సోంపు తిన్నాక విషంగా మారుతుందా.. పచ్చటి గింజల వెనుక దాగున్న అసలు నిజం ఇదే..
సోంపు గింజలు మన ఆహార సంస్కృతిలో అంతర్భాగం. భోజనం తర్వాత జీర్ణక్రియ కోసం లేదా మౌత్ ఫ్రెషనర్‌గా సోంపు వాడటం మనకు అలవాటు. అయితే మీరు అమితంగా ఇష్టపడే ఈ సోంపు మీ ఆరోగ్యానికి ముప్పుగా మారుతోందని మీకు తెలుసా..? అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

హోటల్‌కి వెళ్లినా, శుభకార్యాలకు వెళ్లినా భోజనం తర్వాత సోంపు తినడం మనకు అలవాటు. సోంపు జీర్ణక్రియకు మేలు చేస్తుందని, నోటి దుర్వాసనను పోగొడుతుందని మనం నమ్ముతాం. కానీ ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న సోంపులో ప్రమాదకరమైన రసాయనాలు, సింథటిక్ రంగులు కలుస్తున్నట్లు వెల్లడైంది. ఇటీవల మధ్యప్రదేశ్‌లో ఏకంగా 900 కిలోల కల్తీ సోంపును అధికారులు సీజ్ చేయడం కలకలం రేపుతోంది.
సోంపును ఎందుకు కల్తీ చేస్తున్నారు..?
పాతబడిపోయిన, రంగు వెలిసిన సోంపు గింజలు తాజాగా కనిపించడానికి వ్యాపారులు సింథటిక్ గ్రీన్ కలర్‌ను ఉపయోగిస్తున్నారు. అలాగే సోంపు బరువు పెంచడానికి కూడా కొన్ని రసాయనాలను కలుపుతున్నారు. ఈ రసాయనాలు శరీరంలోకి చేరితే కాలేయం, కిడ్నీ సమస్యలతో పాటు దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సోంపు అసలైనదేనా..? ఇలా టెస్ట్ చేయండి:
మీరు వాడుతున్న సోంపు స్వచ్ఛమైనదో కాదో తెలుసుకోవడానికి ఈ చిన్న పరీక్షలు చేయండి
అరచేతి పరీక్ష: కొద్దిగా సోంపును తీసుకుని మీ అరచేతిలో ఉంచి గట్టిగా రుద్దండి. ఒకవేళ మీ చేతికి ఆకుపచ్చ రంగు అంటుకున్నా లేదా సోంపు రంగు వెలిసినా అది కల్తీ అని అర్థం. కొంచెం నీటి చుక్క వేసి రుద్దితే కల్తీని మరింత స్పష్టంగా గుర్తించవచ్చు.
నీటి పరీక్ష: ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ సోంపు వేయండి. వేసిన వెంటనే నీరు గాఢమైన ఆకుపచ్చ రంగులోకి మారితే అందులో కృత్రిమ రంగులు ఉన్నట్లే. సహజమైన సోంపు రంగు నీటిలో చాలా నెమ్మదిగా కలుస్తుంది.
రంగును గమనించండి: సహజమైన సోంపు ఆకుపచ్చగా ఉన్నప్పటికీ, అది మరీ ప్రకాశవంతంగా మెరుస్తూ ఉండదు. మరీ ఎక్కువ మెరుపు కనిపిస్తే అది రసాయన రంగు అని అనుమానించాలి.
రుచి – వాసన: కొన్ని గింజలను నోట్లో వేసుకుని నమలండి. చేదుగా ఉన్నా లేదా వింత వాసన వస్తున్నా ఆ సోంపు పాడైపోయిందని, దానిని రంగులతో కప్పిపుచ్చారని గుర్తించాలి.
జాగ్రత్తలు తప్పవు
సోంపు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కల్తీ సోంపు ప్రాణాపాయం తెచ్చిపెడుతుంది. అందుకే విపరీతమైన రంగులు ఉన్న సోంపును కొనుగోలు చేయకండి. వీలైనంత వరకు సేంద్రీయ పద్ధతిలో పండించిన సోంపును ఎంచుకోవడం శ్రేయస్కరం.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




