AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీతి కథ: సింహం – తెలివైన నక్క.. బుద్ధి బలంతో సమస్యలను ఎదుర్కోవాలి..!

Moral Story: నీతి కథలు మనిషికి జీవిత పాఠాలు నేర్పించే అమూల్యమైన సంపద. వినోదంతో పాటు మంచి-చెడు మధ్య తేడాను అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇవి అందిస్తాయి. చిన్నారులలో నైతిక విలువలు, పెద్దల్లో ఆలోచనా పరిపక్వత పెంపొందించే శక్తి నీతి కథలకు ఉంది. సమయస్ఫూర్తి, తెలివితేటలు, చాకచక్యంతో సమస్యలను ఎలా ఎదుర్కోవాలో చెప్పే “నక్క చాకచక్యం” కథ కూడా అలాంటి ప్రసిద్ధ నీతి కథల్లో ఒకటి.

నీతి కథ: సింహం - తెలివైన నక్క.. బుద్ధి బలంతో సమస్యలను ఎదుర్కోవాలి..!
Lion And Clever Fox Moral StoryImage Credit source: AI
Janardhan Veluru
|

Updated on: May 19, 2026 | 3:21 PM

Share

నీతి కథల ముఖ్య ఉద్దేశం కేవలం వినోదాన్ని పంచడం మాత్రమే కాదు.. సమాజంలో ఒక వ్యక్తి ఎలా జీవించాలి? ఏది మంచిదో ఏది చెడ్డదో సరైన మార్గం చూపించడం దీని ఉద్దేశం. పూర్వ కాలం నుండి నేటి వరకు పిల్లలతో పాటు పెద్దల్లో నైతిక విలువలను పెంపొందించడానికి నీతి కథలు ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతున్నాయి. సమయస్ఫూర్తి, బుద్ధి బలాన్ని పెంపొందించే కొన్ని నీతి కథలు ప్రచారంలో ఉన్నాయి. అలాంటి వాటిలో నక్క చాకచక్యం నీతి కథను ఇప్పుడు చూద్దాం..

కథ:

అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక సింహం నివసించేది. అది ఆ అడవికి రాజు కాబట్టి దానికి గర్వం, కోపం చాలా ఎక్కువ. ఒకరోజు ఉదయం ఆ సింహం భార్య (ఆడసింహం) దానితో ఒక చేదు నిజం చెప్పింది. ‘మీ నోటి నుండి దుర్వాసన ఘోరంగా వస్తోంది’ అని అంది. ఆ మాట విన్న సింహం ఒక్కసారిగా సిగ్గుపడింది. అదే సమయంలో భార్యపై దానికి విపరీతమైన కోపం కూడా వచ్చింది. తన భార్య చెప్పింది నిజమేనా? కాదా? అని ఇతరులతో నిర్ధారించుకోవాలనుకుంది. అందుకోసం అది అడవిలోని మరో మూడు జంతువులను తన గుహ బయటకు పిలిపించింది.

గొర్రె నిజాయితీ..కానీ

మొదటగా సింహం వద్దకు అమాయకపు గొర్రె వచ్చింది. సింహం తన నోరు పెద్దగా తెరిచి, ‘గొర్రె! నా నోటి నుండి దుర్వాసన వస్తుందో లేదో నిజం చెప్పు?’ అని అడిగింది. రాజుగారు నిజాయితీగా సమాధానం కోరుకుంటున్నారని గొర్రె భావించింది. ఏమాత్రం దాచకుండా, ‘అవును రాజా! నీ శ్వాసలో ఏదో తేడా ఉన్నట్లుంది..నిజంగానే దుర్వాసన వస్తోంది’ అని ఉన్నది ఉన్నట్లే చెప్పింది.

అయితే గొర్రె చెప్పిన ఆ సూటి మాట మృగరాజు గారి అహాన్ని దెబ్బతీసింది. కోపంతో ఊగిపోయిన సింహం.. వెంటనే ఆ గొర్రెపైకి దూకి, దాన్ని చంపి తినేసింది.

తోడేలు ముఖస్తుతి

గొర్రె కథ ముగిశాక, సింహం తోడేలును లోపలికి పిలిచింది. ‘నేను అడిగిన దానికి కరెక్ట్ సమాధానం చెప్పాలి? నా నోటి నుండి దుర్వాసన ఏమైనా వస్తోందా?’ అని అడిగింది. ఉన్నది ఉన్నట్లు చెప్పినందుకు గొర్రెకు ఏం గతి పట్టిందో తోడేలుకు తెలుసు. కాబట్టి చాలా జాగ్రత్తగా సమాధానమిచ్చి, అబద్ధంతోనైనా రాజుగారిని ప్రసన్నం చేసుకోవాలని అనుకుంది.

తోడేలు నవ్వుతూ, ‘మహారాజా! మీ నోటి నుండి దుర్వాసన అని ఎవరు అన్నారు? అస్సలు లేదు..అది గులాబీల సువాసనలా ఎంతో మధురంగా ​​ఉంది’ అని అబద్ధపు పొగడ్తలతో ముఖస్తుతి చేసింది. కానీ, ఆ సమాధానం విన్న సింహం మరింతగా కోపంతో గర్జించింది. ‘ఓరి ముఖస్తుతి చేసేవాడా! నన్నే మోసం చేయాలనుకుంటున్నావా?’ అంటూ కోపంతో ఊగిపోతూ ఒక్కసారిగా తోడేలుపై దాడి చేసి దాన్ని కూడా చంపేసింది.

నక్క సమయస్ఫూర్తి

చివరికి, తెలివైన నక్క వంతు వచ్చింది. సింహం దాన్ని కూడా తన గుహ వద్దకు పిలిచి అదే ప్రశ్న వేసింది. అటు నిజం చెప్పిన గొర్రె చనిపోయింది..ఇటు అబద్ధపు పొగడ్తలు కురిపించిన తోడేలు కూడా చనిపోయింది. ఈ ఇద్దరి గతి చూసిన నక్కకు పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థమైంది.

నక్క ఒక్క క్షణం ఆలోచించి.. వెంటనే నటన ప్రారంభించింది. అది పదే పదే దగ్గుతూ, గొంతు సవరించుకుంటూ కాస్త నీరసంగా నటించింది. ఆ తర్వాత ఎంతో వినయంగా ఇలా చెప్పింది:

“ఓ మహారాజా..నన్ను క్షమించండి. గత కొన్ని రోజులుగా నాకు చాలా తీవ్రమైన జలుబు చేసింది. ముక్కు పూర్తిగా మూసుకుపోయింది. దీని కారణంగా, నాకు మంచిదైనా, చెడుదైనా ఎలాంటి వాసనా తెలియడం లేదు’.

ఆ సమాధానానికి సింహం ఏమీ చేయలేకపోయింది. నక్కను ఏమీ చేయకుండా ప్రాణాలతో వదిలిపెట్టింది. నక్క తన సమయస్ఫూర్తితో ప్రాణాలను కాపాడుకుని హమ్మయ్య..అని అక్కడి నుండి జారుకుంది.

నీతి:

ఈ కథ ద్వారా మనకు తెలిసేది ఏమంటే.. క్లిష్టమైన పరిస్థితులను అధిగమించాలంటే సమయస్ఫూర్తి ముఖ్యం. కొన్నిసార్లు నిజం చెబితే ప్రమాదం, అబద్ధం చెబితే కూడా మోసం అనుకున్నప్పుడు… మౌనంగా ఉండటం లేదా ఆ పరిస్థితి నుండి చాకచక్యంగా తప్పుకోవడం ప్రాణరక్షణ ఇస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో సమాధానం తెలిసినా మౌనంగా ఉండటం వివేకుల లక్షణమని ఈ నీతి కథ ద్వారా మనకు తెలుస్తోంది. ఉత్తమ పౌరుడిగా, వివేకవంతుడిగా తీర్చిదిద్దడమే నీతి కథల అసలైన ఉద్దేశం. ఇవి జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా ధైర్యంగా, నీతిగా ఎలా బ్రతకాలో నేర్పించే దిక్సూచీలు.

ఇవి కూడా చదవండి..

నక్క – నెమలి నీతి కథ: ‘No’ చెప్పడం నేర్చుకోండి.. ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టలేరు..

నీతి కథ: రామచిలుక – ఉడుతల పంచాయితీ.. ఇతరులపై ఫిర్యాదు చేయడం ఆపండి..!

Follow Us