Telangana: సిరిసిల్ల కోర్టు సంచలన తీర్పు.. ఆ కేసులో 10 మందికి జీవిత ఖైదు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంచలన సృష్టించిన హత్య కేసుపై కోర్టు కీలక తీర్పు వెలువరించింది. బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో పది మంది నిందితులకు సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ జీవిత ఖైదు విధిస్తూ సోమవారం తీర్పు వెల్లడించారు. అదేవిధంగా ప్రతి నిందితుడికి రూ.6500 జరిమానా కూడా విధించారు.

బోయిన్‌పల్లి పీఎస్‌లో నమోదైన ఓ హత్య కేసులో సిరిసిల్లా జిల్లా కోర్టు సంచలన తీర్పులు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 10 మందికి జీవితఖైదు విధించింది. ఈ కేసుకు సంబంధించి జిల్లా ఎస్పీ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.. బోయినపల్లి మండలం స్థంభంపల్లి గ్రామానికి చెందిన తునికి మహేష్ అదే గ్రామానికి చెందిన ఓ యువతితో ప్రేమలో ఉండగా, ఈ విషయాన్ని వ్యతిరేకించిన అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వారికి ఎలాగైనా బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో పది మంది కలిసి మహేష్ ఇంటిపై దాడికి దిగారు. కట్టెలు, ఇనుప రాడ్లు, చేతులతో మహేష్ కుటుంబ సభ్యులపై దాడి చేయగా, అతని తండ్రి తునికి లక్ష్మీనారాయణ తీవ్రంగా గాయపడి మృతి చెందారు. ఈ ఘటనపై మృతుడి భార్య తునికి విజయ ఫిర్యాదు మేరకు బోయినపల్లి పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
అప్పటి వేములవాడ రూరల్ సీఐ నవీన్ కుమార్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయగా, అదనపు ఎస్పీ చంద్రయ్య పర్యవేక్షణలో వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్, కోర్టు మానిటరింగ్ ఎస్సై రవీందర్ నాయుడు ఆధ్వర్యంలో పోలీసులు కేసును బలంగా ముందుకు తీసుకెళ్లారు. కోర్టులో 20 మంది సాక్షులను ప్రవేశపెట్టి, శాస్త్రీయ ఆధారాలు సమర్పించారు. ప్రాసిక్యూషన్ తరఫున గత పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్ వాదనలు వినిపించారు. సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితులపై నేరం రుజువైందని నిర్ధారిస్తూ పది మందికి జీవిత ఖైదు విధించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి గితే మాట్లాడుతూ.. సమాజంలో నేరం చేసిన ఎవరూ శిక్ష నుంచి తప్పించుకోలేరు. కఠిన శిక్షల ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది.. అని పేర్కొన్నారు. కేసులో శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
