AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనాలో వింత, విచిత్ర ట్రెండ్..! ప్లేట్‌లో ఉండాల్సిన దానికి డైపర్ వేసి బెడ్‌రూమ్‌లోకి

ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడూ సరికొత్త టెక్నాలజీతో, ఆర్థిక విషయాలతో ఆశ్చర్యపరిచే చైనా, ఇప్పుడు ఒక విచిత్రమైన ట్రెండ్‌తో వార్తల్లో నిలిచింది. ఇన్నాళ్లూ కేవలం నోరూరించే వంటకాలకే పరిమితమైన కోళ్లు, ఇప్పుడు అక్కడి ప్రధాన నగరాల్లో ముద్దు లొలికే పెంపుడు జంతువులుగా మారిపోయాయి.

చైనాలో వింత, విచిత్ర ట్రెండ్..! ప్లేట్‌లో ఉండాల్సిన దానికి డైపర్ వేసి బెడ్‌రూమ్‌లోకి
The Bizarre New Pet Trend Taking Over China1
Nikhil
|

Updated on: Apr 30, 2026 | 8:21 AM

Share

సాధారణంగా కోడి అంటే పొలాల్లోనో లేదా కోళ్ల ఫారాల్లోనో కనిపిస్తుంది, కానీ చైనాలో మాత్రం ఇవి ఏకంగా డైపర్లు వేసుకుని, యజమానులతో కలిసి వీధుల్లో షికారు చేస్తూ ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారుతున్నాయి. చైనీయుల జీవనశైలిలో కోళ్లు ఇప్పుడు కొత్త ఫ్యామిలీ మెంబర్స్‌గా చేరిపోయాయి. నగరాల్లో నివసించే వారు కుక్కలు, పిల్లుల కంటే వీటినే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ వింత మార్పు వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలు, యజమానుల అనుభవాలు వివరంగా తెలుసుకుందాం..

అగ్వాయ్ ఫీనిక్స్ ఫెయిరీస్

గువాంగ్‌డాంగ్ లాంటి ప్రాంతాల్లో కోడి కనిపిస్తే అది వంటకంలో ఉండాల్సిందే అన్న సామెత ఒకటి ప్రాచుర్యంలో ఉంది. కానీ అగ్వాయ్ అనే మహిళ ఈ ధోరణిని మార్చేశారు. తనకు బంధువులు ఇచ్చిన మూడు గుడ్లను పొదిగించి, ఆ కోడిపిల్లలను వండుకోకుండా ముద్దుగా పెంచుకోవడం ప్రారంభించారు. ఇవి అరుదైన, ఖరీదైన తైహే బ్లాక్-బోన్డ్ సిల్కీ ఫౌల్ జాతికి చెందినవి. మంచు లాంటి తెల్లటి ఈకలతో ఆకట్టుకునే వీటిని ఆమె ఫీనిక్స్ ఫెయిరీస్ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. వీటి నిర్వహణ చాలా సులభమని, నెలకు కేవలం 30 యువాన్లు అంటే సుమారు 450 రూపాయలు మాత్రమే ఆహారం కోసం ఖర్చవుతుందని ఆమె చెబుతున్నారు.

కోళ్లను పెంచడం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా, అవి చాలా తెలివైనవని, వాటికి ఎమోషన్స్ ఉంటాయని యజమానులు బలంగా నమ్ముతున్నారు. జియాంగ్సు ప్రాంతానికి చెందిన ఒక యజమాని తన కోడిపుంజు మనుషులతో భావోద్వేగాలను పంచుకుంటుందని, కళ్లతోనే కమ్యూనికేట్ చేస్తుందని తెలిపారు. గతంలో చిలుకలు, కుక్కలు, పిల్లులను పెంచిన వారు సైతం, వాటన్నింటికంటే కోళ్లే మనుషులతో త్వరగా కనెక్ట్ అవుతాయని అభిప్రాయపడుతున్నారు. సాధారణ పెంపుడు జంతువులకు అయ్యే ఖర్చు, వాటికి కేటాయించాల్సిన సమయంతో పోలిస్తే కోళ్లను పెంచడం ఎంతో ఉత్తమమని వారు భావిస్తున్నారు.

చవకైన లభ్యత

పెంపుడు జంతువులుగా మారుతున్న ఈ కోళ్లన్నీ ఎక్కువగా ఫారాల నుంచే వస్తున్నాయి. గుడ్లు పెట్టలేని పుంజులు, మాంసం కోసం పెంచే బ్రాయిలర్ కోళ్లు ఈ జాబితాలో ఉంటున్నాయి. కొన్ని సూపర్ మార్కెట్లు పెరుగు లేదా ఇతర సరుకులు కొన్నవారికి ఆఫర్ల రూపంలో ఈ కోడిపిల్లలను ఉచితంగా ఇస్తున్నాయి. మరికొన్ని చోట్ల రైతులు సిటీ పార్కుల్లో కేవలం ఒకటి నుండి మూడు యువాన్లకే అతి చవకగా వీటిని విక్రయిస్తున్నారు. ఇది నగరవాసులను, ముఖ్యంగా చిన్న పిల్లలను విపరీతంగా ఆకర్షిస్తోంది. అపార్ట్‌మెంట్లలో నివసించే వారు సైతం ఈ చిన్న కోడిపిల్లలను తమ ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు.

కోళ్లకు డైపర్లు వేయడం వల్ల ఇల్లు అపరిశుభ్రం కాకుండా ఉంటుందని, తద్వారా వాటిని బెడ్ రూమ్స్ లో కూడా ఉంచుకోవచ్చని యజమానులు చెబుతున్నారు. చైనాలో పెరిగిపోతున్న ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి యువత ఇటువంటి వినూత్నమైన మార్గాలను వెతుక్కుంటోంది. పెంపుడు జంతువుల మార్కెట్లో కోళ్లు ఒక కొత్త విప్లవాన్ని సృష్టించడమే కాకుండా, సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటున్నాయి. చైనా వీధుల్లో ఇప్పుడు కుక్కల కంటే డైపర్లు వేసుకున్న కోళ్లే ఎక్కువగా దర్శనమిస్తుండటం గమనార్హం.

Follow Us