July 8, 2026
Subhash
భారతీయ వంటకాల్లో పసుపుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం రుచికోసమే కాదు, ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన ఔషధం. మార్కెట్లో దొరికే పసుపు పొడిలో రసాయనాలు, రంగులు కల్తీ అవుతున్నాయి.
లాభాల కోసం పసుపు పొడిలో చౌక రకపు స్టార్చ్ పౌడర్, పసుపు రంగు మట్టి, అత్యంత ప్రమాదకరమైన 'మెటానిల్ ఎల్లో' అనే కెమికల్ రంగును కలుపుతున్నారు. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
గాజు గ్లాసులో గోరువెచ్చని నీటిని తీసుకోండి. అందులో చెంచా పసుపు పొడి వేసి కలపకుండా వదిలేయండి. 15-20ని తర్వాత పసుపు పొడి మొత్తం గ్లాసు అడుగున చేరి, నీరు లేత పసుపు రంగులోకి మారితే అది అసలైన పసుపు.
నీటిలో పసుపు వేసిన వెంటనే ఆ నీరు ముదురు పసుపు, కాషాయ రంగులోకి మారిపోయి, పసుపు పొడి సరిగ్గా అడుగున చేరకుండా నీరంతా రంగుగా ఉండిపోతే.. అందులో రసాయన రంగులు కలిశాయని అర్థం.
కొద్దిగా పసుపు పొడిని మీ అరచేతిలో వేసుకోండి. మరో చేతి బొటనవేలితో దానిని 15 సెకన్ల పాటు గట్టిగా రుద్దండి. తర్వాత చేతిని దులపండి. మీ అరచేతికి గాఢమైన పసుపు రంగు అంటుకుని ఉంటే అది స్వచ్ఛమైనది.
ఒక గిన్నెలో కొద్దిగా పసుపు, నీరు కలిపి పేస్ట్‌లా చేయండి.కొన్ని చుక్కల నిమ్మరసం పిండండి. పసుపు రంగు మారకుండా అలాగే ఉంటే అది సేఫ్. ఒకవేళ అది ఎరుపు, గులాబీ రంగులోకి మారితే కల్తీ జరిగినట్లే.
ఎల్లప్పుడూ విడిగా దొరికే పసుపును కొనకండి. గుర్తింపు పొందిన బ్రాండ్స్, FSSAI మార్క్ ఉన్న ప్యాకెట్లను మాత్రమే ఎంచుకోండి. వీలైతే పసుపు కొమ్ములను తెచ్చి ఇంట్లోనే ఆడించుకోండి
కల్తీ పసుపును వాడటం వల్ల కడుపునొప్పి, కాలేయ సమస్యలు, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.మీ ఇంట్లోని పసుపును పరీక్షించి, మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.