Diwali Special: దీపావళికి ఇంట్లో టేస్టీ జీడిపప్పు బాదం పిస్తా బర్ఫీ చేసుకోండి.. లక్ష్మీ దేవి రుచికి వావ్ అనాల్సిందే..
దీపావళి సందడి మొదలైంది. ఓ వైపు ఇంటిని శుభ్రం చేసుకుంటున్నారు.. మరోవైపు దీపావళి కోసం షాపింగ్ కూడా చేయడం మొదలు పెట్టేశారు. అయితే దీపావళి పండగకు లక్ష్మీదేవికి పూజలో సమర్పించడానికి.. ఇంటికి వచ్చిన అతిధులకు అందించడానికి రుచికరమైన స్వీట్స్ కోసం షాప్ కి వెళ్ళాలనుకుంటున్నారా.. అయితే ఇంట్లోనే జీడిపప్పు-బాదం-పిస్తా బర్ఫీని తయారు చేసుకోండి. దీనిని తయారు చేయడం చాలా సింపుల్. ఆరోగ్యకరమైన పండగ స్పెషల్ డెజర్ట్ జీడిపప్పు-బాదం-పిస్తా బర్ఫీ.

దీపావళి పండగకు మార్కట్ నుంచి ఎన్ని రకాల స్వీట్స్ తెచ్చినా ఇంట్లో ఖచ్చితంగా ఏదోక స్వీట్ ని చేయడం సాంప్రదాయం. ఇంట్లో తయారుచేసిన స్వీట్లు లేకుండా దీపావళి పండగ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. అందుకనే ప్రతి ఇంట్లో దీపావళి పూజకు ముందు రుచికరమైన స్వీట్లు తయారుచేస్టారు. వాటిని లక్ష్మీ దేవికి నైవేద్యం పెట్టడమే కాదు అతిథులకు వడ్డిస్తారు. మీరు ఈ సారి దీపావళికి ప్రత్యేకమైన, రుచికరమైన ఏదైనా స్వీట్ తయారు చేయాలనుకుంటే.. జీడిపప్పు బాదం పిస్తా బర్ఫీ ఉత్తమ ఎంపిక కావచ్చు. ఇది చాలా రుచికరమైనది. దీనిని పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఇష్టపడతారు. దీన్ని ఇంట్లో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..
జీడిపప్పు బాదం పిస్తా బర్ఫీ తయారీకి కావలసిన పదార్థాలు
- జీడిపప్పు – 1 కప్పు
- బాదం – 1/2 కప్పు
- పిస్తా – 1/2 కప్పు
- ఖోయా (పచ్చి కోవా) – 1 కప్పు
- చక్కెర లేదా పటిక బెల్లం పొడి – 3/4 కప్పు
- పాలు – 1/4 కప్పు
- నెయ్యి – 3 టేబుల్ స్పూన్
- యాలకుల పొడి – 1/2 టీస్పూన్
- డ్రై ఫ్రూట్ ముక్కలు – కొన్ని
తయారీ విధానం: ముందుగా జీడిపప్పు, బాదం, పిస్తా పప్పులను మిక్సర్ గ్రైండర్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
దీని తరువాత ఒక పాన్ ని స్టవ్ మీద పెట్టి.. దానిలో నెయ్యి వేడి చేసి అందులో ఖోయా వేసి లేత గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
ఇప్పుడు ఈ వేయించిన కోవాలో రుబ్బుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి.
తర్వాత పాలు, చక్కెర వేసి.. ఈ మిశ్రమాన్ని తక్కువ మంట మీద సుమారు 10 నిమిషాలు ఉడికించాలి.
చివరిగా యాలకుల పొడి.. రెండు స్పూన్ల నెయ్యి వేసి బాగా కలపాలి.
ఇప్పుడు ఒక ప్లేట్ అంచులకు నెయ్యి రాసి.. దానిలో ఈ మిశ్రమాన్ని పోసి.. సమానంగా వచ్చేలా సరిచేయండి. పైన నచ్చిన డ్రై ఫ్రూట్ ముక్కలను వేసి ఒక పక్కకు పెట్టండి.
ఈ ప్లేట్ లోని మిశ్రమాన్ని ఒక పక్కకు పెట్టి చలార్చండి. 20 నిమిషాల తరువాత.. ఈ బర్ఫీని మీకు కావలసిన ఆకారాలలో కత్తిరించండి. అంతే రుచికరమైన జీడిపప్పు బాదం పిస్తా బర్ఫీ సిద్ధం. దీన్ని ఎక్కువ రోజు నిల్వ చేసుకోవాలనుకుంటే.. గాలి చొరబడని గాజు కంటైనర్‌లో నిల్వ చేయండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




