Kitchen Hacks: వర్షాకాలంలో బియ్యం, పిండి పాడవకుండా ఎలా నిల్వ చేయాలి.. నేచరల్ టిప్స్ మీ కోసం
వర్షాకాలం వచ్చిందంటే ఎండల నుంచి ఉపశమనం ఇవ్వడమే కాదు వాతావరణం చల్లగా మారుతుంది. గాలిలో తేమ వ్యాపిస్తుంది. అంతేకాదు ఇంట్లో ఉండే బియ్యం, పప్పులు వంటి వస్తువులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. బియ్యం, పిండి, పప్పులు వంటి ఆహార దినుసుల్లో పురుగులు పట్టడం సర్వసాధారణం అవుతుంది. ఈ సమస్య సర్వసాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో తలెత్తేదే. ఈ నేపధ్యంలో ఈ రోజు వర్షాకాలంలో కీటకాల నుంచి బియ్యం, పిండిని ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాం.

రుతుపవనాలు ప్రారంభమయ్యాయి. ప్రతిచోటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సీజన్ ఒకవైపు వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుండగా.. అదే సమయంలో వంటగదికి సంబంధించిన అనేక సమస్యలను కూడా కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో వంటగదిలో నిల్వ ఉండే కొన్ని వస్తువులను పురుగుల బారిన పడకుండా రక్షించుకోవడం చాలా ముఖ్యం, ఇందులో పిండి, బియ్యం రెండు ముఖ్యమైనవి. వాస్తవానికి గాలిలో తేమ కారణంగా పిండి, బియ్యం త్వరగా చెడిపోయి కీటకాలకు నిలయంగా మారుతాయి.
ఎంత జాగ్రత్తగా నిల్వ చేసిన పిండి నుంచి దుర్వాసన వస్తుందని, బియ్యంలో చిన్న చిన్న పుగురులు పడుతున్నాయని మహిళలు సర్వసాధారణంగా చేసే ఫిర్యాదు. వీటితో ఆహారం చేసుకుంటే ఆ ఆహార పదార్ధాలు రుచి పాడవుతుంది.. అంతేకాదు ఆరోగ్యానికి కూడా హానికరం. కనుక వర్షాకాలంలో పిండిని, బియ్యాన్ని నిల్వ చేసుకోవడానికి సరైన మార్గాన్ని తెలుసుకోవడం ముఖ్యం. ఈ రోజు వర్షాకాలంలో పిండిని, బియ్యాన్ని సురక్షితంగా ఉంచుకునే టిప్స్ తెలుసుకుందాం..
గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయండి వర్షాకాలంలో గాలిలో తేమ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక బియ్యం, పప్పు ధాన్యాలు లేదా పిండిని మూత లేని పాత్రలలో వేసుకుంటే.. అవి చల్లగా మారతాయి. ఈ తేమ కారణంగా కీటకాలు వృద్ధి చెందుతాయి. కనుక బియ్యం వంటి ఆహార ధాన్యాలను ఎల్లప్పుడూ స్టీల్ లేదా ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ కంటైనర్లు వంటి గాలి చొరబడని కంటైనర్లలో వేసుకుని నిల్వ చేసుకోవాలి. వీటి మూతని గట్టిగా పెట్టుకోవాలి. అవసరమైతే.. ఆహార ధాన్యాలను నిల్వ చేసుకునేందుకు డబుల్ కవర్ ఉపయోగించడం ద్వారా తేమ అస్సలు ప్రవేశించదు.
బియ్యం నిల్వ చేయడానికి వీటిని జోడించండి బియ్యం లేదా పప్పులను నిల్వ చేసే డబ్బాల్లో 2-3 ఎండిన బిర్యానీ ఆకులు, 4-5 వేప ఆకులు లేదా 1-2 వెల్లుల్లి రెబ్బలను ఉంచడం వల్ల కీటకాలు పట్టవు. వీటి నుంచి వచ్చే ఘాటైన వాసన కీటకాలు పట్టకుండా చేస్తుంది. ఈ వస్తువుల ప్రత్యేకత ఏమిటంటే వీటిని బియ్యంలో పెట్టడం వలన బియ్యం నాణ్యత లేదా రుచి తగ్గదు. పైగా బియ్యాన్ని ఎక్కువ కాలం నిల్వ చేయడానికి ఇదే ఉత్తమ మార్గం.
పిండిని ఎలా భద్రంగా ఉంచాలంటే పిండి తేమను త్వరగా గ్రహిస్తుంది. తరచుగా పిండిలో పురుగులు చేరతాయి. పిండిలో కీటకాలు, పరుగులు చేరకుండా ఉండాలంటే.. పిండిని నిల్వ చేసిన పాత్రలో 4-5 లవంగాలు లేదా దాల్చిన చెక్క ముక్కను ఉంచవచ్చు. ఈ రెండు సుగంధ ద్రవ్యాలు తేమను గ్రహించి దుర్వాసన రాకుండా నిరోధిస్తాయి. అంతేకాదు పిండిని తాజాగా ఉంచుతాయి. పిండి రుచి కూడా చెడిపోదు.
అప్పుడప్పుడు ఎండలో పెట్టండి. కొన్నిసార్లు వర్షాకాలంలో కూడా అప్పుడప్పుడు ఎండ తీవ్రంగా ఉంటుంది. అలాంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. బియ్యం, పిండి, పప్పులు మొదలైన వాటిని ఒక పెద్ద ప్లేట్ లో పోసుకుని 1-2 గంటల పాటు ఎండలో పెట్టండి. ఈ సమయంలో వీటిని నిల్వ చేసే పాత్రలను బాగా కడిగి ఎండకు ఆరబెట్టండి. ఈ ప్రక్రియ తేమతో పాటు క్రిములను తొలగించడంలో సహాయపడుతుంది.
చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేసుకోండి మీ ఇంట్లో ఒక నెల రోజుల కంటే ఎక్కువ కాలం నిల్వ చేసుకునే రేషన్ ఉంటే.. వాటిని వంటగదిలో పెట్టుకోవద్దు. వంటగదిలో చాలా వేడి, ఆవిరి ఉంటుంది. ఇది తేమను పెంచుతుంది. కనుక ఎక్కువ మొత్తంలో ఉన్న బియ్యం, పిండి, పప్పు వంటి వాటిని ఇంట్లోని స్టోర్ రూమ్‌లో, తక్కువగా ఉపయోగించే అల్మారాలో లేదా రిఫ్రిజిరేటర్‌లో స్థలం ఉంటే దానిలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన బియ్యం, పిండి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. కీటకాల బారిన పడవు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)








