Soya Chunks: ప్రొటీన్ కోసం వీటిని అతిగా తింటున్నారా.. మీ పొట్టలోకి చేరేది విషమే..
సోయా చంక్స్ ను ప్రొటీన్ అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారంగా చాలామంది భావిస్తారు. అయితే, ఒక గట్ హెల్త్ నిపుణురాలు చెప్పిన విషయాలు విని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. సోయా చంక్స్ ను అసలు తినకపోవడమే మంచిదని, అవి జంక్ ఫుడ్ కన్నా ప్రమాదకరమైనవని నిపుణులుహెచ్చరిస్తున్నారు. ప్రొటీన్ సోర్స్ గా భావించే వీటి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

సోయా చంక్స్, సోయా చాప్ మన ఇళ్లలో మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా, చవకైన, ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారంగా ప్రసిద్ధి చెందాయి. అధిక ప్రొటీన్ ఉండే స్నాక్ గా మార్కెట్లో ప్రచారం పొందిన సోయా చంక్స్ నిజానికి మీరు అనుకున్నంత ఆరోగ్యకరమైనవి కాకపోవచ్చు. పోషకాల గనిగా భావించే సోయా చంక్స్, మేలు చేయకపోగా హాని చేయవచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గట్ (జీర్ణవ్యవస్థ), హార్మోన్ల ఆరోగ్య నిపుణురాలు తనిషా బావా, సోయా నగ్గెట్స్, సోయా చాప్ వంటి సోయా ఉత్పత్తుల నిజ స్వరూపం గురించి అవగాహన కల్పిస్తున్నారు. సెప్టెంబర్ 23న ఇన్ స్టాగ్రామ్ వీడియోలో ఆమె మాట్లాడుతూ, ఈ ఉత్పత్తులకు ఇచ్చే “హై-ప్రొటీన్ ట్యాగ్” కేవలం మోసం అని, దీనివల్ల ఆరోగ్యానికి తీవ్రమైన పరిణామాలు ఉంటాయని తెలిపారు.
సోయా చంక్స్ మీరు అనుకున్నవి కాదు
సోయా నగ్గెట్స్, సోయా చాప్, సోయా పాలు వంటి సోయా ఉత్పత్తులను ప్రొటీన్ తో నిండిన ఆహారాలుగా భావిస్తారు. కానీ వాస్తవానికి అవి జంక్ ఫుడ్ కన్నా ప్రమాదకరమైనవి కావచ్చునని తనిషా బావా తెలిపారు. ఆమె ప్రకారం, “ఈ సోయా నగ్గెట్స్ పారిశ్రామికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు. వీటిలో 80-90% రిఫైన్డ్ ఫ్లోర్ (శుద్ధి చేసిన పిండి) ఉంటుంది. అది మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.” మీరు అధిక నాణ్యత గల ప్రొటీన్ తింటున్నారని అనుకుంటారు. కానీ మీరు తినేది కేవలం ఖాళీ కేలరీలు.
ఆరోగ్యానికి నష్టం
ఈ ఆహారం మీ రక్తంలో చక్కెర సమతుల్యతను దెబ్బతీసి, శరీరంలో మంట (inflammation) కలగజేస్తుంది. సోయా నగ్గెట్స్ పోషక ప్రయోజనాలకు బదులుగా మీ జీర్ణవ్యవస్థను దెబ్బతీసే అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్ అని ఆమె తెలిపారు. “సోయాలో యాంటీ-న్యూట్రియెంట్స్ ఉంటాయి. అవి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. అందుకే నేను ఏ రూపంలో సోయాను సిఫార్సు చేయను” అని ఆమె తెలిపారు.
ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు
సోయాకు బదులుగా ఆరోగ్యకరమైన ప్రొటీన్ వనరులు చాలా ఉన్నాయని తనిషా బావా గట్టిగా చెప్పారు. ఆమె సూచించిన ప్రత్యామ్నాయాలు:
బఠానీలు
పుట్టగొడుగులు
స్పైరులినా
ఆర్గానిక్ టెంపే
వీగన్ పీ ప్రొటీన్
క్వాలిటీ వీగన్ ప్రొటీన్ షేక్స్
క్వినోవా, అమరాంత్ వంటి తృణధాన్యాలు
చియా పుడ్డింగ్
నట్స్, గింజలు, బాదం వెన్న
గమనిక: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఇది సామాజిక మాధ్యమాల్లో ఉన్న సమాచారం ఆధారంగా రాసింది. టీవీ9 ఈ సమాచారాన్ని ధృవీకరించలేదు.




