రోజూ.. చికెన్, మటన్ లేనిదే ముద్ద దిగట్లేదా? అయితే మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే!
రోజువారీ మాంసాహారం అలవాటు ప్రాణాల మీదికి తెస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెడ్ మీట్, చికెన్ అతిగా తినడం గుండెపోటు, కిడ్నీ, లివర్ సమస్యలు, డయాబెటిస్‌కు దారితీస్తుంది. పిల్లల్లో ఊబకాయం, హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. పెంపకంలో వాడే హార్మోన్లు, యాంటీబయోటిక్స్ మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. మాంసాహారాన్ని పరిమితంగా తీసుకోవడం అత్యవసరం.

ఈ మధ్య కాలంలో ఉదయం దాకా ఆరోగ్యంగా ఉన్నవారు.. సడన్‌గా గుండెపోటుతో కుప్పకూలిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ సడన్ హార్ట్ ఎటాక్‌లకు అతిగా మాంసాహారం తినడం కూడా ఒక ప్రధాన కారణమని కార్డియాలజిస్టులు స్పష్టం చేస్తున్నారు. మటన్ జీర్ణమయ్యేటప్పుడు అధిక మొత్తంలో ‘యూరిక్ యాసిడ్’ ‘నైట్రోజనస్ వ్యర్థాలు’ విడుదలవుతాయి. వీటన్నింటినీ వడపోయడానికి కిడ్నీలు పరిమితికి మించి కష్టపడాల్సి వస్తుంది. క్రమంగా ఇది కిడ్నీ స్టోన్స్, దీర్ఘకాలిక కిడ్నీ వైఫల్యానికి దారితీస్తుంది.
మటన్‌లో పీచు పదార్థం సున్నా. దీనివల్ల జీర్ణవ్యవస్థ నెమ్మదిస్తుంది. దీంతో తీవ్రమైన మలబద్ధకం, పైల్స్, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ సమస్యలు వస్తాయి. మటన్‌లోని కొవ్వు కాలేయంలో పేరుకుపోతుంది. దీనివల్ల మద్యం తాగని వారిలో కూడా ‘నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్’ సమస్య వచ్చి కాలేయ పనితీరు దెబ్బతింటుంది. మటన్‌లో ఉండే హామ్-ఐరన్, నైట్రేట్లు, కొవ్వు పదార్ధాలు ఇన్సులిన్ నిరోధకతను పెంచుతాయి. వారానికి 3-4 సార్లు రెడ్ మీట్ తినేవారిలో షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదం 30 శాతం కంటే ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు తేల్చాయి. మటన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో ‘C-రియాక్టివ్ ప్రొటీన్’ స్థాయిలు పెరిగి, శరీరమంతటా అంతర్గత వాపు పెరుగుతుంది. ఇది కీళ్ళు, రక్తనాళాలు త్వరగా దెబ్బతినడానికి కారణమవుతుందని కార్డియాలజిస్ట్‌లు చెబుతున్నారు.
పిల్లల జీర్ణవ్యవస్థ, హార్మోన్ల వ్యవస్థ చాలా సున్నితంగా ఉంటాయి. వారికి అతిగా మటన్ లేదా ప్రాసెస్ చేసిన మాంసాహారం ఇవ్వడం వల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయి. మటన్‌లో కేలరీలు, కొవ్వు శాతం చాలా ఎక్కువ. పిల్లలకు వ్యాయామం లేదా శారీరక శ్రమ తగ్గడం, దాంతో పాటు మటన్ ఎక్కువగా తినిపించడం వల్ల శరీరంలో క్రొవ్వు పెరిగి చిన్నతనంలోనే విపరీతమైన లావు బారిన పడతారు.
ప్రస్తుతం మేకలు, గొర్రెలు, కోళ్ళ పెంపకంలో త్వరగా బరువు పెరగడానికి ‘ఎస్ట్రోజెన్’, ‘స్టెరాయిడ్’ వంటి గ్రోత్ హార్మోన్లను ఉపయోగిస్తున్నారు. అలాంటి మాంసం తిన్న పిల్లల్లో ముఖ్యంగా ఆడపిల్లల్లో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి, వయసుకు మించి ముందస్తుగా శారీరక పరిపక్వత వచ్చే ప్రమాదం పెరిగింది. పిల్లల జీర్ణకోశం మటన్‌ను త్వరగా జీర్ణం చేసుకోలేదు. దీనివల్ల కడుపునొప్పి, వాంతులు, దీర్ఘకాలిక మలబద్ధకం, ఆకలి మందగించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. చిన్నతనంలోనే రక్తపోటు బారినపడే ప్రమాదం ఉంది. ఒకప్పుడు 40 ఏళ్ళు దాటిన వారిలోనే కొలెస్ట్రాల్, బిపి కనిపించేవి. కానీ అతిగా రెడ్ మీట్ తినే పిల్లల్లో 12 నుంచి15 ఏళ్ల వయస్సులోనే చెడు కొలెస్ట్రాల్, ఉప్పు ప్రభావం వల్ల రక్తపోటు పెరగడం కనిపిస్తోంది. జీవాలకు ఇచ్చే యాంటీబయోటిక్ ఆనవాళ్ళు మాంసం ద్వారా పిల్లల శరీరంలోకి వెళ్ళినప్పుడు, వారి జీర్ణక్రియా బాక్టీరియా దెబ్బతింటుంది. భవిష్యత్తులో వారికి సాధారణ జ్వరం లేదా ఇన్ఫెక్షన్లు వచ్చినా సాధారణ మందులు పనిచేయని ప్రమాదం ఏర్పడుతుంది.
మటన్ లాంటి రెడ్ మీట్‌లో ‘సాచురేటెడ్ ఫ్యాట్’, కొలెస్ట్రాల్ అత్యధికంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తిన్నప్పుడు, రక్తనాళాల గోడలపై కొవ్వు పలకలు పేరుకుపోయి రక్త ప్రసరణను ఆపేస్తాయి. మనం రెడ్ మీట్ తిన్నప్పుడు కడుపులోని బ్యాక్టీరియా దానిని జీర్ణం చేస్తూ ట్రై మిథైల్ అమైన్ ఎన్-ఆక్సైడ్ అనే ఒక ప్రమాదకరమైన రసాయనాన్ని విడుదల చేస్తుంది. ఇది రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని అనేక రెట్లు పెంచుతుంది. ఈ తీవ్రమైన కొవ్వు, రక్తం గడ్డకట్టే స్వభావం కలసి.. గుండెకు రక్త ప్రసరణను ఒక్కసారిగా నిలిపివేస్తాయి. దీంతో ఎలాంటి సంకేతాలు లేకుండానే మనిషి సడన్ హార్ట్ స్ట్రోక్‌తో ప్రాణాలు కోల్పోతున్నాడు. మాంసం త్వరగా ఉడకడానికి, రుచి కోసం వాడే అధిక ఉప్పు, మసాలాలు రక్తపోటును విపరీతంగా పెంచి గుండెపై అదనపు భారాన్ని వేస్తున్నాయి.
ఆరోగ్యపరంగా చూస్తే చికెన్ కంటే మటన్ మరింత ప్రమాదకరం. దీనివల్ల కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు రావడమే కాకుండా.. యూరిక్ యాసిడ్ ఎక్కువై కీళ్ల నొప్పులు వస్తాయి. అంతేకాదు, అతిగా రెడ్ మీట్ తినడం వల్ల పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరించింది. చికెన్ లో కొవ్వు తక్కువ ఉన్నప్పటికీ.. వాటి పెంపకంలో వాడే పద్ధతులు విషంతో సమానం. కోళ్ళు కేవలం 35 నుంచి 40 రోజుల్లోనే 2 నుంచి 3 కిలోల బరువు పెరగడానికి వాటికి ‘సమర్థవంతమైన గ్రోత్ ప్రమోటర్లు’, హార్మోన్ ఇంజెక్షన్లు, అనబోలిక్ స్టెరాయిడ్లు ఇస్తారు. కోళ్ళు చనిపోకుండా ఉండటానికి పరిమితికి మించిన యాంటీబయోటిక్స్ దాణాలో కలిపి మేపుతారు. మేకలు, గొర్రెలను త్వరగా పెంచడానికి హార్మోన్లు కలిపిన ఆహారాన్ని ఇస్తారు. అంతేకాదు, మాంసం కోసే కొద్దిసేపటి ముందు జంతువుల నరాల్లోకి లేదా శరీరంలోకి విపరీతంగా నీటిని ఎక్కించడం ద్వారా బరువు ఎక్కువగా ఉండేలా చూస్తుంటారు. ఇలాంటి హార్మోన్లు, యాంటీబయోటిక్స్ నిండిన కల్తీ మాంసాన్ని రోజూ తినడం వల్ల మన శరీరంలో తీవ్రమైన మార్పులు వస్తున్నాయి.
స్టెరాయిడ్లు, హార్మోన్లు ఉన్న చికెన్ తినడం వల్ల చిన్న పిల్లల్లో అకాల శారీరక ఎదుగుదల కనిపిస్తోంది. మహిళల్లో PCOD, థైరాయిడ్, వంధ్యత్వ సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. కోళ్ళకు వాడే యాంటీబయోటిక్స్ మాంసం ద్వారా మన శరీరంలోకి చేరుతున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో మనకు ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే, ఎంత శక్తివంతమైన యాంటీబయోటిక్ వాడినా శరీరం స్పందించని ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతోంది. వారానికి 100 నుంచి 150 గ్రాములకు మించి మాంసాహారం తినకూడదు. మటన్ తినడాన్ని నెలకు ఒకటి లేదా రెండు సార్లకే పరిమితం చెయ్యాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
