Monsoon Footwear: వర్షాకాలం కోసం చెప్పులు షాపింగ్ చేస్తున్నారా?.. జారిపడకుండా ఉండాలంటే ఇవే బెస్ట్!
వర్షాకాలంలో బయటకు వెళ్లడం అంటే చాలా చిరాగ్గా ఉంటుంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని కానీ బయటకు రాలేం. గొడుగు పెట్టుకోవాలి, లేదా రెయిన్ కోట్ వేసుకోవాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఓ విషయంలో మాత్రం చాలా మంది పొరపాట్లు చేస్తుంటారు. వర్షాకాలంలో సరైన చెప్పులు వాడరు. ఈ కారణంగానే రోడ్డుపైన నడుస్తున్నప్పుడో, మెట్లు ఎక్కుతున్నప్పుడో ఉన్నట్టుండి జారి పడిపోతారు. దీని వల్ల తీవ్ర గాయాలయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.

వర్షాకాలంలో రోడ్లు తడిగా, జారిపోయే అవకాశం ఉన్నందున, సరైన పాదరక్షలు ధరించడం చాలా అవసరం. ప్రమాదాలను నివారించడంతో పాటు, మీ పాదాలను సురక్షితంగా ఉంచడానికి వర్షాకాలంలో ఎలాంటి చెప్పులు ఎంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎంపికలో ముఖ్యమైన అంశాలు: వర్షాకాలంలో చెప్పులు కొనేటప్పుడు అవి త్వరగా ఆరుతున్నాయో లేదో గమనించాలి. కొన్ని చెప్పులు తేమను ఎక్కువసేపు పట్టి ఉంచి దుర్వాసనకు, క్రిములకు కారణమవుతాయి. కాబట్టి, వాటర్‌ప్రూఫ్ లక్షణాలున్న ఫుట్‌వేర్‌ను ఎంచుకోవడం ఉత్తమం. వర్షంలో నడిచేటప్పుడు సౌకర్యంగా ఉండే ఫ్లిప్‌ఫ్లాప్‌లు లేదా లైట్ వెయిట్ చెప్పులు మంచివి, ఇవి తడిసినా పెద్దగా అసౌకర్యాన్ని కలిగించవు.
పట్టు, సౌకర్యం: బురద లేదా తడి నేలపై నడిచేటప్పుడు జారిపడకుండా ఉండేందుకు చెప్పుల కింది భాగంలో (సోల్) మంచి పట్టు (గ్రిప్) ఉండేలా చూసుకోవాలి. మరీ ఫ్లాట్‌గా ఉన్న చెప్పులు తడి ప్రదేశాల్లో జారిపోయే అవకాశం ఉంది. యాంటీ-స్లిప్ సోల్స్ ఉన్న చెప్పులు సరైన ఘర్షణను అందించి, జారిపడటాన్ని నివారిస్తాయి. తరచుగా ప్రయాణించేవారైతే, సోల్ ఫ్లెక్సిబుల్‌గా ఉండటంతో పాటు, పాదాలకు ఎలాంటి హాని చేయని విధంగా ఉండాలి. కొన్నిసార్లు తడి నేలపై నడవడం వల్ల కాళ్లు బెణుకుతాయి. కాబట్టి యాంకిల్ సపోర్ట్ ఉండే చెప్పులను ఎంచుకోవడం మంచిది.
గాలి తగిలేలా: వర్షాకాలంలో ఫుట్‌వేర్‌ను శుభ్రంగా, పొడిగా ఉంచడం కష్టం. అందుకే, త్వరగా ఆరిపోయేవి, సులువుగా శుభ్రం చేయగలిగేవి ఎంచుకోవాలి. వాటర్‌ప్రూఫ్ అయినప్పటికీ, చెప్పులు లేదా షూస్‌కు గాలి తగిలేలా (బ్రీతబుల్) ఉండాలి. సరైన వెంటిలేషన్ లేకపోతే లోపల తేమ పేరుకుపోయి దుర్వాసన, ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. రబ్బర్ లేదా సిలికాన్ వంటి జారే స్వభావం లేని మెటీరియల్స్‌తో చేసిన ఫుట్‌వేర్ సురక్షితం. లెదర్ లేదా స్వెడ్ వంటివి వర్షానికి త్వరగా పాడవుతాయి. స్టైల్‌కు ప్రాధాన్యత ఇస్తూనే, వర్షాకాలానికి అనుగుణంగా మంచి గ్రిప్, సౌకర్యవంతమైన, త్వరగా ఆరిపోయే పాదరక్షలను ఎంచుకోవడం వల్ల సురక్షితంగా ఉండవచ్చు.




