Potato Chips: ఆలూ చిప్స్ ఇంట్లో చేస్తే కుదరట్లేదా?.. మీరు చేస్తున్న పొరపాటు ఇదే..
బయట కొనుక్కునే ప్యాకెట్ చిప్స్ కు ధీటుగా, ఇంట్లోనే కరకరలాడే, క్రిస్పీ ఆలూ చిప్స్ ను సులభంగా తయారు చేయవచ్చు. ఈ చిప్స్ పిల్లలకు, పెద్దలకు ఎంతో ఇష్టమైన స్నాక్. అయితే, చిప్స్ ను ఎంత పల్చగా తరిగినా, అవి కరకరలాడుతూ రావాలంటే కొన్ని చిన్న చిట్కాలు, ముఖ్యమైన వంట పద్ధతులు పాటించాలి. ముఖ్యంగా, ఆలూలో ఉండే పిండి పదార్థం తొలగించడం, సరైన మంటపైన వేయించడం కీలకం. మరి, ఆలూ చిప్స్ పరిపూర్ణంగా, రుచిగా రావాలంటే, పాటించాల్సిన ఆ రహస్య చిట్కాలు, తయారీ విధానం ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఆలూ చిప్స్ ను అందరూ చేస్తారు. కానీ, అవి బజారులో దొరికే వాటిలా కరకరలాడుతూ, క్రిస్పీగా రావడం కొంతమందికే సాధ్యమవుతుంది. ఈ ప్రత్యేక విధానం పాటిస్తే, మళ్లీ చిప్స్ తయారీకి వేరే పద్ధతి వెతకాల్సిన అవసరం ఉండదు. రెండు బంగాళాదుంపలతో క్రిస్పీ చిప్స్ ఎలా తయారు చేయాలో, దానికి పాటించాల్సిన ముఖ్యమైన చిట్కాలు ఏమిటో చూద్దాం.
తయారీ విధానం షాపులో దొరికే ఆలూ చిప్స్ వంటివి ఇంట్లో చేసుకోవాలంటే అతి ముఖ్యమైన స్టెప్.. సరైన ఆలుగడ్డలను సెలక్ట్ చేసుకోవడం.
ఎందుకంటే మనకు వంటల్లో వాడుకునే ఆలూతో చిప్స్ తయారు చేయడం వల్లే అవి పాకెట్ చిప్స్ లాగా రావు. వీటి కోసం ప్రత్యేకమైన ఆలుగడ్డలను మార్కెట్లో ఎంచుకోవాలి.
కూరలు, కుర్మాల్లోకి వాడేవి కాకుండా చిప్స్ కోసం దొరికే ఆలూను తెచ్చుకోండి.
రెండు ఆలూ తీసుకుని తొక్క తీసి, శుభ్రం చేయాలి. ఆలూను ఎంత వీలైతే అంత పల్చగా చక్రాలుగా తరగాలి.
వేయించే చిట్కాలు
నూనెను ముందుగా వేడి చేయవద్దు. పొయ్యి వెలిగించకముందే సిద్ధం చేసిన ఆలూ ముక్కలను నూనెలో వేయాలి.
స్టవ్ వెలిగించి, ఎక్కువ మంట పైన వేయించాలి. చిప్స్ పూర్తిగా నూనెలో మునిగేలా చూడాలి. చిప్స్ ను గిన్నెలో ఎక్కువగా వేయవద్దు.
నూనె వేడెక్కి, బుడగలు ఎక్కువగా రావడం మొదలవ్వగానే, మంటను మధ్యస్థ స్థాయికి తగ్గించాలి. చిప్స్ రంగు మారకుండా, కరకరలాడాలంటే తక్కువ మధ్యస్థ మంటపైన వేయించాలి.
ఆలూ ముక్కలు నూనెలో వేసిన వెంటనే తిప్పవద్దు. వాటి రంగు కొద్దిగా మారగానే అప్పుడు తిప్పుతూ, కరకరలాడే వరకు వేయించాలి.
చిప్స్ రంగు కొద్దిగా మారగానే నూనె నుంచి తీయాలి. ఎక్కువ సేపు ఉంచితే చిప్స్ రంగు ముదురు అవుతుంది. వేయించిన చిప్స్ ను పేపర్ నాప్కిన్ వేసిన ప్లేట్ లోకి మార్చాలి.
రుచికోసం వేడి చిప్స్ కు కొద్దిగా ఉప్పు వేసి కలిపితే సరిపోతుంది. కారంపొడి, చాట్ మసాలా కూడా కలుపుకోవచ్చు. రుచికి తగ్గట్టు ఉప్పు కలుపుకోవడం కూడా అవసరం లేదు. ఉప్పు లేకపోయినా చిప్స్ రుచిగా ఉంటాయి.




