AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెకండ్‌హ్యాండ్‌ ల్యాప్‌టాప్‌ కొంటున్నారా? ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి

డిజిటల్ యుగంలో విద్యార్థులకు, ఉద్యోగులకు ల్యాప్‌టాప్ అత్యవసరంగా మారింది. అయితే పెరిగిన ధరల కారణంగా చాలామంది సెకండ్‌హ్యాండ్ ల్యాప్‌టాప్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ధరకు వస్తుందని తొందరపడి కొంటే రిపేర్లకు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి కొనుగోలు చేసే ముందు కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలించడం ఎంతో అవసరం!

సెకండ్‌హ్యాండ్‌ ల్యాప్‌టాప్‌ కొంటున్నారా? ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి
Buying Second Hand Laptops
Nikhil
|

Updated on: Jul 25, 2026 | 9:49 PM

Share

డిస్‌ప్లే పనితీరు, బ్యాటరీ సామర్థ్యం, హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే సెకండ్‌హ్యాండ్ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయాలి. ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మోసపోకుండా నాణ్యమైన ల్యాప్‌టాప్‌ను ఎంచుకోవడానికి దోహదపడే పూర్తి వివరాలను తెలుసుకుందాం!

డిస్‌ప్లే కండిషన్

ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేసే ముందు మొదట దాని బాహ్య రూపాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎక్కడైనా పగుళ్లు లేదా సొట్టలు ఉన్నాయేమో చూసుకోవాలి. ఇవి ఉంటే ల్యాప్‌టాప్ కిందపడిందని అర్థం, దీనివల్ల మదర్‌బోర్డుకు నష్టం వాటిల్లే ప్రమాదముంది. స్క్రీన్‌ను కొన్నిసార్లు తెరిచి మూసి చూడటం ద్వారా స్క్రూలు పటిష్టంగా ఉన్నాయో లేదో తెలుస్తుంది. వెనుకవైపు ఉండే స్క్రూలను గమనిస్తే అది గతంలో ఎప్పుడైనా రిపేరు అయిందో లేదో సులభంగా గుర్తించవచ్చు. అలాగే స్క్రీన్‌పై ఎలాంటి గీతలు, మచ్చలు ఉండకూడదు. యూట్యూబ్‌లో ‘డెడ్‌ పిక్సెల్‌ టెస్ట్’ వీడియోలను రన్ చేయడం ద్వారా డిస్‌ప్లే కండిషన్‌ను అంచనా వేయవచ్చు. కీబోర్డ్ మరియు టచ్‌ప్యాడ్ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో నోట్‌ప్యాడ్ ఓపెన్ చేసి పరీక్షించాలి.

బ్యాటరీ సామర్థ్యం

సెకండ్‌హ్యాండ్ ల్యాప్‌టాప్‌ల్లో ప్రధాన సమస్య బ్యాటరీతోనే వస్తుంది. దీనికోసం విండోస్ సెర్చ్‌బార్‌లో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ‘-powercfg /batteryreport’ అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. ఇందులో డిజైన్ కెపాసిటీ మరియు ఫుల్ చార్జ్ కెపాసిటీలను సరిపోల్చుకోవాలి. ఈ రెండింటి మధ్య తేడా ఎక్కువగా ఉంటే బ్యాటరీ త్వరలోనే పాడైపోతుందని అర్థం. అలాగే అమ్మే వ్యక్తి చెప్పిన స్పెసిఫికేషన్లు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి రన్ బాక్స్‌లో ‘dxdiag’ అని టైప్ చేయాలి. హెచ్‌డీడీ కంటే ఎస్ఎస్‌డీ (SSD) ఉన్న ల్యాప్‌టాప్‌లను ఎంచుకోవడం ఉత్తమం. యూఎస్‌బీ పోర్టులు, హెడ్‌ఫోన్ జాక్, వైఫై, బ్లూటూత్, వెబ్‌క్యామ్ మరియు స్పీకర్లను తప్పకుండా చెక్ చేయాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినప్పుడు ల్యాప్‌టాప్‌ను పూర్తిగా పరిశీలించిన తర్వాతే నగదు చెల్లించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందే అడ్వాన్స్ ఇవ్వకూడదు. వీలైతే ల్యాప్‌టాప్ ఒరిజినల్ బిల్లు, బాక్స్ ఉన్న వాటికే ప్రాధాన్యతనివ్వాలి. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న టెక్ నిపుణులను వెంట తీసుకెళ్లడం మరింత సురక్షితం. తొందరపడి తక్కువ ధర చూసి మోసపోకుండా, ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే సెకండ్‌హ్యాండ్‌లోనూ అత్యుత్తమ ల్యాప్‌టాప్‌ను సొంతం చేసుకోవచ్చు.

Follow Us