Ear Health: చెవిలో గులిమి తీస్తున్నారా.. జాగ్రత్త! త్వరలోనే మీ గొంతు మూగబోవచ్చు..
స్నానం చేసిన తర్వాత లేదా ఖాళీగా ఉన్నప్పుడు చెవిలో బడ్స్ పెట్టుకుని తిప్పడం చాలామందికి అలవాటు. ఇలా చేయడం వల్ల చెవిలోని మురికి (గులిమి) శుభ్రపడుతుందని భావిస్తుంటారు. కానీ ఈ చిన్న అలవాటు మీ వినికిడి శక్తిని శాశ్వతంగా దూరం చేస్తుందని మీకు తెలుసా? చెవి శుభ్రత విషయంలో మనం చేసే పొరపాట్లు, వైద్యులు చెబుతున్న హెచ్చరికల గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి.

చెవిలో గులిమి అనేది ఒక వ్యర్థం మాత్రమే కాదు.. అది మన వినికిడి వ్యవస్థను కాపాడే ఒక కవచం. దీనిని తొలగించడానికి కాటన్ బడ్స్, పిన్నులు లేదా ఇతర వస్తువులను వాడటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. 70 శాతానికి పైగా చెవి గాయాలకు ఈ బడ్స్ వాడకమే కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు చెవులను ఎలా శుభ్రం చేసుకోవాలి? ప్రకృతి సిద్ధంగా చెవి తనను తాను ఎలా కాపాడుకుంటుంది? అనే ఆసక్తికర విషయాలు మీకోసం.
లోపలికి నెట్టే ప్రమాదం: మనం వాడే కాటన్ బడ్స్ చెవిలోని గులిమిని బయటకు తీయడానికి బదులుగా, దానిని మరింత లోపలికి నెడతాయి. దీనివల్ల లోపల ఉండే సున్నితమైన కర్ణభేరి (Ear Drum) దెబ్బతినే అవకాశం ఉంది. గులిమి లోపలికి వెళ్లడం వల్ల తీవ్రమైన నొప్పి, ఇన్ఫెక్షన్లు తలెత్తుతాయి. క్రమంగా ఇది వినికిడి లోపానికి దారితీస్తుంది.
సహజమైన రక్షణ కవచం: నిజానికి చెవిలో ఉండే గులిమి (Ear Wax) ఒక మురికి కాదు. అది దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా మెదడు వైపు వెళ్లకుండా అడ్డుకునే ఒక రక్షణ కవచం. ప్రకృతి సిద్ధంగా చెవి తనను తాను శుభ్రం చేసుకునే గుణాన్ని కలిగి ఉంటుంది. మనం మాట్లాడుతున్నప్పుడు లేదా ఆహారం నములుతున్నప్పుడు చెవిలోని గులిమి సహజంగానే బయటకు వచ్చేస్తుంది. దీనిని ప్రత్యేకంగా శుభ్రం చేయాల్సిన అవసరం లేదు.
ఇతర వస్తువుల వాడకం – ఇన్ఫెక్షన్ల ముప్పు: కొందరు పిన్నులు, అగ్గిపుల్లలు లేదా ఇతర పదునైన వస్తువులను చెవిలో పెడుతుంటారు. వీటివల్ల చెవిలోని సున్నితమైన చర్మంపై గాయాలు అవుతాయి. బయటి వస్తువుల ద్వారా బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించి వాపు, చీము పట్టడం వంటి సమస్యలను కలిగిస్తుంది.
వైద్యుల సలహా: చెవిలో విపరీతమైన నొప్పి ఉన్నా.. గులిమి గడ్డకట్టి వినికిడి తగ్గినట్టు అనిపించినా సొంత ప్రయోగాలు చేయకూడదు. వెంటనే నిపుణులైన వైద్యుడిని సంప్రదిస్తే, వారు సురక్షితమైన పరికరాలతో చెవికి ఎటువంటి హాని కలగకుండా శుభ్రం చేస్తారు.
