Migraine: మైగ్రేన్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. ఇంట్లో సింపుల్ టిప్స్ తో ఉపశమనం పొందండి ఇలా..
డబ్బు డబ్బు అంటూ డబ్బు సంపాదన కోసం నేటి మనిషి అల్లాడుతున్నాడు కానీ.. వాస్తవంగా చెప్పాలంటే.. ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే ఆరోగ్యంగా జీవించే వ్యక్తి అని చెప్పవచ్చు. అందుకనే మన పెద్దలు ఆరోగ్యమే మహా భాగ్యం అని చెప్పారు. అయితే ప్రస్తుతం మనిషి జీవనశైలిలో వచ్చిన అనేక మార్పులతో రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. అటువంటి వ్యాధులలో ఒకటి మైగ్రేన్. ఈ సమస్య తలెత్తినప్పుడు ఎన్ని రకాల మందులు తీసుకున్నా ఉపశమనం లభించదు. అయితే మైగ్రేన్ సమస్యను మందులు తీసుకోకుండానే నయం చేయగల కొన్ని పద్దతుల గురించి తెలుసుకుందాం..

ఒత్తిడి లేదా నిరాశ, మైగ్రేన్ ఉండటం సాధారణం. ఈ మైగ్రేన్ ని తెలుగులో పార్శ్వపు నొప్పి అంటారు. సాధారణంగా తలలో ఒక పక్క తీవ్రమైన నొప్పి వస్తుంది. ఆ సమయంలో తలపై ఎవరో కొడుతున్నట్లు, లేదా సూదులతో గుచ్చుతున్నట్లు ఉంటుంది. అందుకనే మైగ్రేన్ బారిన పడిన వారు పడే బాధ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు. అప్పుడు వైద్యుడి సలహా మేరకు వెంటనే చికిత్స తీసుకుంటారు. ఇది తాత్కాలికంగా ఉపశమనం ఇస్తుంది. అయితే ఇంట్లో కొన్ని పద్ధతులను ప్రయత్నించడం ద్వారా కూడా మైగ్రేన్ నుంచి ఉపశమనం పొందవచ్చని మీకు తెలుసా..
మైగ్రేన్ కేవలం తలనొప్పి అని ప్రజలు అనుకుంటారు.. అయితే NCBI నివేదిక ప్రకారం.. ఇది మెదడులోని వివిధ భాగాలలో తీవ్రమైన నొప్పిని కలిగించే నాడీ సంబంధిత రుగ్మత. తలలో సగం భాగంలో నొప్పి ఈ ఆరోగ్య సమస్య అంటే మైగ్రేన్ అతిపెద్ద లక్షణం అని చెబుతారు. ఎవరికైనా మైగ్రేన్ వస్తే తలనొప్పి మాత్రమే కాదు వికారం, వాంతులు, చూడటంలో, మాట్లాడటంలో ఇబ్బంది పడతాడు.
మైగ్రేన్‌ను పూర్తిగా నిర్మూలించడం అంత సులభం కాదని అంటారు. అయితే తగిన మందులు లేదా పద్ధతులను ప్రయత్నించడం ద్వారా ఖచ్చితంగా ఈ సమస్య నుంచి ఉపశనం పొందవచ్చు. మైగ్రేన్ ప్రభావాన్ని తగ్గించాలంటే ఒత్తిడిని తగ్గించుకోవాలని నిపుణులు అంటున్నారు. దీనితో పాటు జీవనశైలిలో కూడా చాలా మార్పులు చేసుకోవాలి. ఈ రోజు మైగ్రేన్ వల్ల కలిగే నొప్పి నుంచి ఉపశమనం కలిగించే కొన్ని ఇంటి నివారణలను గురించి తెలుసుకుందాం..
మైగ్రేన్‌ను సహజంగా నయం చేసే ఈ పద్ధతులను ప్రయత్నించండి..
వేడి లేదా చల్లని కంప్రెస్ ఉపశమనం ఇస్తుంది. ఈ రెండు రకాల కంప్రెస్‌లు తలనొప్పికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయని నిరూపించబడ్డాయి. నుదిటిపై, గొంతు వెనుక కోల్డ్ కంప్రెస్‌ను అప్లై చేస్తే నొప్పి చాలా వరకు తగ్గుతుంది. మరోవైపు గొంతు, భుజంపై హాట్ కంప్రెస్‌ను అప్లై చేస్తే కండరాలను సడలిస్తుంది. మైగ్రేన్ నొప్పి నుంచి మంచి ఉపశమనం కలిగిన అనుభూతి చెందుతారు.
శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోండి శరీరంలో నీరు లేకపోయినా నాడీ సంబంధిత సమస్యలు వస్తాయని.. వాటిల్లో మైగ్రేన్ ఒకటి అని చాలా తక్కువ మందికి తెలుసు. శరీరంలో తగినంత నీరు లేకపోతే శరీరం ఆక్సిజన్ లేకపోవడంతో బాధపడాల్సి వస్తుందని చెబుతారు. దీనివల్ల మైగ్రేన్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. హెల్త్‌లైన్ ప్రకారం మనం రోజూ కనీసం 2.5 లీటర్లు లేదా 8 నుండి 10 గ్లాసుల నీరు త్రాగాలి. కొబ్బరి నీళ్ళు కూడా తాగవచ్చు.
ఒత్తిడిని నిర్వహించడం నేర్చుకోండి ఒత్తిడి అనేది మైగ్రేన్‌కు ప్రధాన కారణం. ఒత్తిడిని తగ్గించుకునే విధానం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ప్రతిరోజూ యోగా లేదా ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి నిర్వహణలో సహాయపడుతుందని మానసిక ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఒత్తిడిని నియంత్రించడం వల్ల అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. వంధ్యత్వంతో బాధపడుతున్న వ్యక్తులు ఒత్తిడి నిర్వహణను తెలుసుకుంటే.. ఈ సమస్యను తక్కువ సమయంలోనే నయం చేసుకోవచ్చు. లేదా వంధ్యత్వాన్ని అధిగమించవచ్చు.
తగినంత నిద్ర నిద్రకు.. మైగ్రేన్‌కు మధ్య అవినావభావ సంబంధం ఉంది. ప్రతిరోజూ 7 నుంచి 9 గంటలు నిద్రపోతే చాలా వరకు మైగ్రేన్ సమస్యను నివారించవచ్చు. మంచి నిద్ర కోసం బెడ్ రూమ్ కి వెళ్లి ఫోన్‌ను దూరంగా పెట్టి.. లైట్లు ఆఫ్ చేయండి. పడుకునే ముందు గదిని సౌకర్యవంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి.
తలనొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు ఔషధాలు అల్లం వాడటం ద్వారా మైగ్రేన్ నుండి ఉపశమనం పొందవచ్చు. మైగ్రేన్ సమస్య బారిన పడినప్పు అల్లం టీ తయారు చేసుకుని త్రాగండి. దీనితో పాటు పిప్పరమింట్ ఆయిల్ కూడా ఉపయోగించవచ్చు. ఈ ఆయిల్ చల్లగా ఉంటుంది. దీన్ని నుదుటికి అప్లై చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. మైగ్రేన్ నివారించడానికి ఒత్తిడి లేకుండా ఉండటం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలి ఈ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ 5 ఇంటి నివారణలు ఈ సమయంలో తలనొప్పి నుంచి చాలా వరకు ఉపశమనం కలిగిస్తాయి. అయితే ఈ పద్ధతులను ప్రయత్నించడంతో పాటు, నిపుణుడు లేదా వైద్యుడి సలహా తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)








