AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీతి కథ: రామచిలుక – ఉడుతల పంచాయితీ.. ఇతరులపై ఫిర్యాదు చేయడం ఆపండి..!

A Moral Story: రామచిలుక - ఉడుతల మధ్య చిన్న అపార్థం పెద్ద పంచాయితీగా మారినప్పుడు.. మృగరాజు సింహం ఇద్దరి మాటలు ఓపికగా విని న్యాయం చేస్తుంది. కోపం, ఈర్ష్య, ఫిర్యాదుల కంటే పరస్పర అవగాహన, సానుకూల దృక్పథంతో ఇతరులను అర్థం చేసుకోవడం, నిష్పక్షపాత ఆలోచన ఎంత ముఖ్యమో చెప్పే హృద్యమైన నీతి కథ ఇది.

నీతి కథ: రామచిలుక - ఉడుతల పంచాయితీ.. ఇతరులపై ఫిర్యాదు చేయడం ఆపండి..!
Moral StoryImage Credit source: AI
Janardhan Veluru
|

Updated on: May 18, 2026 | 1:32 PM

Share

కోపతాపాలు, ఈర్ష్య, ఇతరులపై అలగడం వంటి మానవ సహజమైన లక్షణాలు. ఇంట్లో లేదా పనిచేసే ఆఫీసుల్లో ఇతరుల గురించి ఏదో ఒకటి పదేపదే ఫిర్యాదు చేయడం సహజంగా చాలా మందికి ఉండే దురలవాటు. మరీ ముఖ్యంగా ఇద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చినప్పుడు దాన్ని గోరింతలు కొండంతలు చేసే అలవాటు కొందరికి ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని పైవాళ్లకు ఫిర్యాదు చేసేవాళ్ళు ఉంటారు. అయితే ఎదుటివారి పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే.. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశముంటుంది. ఈ నీతి కథలో రామచిలుక – ఉడుతల మధ్య పంచాయితీ తీర్చిన సింహరాజు (మృగరాజు)లా అందరికీ ఉపయోగపడేలా, నిష్పక్షపాతంగా ఆలోచించే నైజం కొందరికే ఉంటుంది. మరి మృగరాజు చేసిన రామచిలుక – ఉడుతల పంచాయితీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం..

కథ:

ఒక దట్టమైన అడవిలో మృగరాజు జంతువులన్నింటికీ న్యాయం చెబుతూ ఉండేవాడు. ఒకరోజు ఒక రామచిలుక, రెండు ఉడుత పిల్లలు మృగరాజు ముందుకు వచ్చాయి. చేతులు కట్టుకుని నిలబడిన ఆ ఉడుతలను, రామచిలుకను చూసిన మృగరాజు..’మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? సమస్య ఏంటో తెలుసుకోవచ్చా?’ అని అడిగాడు.

అప్పుడు రామచిలుక ముందుకు వచ్చి, ‘మృగరాజా! ఈ అల్లరి ఉడుతలు మామిడి చెట్లపై ఉన్న మామిడి పండ్లను కొరికి వృధా చేసి కింద పడేస్తున్నాయి. దీనివల్ల రామచిలుకలమైన మాకు తినడానికి పూర్తి పండు ఒక్కటి కూడా దొరకడం లేదు. కాస్త వీటిని అడగండి’ అని ఫిర్యాదు చేసింది.

మృగతరాజు గంభీరమైన స్వరంతో గర్జిస్తూ, ‘ఉడుత పిల్లలారా! ఈ రామచిలుక చెబుతున్న దానికి మీ సమాధానం ఏంటి?’ అని అడిగాడు.

దానికి ఆ ఉడుత పిల్లలు, ‘మృగరాజా! మేము కావాలని ఆ మామిడి పండ్లను కొరికి పాడు చేయడం లేదు. ఒకరోజు మేము ఊరిలోకి వెళ్లినప్పుడు, ఒక అబ్బాయి తన స్నేహితుడితో ‘ఒరేయ్! ఈ మామిడి పండు చాలా రుచిగా ఉందిరా! కానీ ఒక వైపు కొరికి ఉంది’ అని చెప్పాడు. దానికి మరో అబ్బాయి, ‘ఒరేయ్! అది ఉడుత కొరికిన పండు అయి ఉంటుంది.. అందుకే అంత రుచిగా ఉంది. మా అమ్మ నాకు చెప్పింది’ అన్నాడు. మేము ప్రతి పండును కొరికి పెడితే ఆ మామిడి పండ్లన్నీ చాలా రుచిగా మారుతాయని, పిల్లలు వాటిని ఇష్టంగా తింటారని మేము అలా చేశాము’ అని తమ వైపు వాదనను వినిపించాయి.

ఉడుతల మాటలు విన్నమృగరాజు, ‘అవును! మీరు చెబుతున్నది కూడా నిజమే. నేను కూడా ఇదే మాట విన్నాను’ అంటూ ఉడుత పిల్లలకు మద్దతుగా మాట్లాడాడు. ఆ తర్వాత చిలుక వైపు తిరిగి, “చిలుకా..! నువ్వు ఎంత దూరమైనా ఎగరగలవు. ఎక్కడికైనా వెళ్లి ఏ చెట్టుపైన ఉన్న మామిడి పండ్లనైనా తినగలవు. కానీ ఈ చిన్న ఉడుతలు అన్ని చెట్లపైకి వేగంగా దూకలేవు కదా! కాబట్టి, ఈ చిన్న ఉడుతలు ఉన్న చెట్టును వదిలేసి, నువ్వు వేరే చెట్లపై ఉన్న మామిడి పండ్లను తిను” అని తీర్పు చెప్పాడు.

‘సరే మృగరాజా, మీరు చెప్పినట్లే వింటాను’ అని చెబుతూ, చిలుక పక్కనే ఉన్న మామిడి చెట్టు మీదున్న ఒక మామిడి పండును తినడానికి చూసింది. కానీ ఆ పండు అప్పటికే కొరికి ఉంది.

‘మృగరాజా! ఈ చెట్టుపై ఉన్న పండు కూడా కొరికే ఉంది!’ అని చిలుక చెట్టు పైనుంచి అరిచింది.

అప్పుడు ఆ అల్లరి ఉడుతలు ‘హా హా హా!’ అని నవ్వుతూ, ‘మృగరాజా! ఆ చెట్టుపై ఉన్న పండును కూడా మేమే కొరికి పెట్టాం. ఉడుత కొరికిన మామిడి పండు చాలా రుచిగా ఉంటుంది కదా, తనని తినమనండి’ అన్నాయి.

‘సరే.. సరే..!’ అని రామచిలుక ఆ కొరికిన మామిడి పండును కొరికి తింది. ‘అబ్బో! ఉడుత కొరికిన మామిడి పండు నిజంగానే తియ్యగా.. చాలా రుచిగా ఉంది!” అంది రామచిలుక ఆశ్చర్యంగా..

“సరే, మీరంతా ఎలాగోలా సంతోషంగా ఉంటే చాలు” అని చెప్పుకుంటూ  మృగరాజు నవ్వుకుంటూ తన గుహ వైపు వెళ్ళిపోయాడు.

నీతి:

ఇతరుల ఉద్దేశాలను తప్పుగా అర్థం చేసుకోకుండా, సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకుంటే అందరూ సంతోషంగా ఉండవచ్చు. జీవితంలో ప్రతి చిన్న విషయానికి ఇతరులపై పదేపదే ఫిర్యాదులు చేయడం వల్ల మనశ్శాంతి కరువవుతుంది. కొన్నిసార్లు అవతలి వారు చేసే పనుల వెనుక మంచి ఉద్దేశం ఉండవచ్చు లేదా వారి పరిస్థితి వేరుగా ఉండవచ్చు. కాబట్టి, పదేపదే ఫిర్యాదులు చేయడం ఆపి.. ఎదుటివారి దృక్పథాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే జీవితం ఈ మామిడి పండంత మధురంగా మారుతుంది!

Also Read: నక్క – నెమలి నీతి కథ: ‘No’ చెప్పడం నేర్చుకోండి.. ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టలేరు..

Follow Us