కళింగపట్నం వైపు దూసుకువస్తున్న తుఫాన్.. 3 రోజులపాటు భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సెప్టెంబర్ 23 రాత్రి కళింగపట్నం సమీపంలో ఉత్తర ఆంధ్ర–దక్షిణ ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కోస్తాంధ్రలో అత్యంత భారీ వర్షాలు, బలమైన గాలులు, తెలంగాణలోనూ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలకు హెచ్చరికలు జారీ చేసింది.

తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వాయుగుండం తీరం దాటే సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. పశ్చిమ-మధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంపై ఉన్ననిన్నటి ‘తీవ్ర వాయుగుండం’ గత 6 గంటలులో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా కదులుతూ ఈ రోజు ( సెప్టెంబర్ 23, 2026న )ఉదయం 8:30 గంటల సమయానికి, ఇది 18.0° ఉత్తర అక్షాంశం, 84.6° తూర్పు రేఖాంశం వద్ద అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఇది కళింగపట్నం (ఆంధ్రప్రదేశ్)కు ఆగ్నేయంగా సుమారు 60 కి.మీ, విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)కు తూర్పు-ఈశాన్యంగా 140 కి.మీ, గోపాల్‌పూర్ (ఒడిశా)కు దక్షిణంగా 150 కి.మీ, పూరీ (ఒడిశా)కు దక్షిణ-నైరుతిగా 240 కి.మీ దూరంలో ఉంది.ఈ ‘తీవ్ర వాయుగుండం’ పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ, ఈ రోజు( సెప్టెంబర్ 23, 2026) రాత్రి సమయానికి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – దక్షిణ ఒడిశా తీర ప్రాంతలయిన విశాఖపట్నం, గోపాల్‌పూర్ మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది.
పశ్చిమ మధ్య, ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతం పై ఉన్న’తీవ్ర వాయుగుండం’ కేంద్రం నుండి, మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా థాయ్‌లాండ్ గల్ఫ్ వరకు ఒక ద్రోణి, సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి వ్యాపించి ఉంది. పశ్చిమ మధ్య, దానిని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతం పై ఉన్న’తీవ్ర వాయుగుండం’ కేంద్రం నుండి, కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, కర్ణాటక మీదుగా ఆగ్నేయ అరేబియా సముద్రం వరకు, సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 7.6 కిలోమీటర్ల మధ్య ఎత్తులో ఉన్న నిన్నటి ద్రోణి ఈ రోజు బలహీనపడింది.
వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :-
కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం ;-
బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల, అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 50-60 గరిష్టముగా 70 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల, అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 50-60 గరిష్టముగ 70 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 గరిస్టముగ 60 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
రాయలసీమ:-
బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 గరిస్టముగ 60 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 గరిష్టముగ 60 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 గరిస్టముగ 50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
తెలంగాణలో భారీ వర్షాలు..
వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు 8 జిల్లాలకు అతి భారీ, 20 జిల్లాలకు భారీ వర్ష సూచనలు చేశారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు అతి భారీ వర్ష సూచనలున్నాయి.. హైదరాబాద్‌లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక రేపు, ఎల్లుండి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
