Snake Festival: 300 ఏళ్ళనాటి సాంప్రదాయం.. పాములను మెడలో ధరించి ఊరేగిస్తూ పూజలు.. ఎక్కడంటే..
హిందువులు పాములను దైవంగా భావించి పుజిస్తారు. నాగుల చవితి, నాగ పంచమి వంటి పర్వదినాల్లో పాము పుట్టదగ్గరకు వెళ్లి పూజలు చేసి పాముకి పాలు పోస్తారు. ఇలా చేయడం వలన నాగులు తమకు ఎటువంటి హానికలిగించవని నమ్మకం. అయితే నాగ పంచమి రోజున బీహార్ లోని ఒక ప్రాంతంలో అరుదైన సంప్రదాయం పాటిస్తారు. నది నుంచి తీసిన విషపూరితమైన పాములను భుజాలపై వేసుకుని ఊరేగింపుగా భగవతి ఆలయానికి తీసుకువెళతారు. 300 సంవత్సరాల నాటి ఈ సంప్రదాయం గురించి ఈ రోజు తెలుసుకుందాం...

దేశవ్యాప్తంగా నాగ పంచమి రోజున పాములకు పాలు పోసే సంప్రదాయాన్ని పాటిస్తారు. అయితే దేశంలో ఒక గ్రామంలో నాగ పంచమి సందర్భంగా వందలాది విషపు పాములను నది నుంచి బయటకు తీసుకువస్తారు. అంతేకాదు ఇక్కడి ప్రజలు నది నుంచి బయటకు తీసిన పాములతో పిల్లలలా ఆడుకుంటారు. ఈ సంప్రదాయం 300 సంవత్సరాల నాటిది. నాగ పంచమి సందర్భంగా ఈ అద్భుతమైన, భయానక దృశ్యాన్ని చూడటానికి ప్రజలు దూర ప్రాంతాల నుంచి వస్తారు. ఈ గ్రామం పేరు నవ్‌టోల్ . ఈ గ్రామం బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలోని మన్సూర్చక్ బ్లాక్‌లో ఉంది.
ఈ గ్రామాన్ని ప్రజలు పాముల గ్రామం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడి ప్రజలు తమ సంప్రదాయాన్ని అనుసరించడానికి తమ ప్రాణాలను సైతం పట్టించుకోరు. ప్రతి ఏడాది నాగ పంచమి సందర్భంగా ఇలాంటి దృశ్యం కనిపిస్తుంది. నవ్‌టోల్ గ్రామ ప్రజలు తమ సంప్రదాయాన్ని అనుసరించడానికి బాలన్ నదిలోకి దూకి.. క్షణాల్లో వందలాది పాములను పట్టుకుంటారు. తాము పట్టుకున్న పాములను తమ మెడలో వేలాడదీసుకుని డప్పుల దరువులకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ భగవతి ఆలయానికి చేరుకుంటారు.
300 ఏళ్ల నాటి సంప్రదాయం ఈ సమయంలో ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడటానికి వందలాది మంది నది ఒడ్డుకు చేరుకుంటారు. ఈ గ్రామం ఈ సంప్రదాయం 300 సంవత్సరాల నాటిదని చెబుతారు. గ్రామంలో నివసించే రౌబీ దాస్ భగవతికి గొప్ప భక్తుడు. అతను మొదట ఈ ప్రదేశంలో నాగ పంచమి సందర్భంగా ఈ సంప్రదాయాన్ని ప్రారంభించాడు. అప్పటి నుంచి అతని వారసులు, గ్రామస్తులు ఈ సంప్రదాయాన్ని ఉత్సాహంతో అనుసరిస్తున్నారు. దేశంలోని మిగిలిన ప్రాంతాల కంటే ముందు ఈ గ్రామంలో నాగ పంచమి పండుగ జరుపుకుంటారు.
ఈ పండగ వెనుక పర్యావరణ ప్రాముఖ్యత ఏమిటి? నాగ పంచమి రోజున జరిగే సర్ప ఉత్సవం గురించి గ్రామస్తులు చెబుతూ.. పాములు ప్రకృతిలోని మీథేన్ వాయువును గ్రహిస్తాయని.. ఇది పర్యావరణ సమతుల్యతకు ముఖ్యమైనదిగా భావిస్తారు. సనాతన ధర్మంలో పాముల ప్రాముఖ్యతను గుర్తించడానికి, ప్రకృతితో సామరస్యాన్ని కొనసాగించడానికి పాములను పూజిస్తారు. విష్ణువు, శివుడు, తాంత్రికులతో పాముల అనుబంధం ఈ సహజ ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది.
నాగ పంచమి ఎందుకు ముందుగా? బెగుసరాయ్‌లో నాగ పంచమి పండుగను మిథిలా పంచాంగం ఆధారంగా జరుపుకుంటారు. మిథిలా పంచాంగం ప్రకారం ఈసారి నాగ పంచమిని 15వ తేదీన జరుపుకుంటారు. అయితే దేశవ్యాప్తంగా జూలై 29న నాగ పంచమి పండుగ జరుపుకోనున్నారు. శ్రావణ కృష్ణ పక్షంలో వచ్చే ఈ నాగ పంచమిని మౌన పంచమి అని కూడా అంటారు. ఈ సమయంలో మానస దేవిని పూజిస్తారు. శుక్ల పక్షంలో వచ్చే నాగ పంచమిలో కాల సర్ప దోషం తొలగింపు కోసం ప్రత్యేక పూజలు చేస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








