వాస్తు దీపిక.. సత్సంతానానికి సరైన మార్గం.. వాస్తు గ్రంథాలు ఈ సమస్యకు కొన్ని పరిష్కార మార్గాలు..
కాగా, అనేక కారణాలవల్ల గర్భం ధరించకపోవడం కూడా ఈ రోజుల్లో జరుగుతోంది. ఇందులో ప్రధానమైన కారణం పురుషుల్లోనూ లేదా స్త్రీలలోనూ పునరుత్పత్తి సామర్థ్యం లేకపోవడం.

దాంపత్య జీవితంలో గర్భం దాల్చడం అనేది ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇది వరకు రోజుల్లో తప్పనిసరిగా గర్భం ధరించాల్సిన పరిస్థితులు ఉండేది. సమాజం నుంచి, ముఖ్యంగా బంధువుల నుంచి ఈ విషయంలో బాగా ఒత్తిడి ఉండేది. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. అవసరమైతేనే, ఇష్టమైతేనే గర్భం ధరించడానికి దంపతులకు అవకాశం కలుగుతోంది. కాగా, అనేక కారణాలవల్ల గర్భం ధరించకపోవడం కూడా ఈ రోజుల్లో జరుగుతోంది. ఇందులో ప్రధానమైన కారణం పురుషుల్లోనూ లేదా స్త్రీలలోనూ పునరుత్పత్తి సామర్థ్యం లేకపోవడం. శారీరకంగా, మానసికంగా ఎటువంటి సమస్యా లేకపోయినప్పటికీ దంపతులు సంతాన యోగానికి దూరమైపోవడం జరుగుతుంది. ఇందుకు కారణం ఏమిటనేది దంపతులతో సహా ఎవరికీ అంతు పట్టడం లేదు. ప్రామాణిక వాస్తు గ్రంథాలు ఈ సమస్యకు కొన్ని పరిష్కార మార్గాలు చూపిస్తున్నాయి.
ఐదు ప్రకృతి శక్తులైన నీరు, అగ్ని, వాయువు, భూమి, ఆకాశం మీద ఆధారపడి వాస్తు శాస్త్రం రూపుదిద్దుకుంది. ఈ ఐదు శక్తులు సహకరిస్తే తప్ప ఒక జీవి ప్రాణం పోసుకోవడానికి అవకాశం లేదని వాస్తు శాస్త్రం భావిస్తోంది. అగ్నితత్వం తోడైతే తప్ప దంపతుల మధ్య సంయోగం కానీ, సంపర్కం గానీ సాధ్యం కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. సాధారణంగా ఈ అగ్నితత్వం ఆగ్నేయ దిక్కులోనే నిక్షిప్తమై ఉంటుంది. ఇక్కడ ఉండే అగ్నితత్వమే గర్భం రావడానికి కారణం అవుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలన్నా, వారి మధ్య సంయోగం ఏర్పడాలన్నా వారు ఆగ్నేయానికి అభిముఖంగా తల పెట్టుకొని శయనించాల్సి ఉంటుంది.
అయితే, ఆగ్నేయ దిక్కు తరువాత అంతగా ప్రాముఖ్యం కలిగిన దిక్కు వాయవ్యం. వాయవ్య దిక్కును పర్జన్య అని కూడా అంటారు. ఈ దిక్కున దంపతులు శయనిస్తే తప్పకుండా గర్భం దాల్చడం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ దిశలో బయటికి వచ్చే ఎనర్జీ శరీరాన్ని గర్భం దాల్చడానికి అనువుగా సిద్ధం చేస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. స్త్రీలు గర్భం ధరించిన తర్వాత వాయవ్య దిశ నుంచి తప్పనిసరిగా ఆగ్నేయ దిశకు మారడం మంచిది. దీనివల్ల గర్భం గట్టిపడటం జరుగుతుంది. దక్షిణ దిశకు, ఆగ్నేయ దిశకు మధ్యన శయనించడం వల్ల గర్భం దాల్చే అవకాశం ఉండదు.




అదే విధంగా, పడకగది తూర్పు, ఆగ్నేయ దిశల మధ్య ఉన్నా, పశ్చిమం, వాయవ్య దిశల మధ్య ఉన్నా గర్భం నిలవడం కష్టం అవుతుంది. సంతానం కలగటానికి అనేక అవరోధాలు ఎదురవుతాయి. అంతే కాదు, వాయవ్యంలో స్నానాల గది ఉన్నప్పుడు కూడా సంతానం కలగటం కష్టం అవుతుంది. వాయవ్య దిశ ఏ విధంగానూ బలహీనపడటం, అస్తవ్యస్తంగా ఉండటం సంతాన యోగానికి, సంతానానికి మంచిది కాదు. ఇంట్లో గనుక అగ్నితత్వం బలహీనంగా ఉంటే పురుషులలో పునరుత్పత్తి సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది. దక్షిణ దిశలో కానీ, ఆగ్నేయ దిశలో కానీ స్నానాల గది ఉన్నా, ఈశాన్యంలో వంటగది ఉన్నా పునరుత్పత్తి సామర్థ్యం అడుగంటి పోతుంది.
మేడ మెట్లతో ప్రమాదం
ఇంటి మధ్యలో మేడ మెట్లు ఉండటం దంపతులకు ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇంటి మధ్యలో బరువు ఉండకూడదు. ఇంటి మధ్యలో మెట్లు ఉంటే దాంపత్య జీవితంలో కూడా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. గర్భం ధరించడం అన్నది జరిగే పని కాదని తేలిపోతుంది. మహిళలు గర్భం ధరించిన తర్వాత చీకటి గదిలో కానీ, చీకటి ప్రదేశాల్లో కానీ పడుకోవడం గర్భానికి మంచిది కాదు. గర్భిణీలు తప్పనిసరిగా వెలుతురులోనే నిద్రించడం మంచిది. వారు పడుకునే గదిలో చిన్న దీపమైనా వెలుగుతూ ఉండాలి. గర్భిణీలు దక్షిణం వైపున తలపెట్టి, ఉత్తరం వైపున కాళ్లు పెట్టి పడుకోవడం వల్ల గర్భం క్షేమంగా ఉంటుంది.
ఇక గర్భిణులు నల్లటి వస్త్రాలు ధరించకపోవడం మంచిది. వారు పడుకునే గదిలో దంపతుల ఫోటోలను గానీ, పసిపిల్లల ఫోటోలను గానీ ఏర్పాటు చేయడం మానసిక ఆరోగ్యానికి చాలా అవసరం. గర్భం ధరించిన మహిళలు ఎటువంటి పరిస్థితులలోనూ చూరు కింద లేదా ఇంటి మధ్యలో నిద్రపోకూడదు. ఇంట్లో బోన్సాయ్ మొక్కలను, ముళ్ళ మొక్కలను ఉంచకపోవడం మంచిది. ఆగ్నేయ దిశలో పండ్ల మొక్కలు లేదా పూల మొక్కలు పెంచడం వల్ల గర్భిణీలు ఆరోగ్యంగా ఉండటం జరుగుతుంది. పడక గదిలో ఎటువంటి పరిస్థితులలోనూ అద్దాలు ఉంచకూడదు. దేవుళ్ళ బొమ్మలను నైరుతి దిశలో అమర్చడం శ్రేయస్కరం.