నక్క – నెమలి నీతి కథ: ‘No’ చెప్పడం నేర్చుకోండి.. ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టలేరు..
Moral Story: ఎవరినీ బాధ పెట్టకూడదనే భావనతో ప్రతి విషయానికి “అవును” చెప్పేస్తున్నారా? అయితే ఈ నక్క – నెమలి నీతి కథ మీకోసమే. నిజమైన ప్రేమ, మంచి మనసు అంటే మన వ్యక్తిత్వాన్ని కోల్పోవడం కాదు. అవసరమైనప్పుడు ధైర్యంగా “వద్దు” అని చెప్పడం కూడా జీవితంలో ఎంతో ముఖ్యమని ఈ కథ హృదయానికి హత్తుకునేలా తెలియజేస్తుంది.

ఎవరైనా మిమ్మల్ని ఏదైనా సహాయం కోరినప్పుడు.. ‘చేయలేను’ (No) అని చెప్పడానికి మీరు ఇబ్బంది పడుతుంటారా? అయితే ఈ నీతి కథ మీ కోసమే..నిజమైన ప్రేమ అంటే ఇతరుల కోసం మనల్ని మనం కోల్పోవడం కాదు.. మన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా ఇతరులను ప్రేమించడమే నిజమైన ప్రేమ. కొన్నిసార్లు మనం చెప్పడానికి వెనకాడే ఒక చిన్న ‘వద్దు’ అనే పదం..జీవితాంతం మన ప్రశాంతతను, మన గుర్తింపును కాపాడుతుంది. ఈ సత్యాన్ని వివరించే చిన్న కథ ఇది:
కథ:
ఒక అడవిలో ఒక నక్క, నెమలి స్నేహితులుగా ఉండేవి. నెమలికి ఆ నక్క అంటే చాలా ఇష్టం. నక్క ఏమి అడిగినా నెమలి చేసి పెట్టేది. ఇలా ఉండగా, ఒకరోజు నక్క నెమలి దగ్గరకు వచ్చి, దాని అందమైన ఈకలలో ఒకటి కావాలని అడిగింది. నెమలికి అది ఒక ఈక మాత్రమే అయినప్పటికీ, దానిని పీకినప్పుడు నొప్పి కలుగుతుంది. అయినప్పటికీ, నక్కకు ‘కాదు/వద్దు’ (NO) అని చెప్పలేకపోయింది.
“సరే తీసుకో, కానీ నాకు నొప్పి కలగకుండా పీక్కో” అని నెమలి చెప్పింది. నక్క ఒక ఈకను తీసుకుంది. ఆ తర్వాత రోజుల్లో కూడా, నక్క ప్రతిరోజూ నెమలి దగ్గరకు వచ్చి ఒక్కో ఈకను అడిగి తీసుకోవడం మొదలుపెట్టింది.
“నాకు నొప్పిగా ఉంది, ఇక పీకొద్దు” అని నెమలి నక్కతో మొదట్లోనే చెప్పి ఉండవచ్చు. కానీ, అలా చెబితే నక్కతో స్నేహం ఎక్కడ చెడిపోతుందో అనే భయంతో నెమలి మౌనంగా ఉండిపోయింది. తన బాధను పంటికింద భరిస్తూ నక్కకు సహాయం చేస్తూ వచ్చింది. ఇలా ఈకలను పీకుతూ పీకుతూ, ఒకరోజు నెమలి ఒంటిపై ఒక్క ఈక కూడా మిగలలేదు. ఏ రోజైతే నెమలి దగ్గర ఈకలు అన్నీ అయిపోయాయో, ఆ రోజు నుండి నక్క నెమలిని చూడటానికి రావడం మానేసింది.
నీతి:
ఈ కథ ద్వారా మనకు ఏమి అర్థమవుతుంది? ఎవరికైనా ‘వద్దు’ అని చెప్పడానికి భయపడి లేదా వారు మనల్ని విడిచి వెళ్లిపోతారని భయపడి అన్నింటినీ త్యాగం చేస్తామో.. ఆ వ్యక్తి చివరకు మనల్ని ఒంటరిని చేసి వెళ్ళిపోతాడు.
అందుకే మనం ముందే జాగ్రత్తగా ఉండాలి. మన మనసు అంగీకరించని వాటికి No చెప్పడం కూడా నేర్చుకోవాలి. అలా ఉండటం వల్ల ఆ తర్వాత వచ్చే బాధను తప్పించుకోవచ్చు, కనీసం మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవచ్చు. స్వార్థపూరితమైన వ్యక్తుల కోసం మీరు చేసే త్యాగాలు ఎప్పటికీ కృతజ్ఞతగా తిరిగి రావని అందరూ గుర్తించాలి. మీ దగ్గర ఇవ్వడానికి ఏమీ లేనప్పుడు, వారు మీ వైపు చూడరు.
కాబట్టి, ఇతరుల కోసం మీ ప్రశాంతతను కోల్పోవడం ఆపండి. మీకు మీరు నిజాయితీగా ఉండండి. మొహమాటం కొద్దీ ఎప్పుడూ NO అని చెప్పలేకపోతే మనకు కూడా ఇక్కడ నీతి కథలో నెమలికి ఎదురైన దుస్థితే ఎదురవుతుంది. సరైన సమయంలో చెప్పే ‘వద్దు/లేదు’ (No) అనే మాట మిమ్మల్ని మాత్రమే కాదు, మీ గుర్తింపును కూడా కాపాడుతుంది.
