మరసం కలిపితే పేస్ట్‌లా అవుతుంది. ఈ చింత గింజల పొడి, శనగపిండి, నిమ్మరసం మిశ్రమాన్ని ముఖం, చేతులు, మెడ భాగాలకు అప్లై చేసి 20-30 నిమిషాలు ఉంచుకుని కడిగేయాలి. ఈ రెండు పద్ధతులలో ఏది పాటించినా మంచి ప్రయోజనాలు కలుగుతాయని థాయ్‌లాండ్ పరిశోధకులు శాస్త్రీయంగా నిరూపించారు.
.(Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
