AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్నం తినేటప్పుడు నీళ్లు తాగుతున్నారా? మీ పొట్టలో ఏం జరుగుతుందో తెలుసుకోండి..

మనలో చాలా మందికి భోజనం చేసేటప్పుడు పక్కన ఖచ్చితంగా నీళ్ల గ్లాసు ఉండాల్సిందే. కొందరికైతే ముద్ద ముద్దకూ నీళ్లు తాగితే గానీ అన్నం ముందుకు సాగదు. అయితే భోజనం మధ్యలో ఇలా నీళ్లు తాగడం వల్ల కడుపులోని జీర్ణరసాలు పలచనైపోయి జీర్ణవ్యవస్థ నాశనమవుతుందని, గ్యాస్, ఎసిడిటీ పెరుగుతాయని చాలా కాలంగా ఒక భయం ఉంది. మరి ఈ అలవాటు నిజంగానే అంత ప్రమాదకరమా..? దీనిపై సైన్స్ వాస్తవానికి ఏం చెబుతోంది..? అనేది తెలుసుకుందాం..

అన్నం తినేటప్పుడు నీళ్లు తాగుతున్నారా? మీ పొట్టలో ఏం జరుగుతుందో తెలుసుకోండి..
Drinking Water While Eating Good Or BadImage Credit source: Getty Images
Krishna S
|

Updated on: May 21, 2026 | 9:03 PM

Share

భోజనంతో పాటు నీళ్లు తాగడం మనలో చాలా మందికి ఒక సాధారణ అలవాటు. కొందరికి ముద్ద ముద్దకూ నీళ్లు తాగితే గానీ ముద్ద దిగదు. మరికొందరికి కారం అనిపించినప్పుడు, గొంతులో ఆహారం ఇరుక్కుపోయినప్పుడో నీళ్లు తాగుతారు. అయితే భోజనం చేసేటప్పుడు లేదా తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ నాశనమవుతుందని, కడుపులో గ్యాస్, ఎసిడిటీ పెరుగుతాయని కొందరు భయపడుతుంటారు. అసలు ఈ అలవాటు మన ఆరోగ్యానికి మంచిదేనా? దీనిపై సైన్స్ ఏం చెబుతోంది? మన జీర్ణక్రియపై దీని ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం.

జీర్ణరసాలు పలచనవుతాయా? అసలు నిజం ఇదీ..

భోజనం మధ్యలో నీళ్లు తాగడం వల్ల కడుపులోని ఆమ్లాలు, జీర్ణ ఎంజైమ్‌లు పలచనైపోయి జీర్ణక్రియ మందగిస్తుందని చాలా మంది నమ్ముతారు. కానీ నిపుణుల ప్రకారం.. పరిమిత మోతాదులో నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియకు ఎలాంటి అభ్యంతరం కలగదు. పైగా ఇది ఆహారం సులభంగా అరగడానికి కొన్ని రకాలుగా సహాయపడుతుంది.

భోజనాల మధ్య కొద్దిగా నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..

ఆహారాన్ని మింగడంలో సహాయపడుతుంది: మనం పొడి లేదా చిక్కటి ఆహార పదార్థాలను తినేటప్పుడు, లాలాజలానికి కొద్దిగా నీరు తోడైతే ఆహారం అన్నవాహిక గుండా సులభంగా కడుపులోకి వెళ్తుంది. ఇది ఆహారం గొంతులో ఇరుక్కుపోకుండా నివారిస్తుంది.

పోషకాల శోషణ: మనం తిన్న ఆహారం నుండి విటమిన్లు, ఖనిజాలను మన శరీరం సరిగ్గా గ్రహించాలంటే నీరు చాలా అవసరం. భోజనం మధ్యలో అప్పుడప్పుడు కొద్దిగా నీరు తాగడం వల్ల పోషకాలు ఒంటికి బాగా పడతాయి.

మలబద్ధకాన్ని నివారిస్తుంది: ఆహారంతో పాటు తగినంత నీరు త్రాగడం వల్ల పేగుల కదలిక సులభతరమై, మలబద్ధకం మరియు కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.

ఎప్పుడు శ్రద్ధ పెట్టాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

భోజనం మధ్యలో నీళ్లు తాగడం ఎల్లప్పుడూ సమస్య కాదు.. కానీ అతిగా తప్పుడు పద్ధతిలో తాగినప్పుడే ఇబ్బందులు వస్తాయి.

భోజనానికి 30 నిమిషాల ముందు: అన్నం తినడానికి అరగంట ముందు ఒక గ్లాసు నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. ఇది జీర్ణవ్యవస్థను మేల్కొల్పడమే కాకుండా, అతిగా తినడాన్ని నివారించి బరువు అదుపులో ఉండేలా చేస్తుంది.

భోజనం చేస్తున్నప్పుడు: ఒకవేళ గొంతు పొడిబారినా లేదా మంటగా అనిపించినా మాత్రమే కొద్దిగా గోరువెచ్చని నీటిని సిప్ చేయండి. గటగటా గ్లాసుల కొద్దీ నీళ్లు తాగేయకూడదు.

భోజనం ముగిసిన తర్వాత: తిన్న వెంటనే లీటర్ల కొద్దీ నీళ్లు తాగకుండా.. అరగంట లేదా గంట తర్వాత మాత్రమే తగినంత నీరు తాగాలి. ఇది కడుపు ఉబ్బరం, ఎసిడిటీని పూర్తిగా నివారిస్తుంది.

అతిగా తాగితే వచ్చే ముప్పు

ఆహారాన్ని సరిగ్గా నమలకుండా, నీళ్లతో కలిపి వేగంగా మింగేయడం వల్ల కడుపులోకి ఎక్కువ గాలి ప్రవేశిస్తుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం, అధిక గ్యాస్ ఏర్పడవచ్చు. అలాగే ఎక్కువ మొత్తంలో నీటిని ఒకేసారి తీసుకున్నప్పుడు అది సహజ జీర్ణక్రియ ప్రక్రియను దెబ్బతీస్తుంది.

మీకు ఎలాంటి ఇతర జీర్ణ సంబంధిత తీవ్ర రుగ్మతలు లేకపోతే.. భోజనం మధ్యలో కొద్ది మోతాదులో నీళ్లు తాగడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే ‘‘అతి సర్వత్ర వర్జయేత్’’ అన్నట్లు.. అమృతం లాంటి నీటిని కూడా పద్ధతి ప్రకారం, సరైన మోతాదులో తాగి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి

Follow Us