AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హోటల్ వై-ఫై వాడుతున్నారా?: ట్రావెలర్స్‌ టార్గెట్‌గా సైబర్‌‌ దాడుల గురించి తెలుసా

Public Wi-Fi Networks.. ప్రయాణ సమయాల్లో హోటళ్లలో లభించే ఉచిత ఇంటర్నెట్ సేవలను వినియోగించుకోవడం చాలామందికి అలవాటుగా ఉంటుంది. అయితే పబ్లిక్ నెట్‌వర్క్‌ల ద్వారా జరుగుతున్న సరికొత్త సైబర్ దాడులు డిజిటల్ ప్రపంచంలో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. భద్రతా నిపుణులు వెల్లడించిన ఈ ప్రమాదకరమైన మోసాలకు సంబంధించిన విశేషాలను టెక్ ప్రియులు తెలుసుకోవడం ఎంతైనా అవసరం.

హోటల్ వై-ఫై వాడుతున్నారా?: ట్రావెలర్స్‌ టార్గెట్‌గా సైబర్‌‌ దాడుల గురించి తెలుసా
Hotel Public Wi Fi Networks
Nikhil
|

Updated on: Aug 12, 2026 | 9:30 PM

Share

కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు హోటల్‌లో ఫ్రీ వై-ఫై దొరికితే వెంటనే ల్యాప్‌టాప్, ఫోన్ కనెక్ట్ చేయడం చాలామందికి అలవాటుగా ఉంటుంది. అయితే ఇకపై పబ్లిక్ వై-ఫై ఉపయోగించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. సాధారణ వై-ఫై కనెక్షన్ల ముసుగులో జరుగుతున్న మోసాలు అమాయక వినియోగదారుల వ్యక్తిగత డేటాను ప్రమాదంలోకి నెడుతున్నాయి. హ్యాకర్ల సరికొత్త వ్యూహాలతో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రమాదకరమైన దాడుల పూర్తి వివరాలను తెలుసుకుందాం.

హోటళ్లలోని వై-ఫై నెట్‌వర్క్‌లను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు ట్రావెలర్స్‌పై సైబర్ దాడులకు దిగుతున్నట్లు భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా క్యాప్టివ్ క్రంచ్ పేరుతో జరుగుతున్న సైబర్ దాడుల్లో కంప్యూటర్లను టార్గెట్ చేస్తున్నారు. ఈ దాడుల ద్వారా పాస్‌వర్డ్‌లు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడంతో పాటు కొన్ని సందర్భాల్లో డివైస్‌లోని కెమెరా, మైక్రోఫోన్‌ను ఉపయోగించి వీడియో, ఆడియోను రికార్డ్ చేస్తున్నారు.

ఈ అంశానికి సంబంధించి రష్యా ప్రభుత్వ సపోర్ట్ ఉన్న హ్యాకింగ్ గ్రూపులతో సంబంధం ఉన్న స్టార్మ్-2945 అనే సంస్థ పేరు తెరపైకి వచ్చింది. ఈ గ్రూప్ ఫిబ్రవరి 2026 నుంచి క్యాప్టివ్ క్రంచ్ దాడులను నిర్వహిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ గుర్తించింది. హ్యాకర్లు ఫస్ట్ హోటల్‌లోని పబ్లిక్ వై-ఫై వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంటారు. ఆ తర్వాత నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయ్యే వినియోగదారులను తమ కంట్రోల్‌లో ఉన్న నకిలీ వెబ్‌సైట్లకు మళ్లించే ప్రయత్నం చేస్తారు.

మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఆన్‌లైన్ సర్వీసులను పోలి ఉండే నకిలీ డొమైన్లను ఉపయోగించడం ఈ దాడుల్లో కీలకంగా ఉంటుంది. వినియోగదారులు తమ ఇంటర్నెట్ కనెక్షన్‌లో సమస్య వచ్చిందని భావిచేలా చేసి, సమస్యను పరిష్కరించేందుకు సాఫ్ట్‌వేర్, బ్రౌజర్ అప్‌డేట్ చేయాలని నమ్మిస్తారు.

మాల్‌వేర్ రూపంలో ముప్పు

ఇక్కడే అసలు ప్రమాదం మొదలవుతుంది. వినియోగదారు నకిలీ అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేస్తే, అది నిజమైన సాఫ్ట్‌వేర్ కాకుండా మాల్‌వేర్‌గా ఉండొచ్చు. అలా కంప్యూటర్‌లో రిమోట్ యాక్సెస్ ట్రోజన్ లాంటి హానికరమైన సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కసారి మాల్‌వేర్ సిస్టమ్‌లోకి ప్రవేశించిన తర్వాత హ్యాకర్లు డివైజ్ కంట్రోల్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటారు. ఆ తర్వాత పాస్‌వర్డ్‌లు, పర్సనల్ డేటా లాంటి సమాచారాన్ని దొంగిలించడంతో పాటు కెమెరా, మైక్రోఫోన్‌ను ఉపయోగించి ఆడియో, వీడియోలను రికార్డు చేసే అవకాశం ఉంటుంది.

ప్రయాణ సమయంలో వీలైనంత వరకు హోటల్, ఇతర పబ్లిక్ వై-ఫైకి బదులుగా మీ మొబైల్ హాట్‌స్పాట్, నమ్మకమైన ప్రైవేట్ నెట్‌వర్క్‌ను ఉపయోగించడం మంచిది. ముఖ్యంగా తెలియని వై-ఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయినప్పుడు ఎలాంటి ఫైళ్లు, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు డౌన్‌లోడ్ చేయకపోవడం మంచిది. అప్‌డేట్ అవసరమని పాప్ అప్ వచ్చినా వెంటనే క్లిక్ చేయకూడదు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను సంబంధిత కంపెనీ అధికారిక వెబ్‌సైట్, అధికారిక యాప్ స్టోర్ నుంచే చేయాలి.

భద్రతా జాగ్రత్తలు

కంప్యూటర్, మొబైల్‌లో యాంటీవైరస్, సేఫ్టీ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం మంచిది. అనుమానాస్పద లింకులు, ఫేక్ లాగిన్ పేజీలు, తెలియని డౌన్‌లోడ్స్‌కు దూరంగా ఉండాలి. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. సో, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. డిజిటల్ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఇటువంటి సైబర్ దాడుల నుంచి సులభంగా రక్షించుకోవచ్చు.

Follow Us