ఈ మొక్క ఉంటే ఇల్లు పాముల పుట్ట అయిపోతుందా? గార్డెనింగ్ లవర్స్ తెలుసుకోవాల్సిన నిజాలు
నేడు ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవడం ఒక సరికొత్త ట్రెండ్‌గా మారింది. ఇంటి అలంకరణతో పాటు గాలిని శుద్ధి చేసే మొక్కల కోసం వెతికేవారికి మొదటగా గుర్తొచ్చేది 'స్నేక్ ప్లాంట్'. తక్కువ నీటితో, అతి తక్కువ సంరక్షణతో పెరిగే ఈ మొక్క ఇళ్లలో, ఆఫీసుల్లో ఎంతో అందంగా కనిపిస్తుంది. అయితే, దీని పేరు వినగానే చాలామందిలో ఒక తెలియని భయం మొదలవుతుంది. ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే నిజంగానే పాములు వస్తాయా? అనే సందేహం చాలామందిని వేధిస్తోంది.

స్నేక్ ప్లాంట్.. ఈ మొక్క ఆకులు పొడవుగా ఉండి, వాటిపై ఉండే చారలు పాము చర్మాన్ని పోలి ఉండటం వల్లే దీనికి ఆ పేరు వచ్చింది. అంతే తప్ప, ఈ మొక్కకు పాములకు ఎటువంటి సంబంధం లేదు. శాస్త్రీయంగా చూసినా, సామాజికంగా చూసినా ఇది కేవలం ఒక అపోహ మాత్రమేనని నిపుణులు తేల్చి చెబుతున్నారు. స్నేక్ ప్లాంట్ చుట్టూ ఉన్న ఈ అపోహలు మరియు వాస్తవాల గురించి తెలుసుకుందాం..
పేరు వెనుక కారణం
మొక్క ఆకులు నిటారుగా ఎదిగి, వాటిపై ఉండే డిజైన్ పాము చర్మంలా కనిపిస్తుంది కాబట్టే దీనిని ‘స్నేక్ ప్లాంట్’ అని పిలుస్తారు. శాస్త్రీయంగా పాములు ఏ నిర్దిష్ట మొక్కకు ఆకర్షించబడవు. పాములు సాధారణంగా ఆహారం (ఎలుకలు, కీటకాలు), నీరు లేదా సురక్షితమైన నివాసం కోసం మాత్రమే ఇళ్లలోకి ప్రవేశిస్తాయి. స్నేక్ ప్లాంట్ పెంచుకోవడం వల్ల పాములు వస్తాయనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఇది పూర్తిగా ఒక అపోహ మాత్రమే.
పాములు ఎందుకు వస్తాయి?
ఇంటి చుట్టూ పొదలు ఎక్కువగా ఉండటం, చెత్తాచెదారం పేరుకుపోవడం లేదా గోడలకు రంధ్రాలు ఉండటం వంటి కారణాల వల్ల పాములు వచ్చే అవకాశం ఉంటుంది. తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాలు పాములకు ఇష్టమైన నివాసాలు. అయితే, స్నేక్ ప్లాంట్ ఆకులు విడివిడిగా ఉంటాయి కాబట్టి అవి పాములకు దాక్కోవడానికి అనువైన చోటును కల్పించవు. మీ ఇల్లు లేదా తోట శుభ్రంగా ఉంటే, స్నేక్ ప్లాంట్ ఉన్నా లేకపోయినా పాముల భయం ఉండదు.
స్నేక్ ప్లాంట్ ప్రయోజనాలు
అపోహలను పక్కన పెడితే, స్నేక్ ప్లాంట్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది రాత్రిపూట కూడా ఆక్సిజన్‌ను విడుదల చేయడమే కాకుండా, గాలిలోని హానికరమైన రసాయనాలను తొలగించి గాలిని శుద్ధి చేస్తుంది. తక్కువ వెలుతురులో కూడా ఇది చక్కగా పెరుగుతుంది. కాబట్టి పేరు చూసి భయపడకుండా, మీ ఇంటి గాలిని స్వచ్ఛంగా మార్చుకోవడానికి నిరభ్యంతరంగా ఈ మొక్కను పెంచుకోవచ్చు. గుర్తుంచుకోండి, అపరిశుభ్రత పాములను ఆకర్షిస్తుంది కానీ అందమైన మొక్కలు కాదు.
