Hair Spa : పార్లర్‌కు వెళ్లే పని లేదు.. జస్ట్ ఈ సింపుల్ చిట్కాలతో ఇంట్లోనే ఈజీగాహెయిర్ స్పా చేసుకోండి
అందమైన, మెరిసే జుట్టును సొంతం చేసుకోవాలని ఎవరికి ఉండదు? అందుకోసమే చాలామంది హెయిర్ స్పా చేయించుకోవడానికి పార్లర్ల బాట పడుతుంటారు. కానీ, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే హెయిర్ స్పా చేసుకోవచ్చని మీకు తెలుసా? అవును, వారానికి లేదా రెండు వారాలకు ఒకసారి ఇంట్లోనే ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే మీ జుట్టు ఒత్తుగా, బలంగా మారుతుంది. అదెలానో ఇక్కడ తెలుసుకుందాం.

పోషకాలు లేని ఆహారం, దుమ్ము, కాలుష్యం కారణంగా చాలా మంది జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనివల్ల జుట్టు పొడిగా, నిర్జీవంగా, పెళుసుగా మారుతుంది. ఇటువంటి పరిస్థితిలో, జుట్టుకు పోషణ అందించి, దానిని ఆరోగ్యంగా కాపాడుకోవడానికి హెయిర్ స్పా ఒక అద్భుతమైన మార్గం. అయితే, హెయిర్ స్పా కేవలం పార్లర్‌లో మాత్రమే చేయించుకోగలమని చాలా మంది అనుకుంటారు, కానీ అది నిజం కాదు. మన కిచెన్‌లో దొరికే కొన్ని పదార్థాలతో మీరు ఇంట్లోనే హెయిర్ స్పా చేసుకోవచ్చు. ఇది మీ జుట్టుకు లోతైన పోషణ అందించడమే కాకుండా, ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది, తద్వారా జుట్టు మృదువుగా, మెరిసేలా, బలంగా మారుతుంది. మీకు సెలూన్‌కు వెళ్ళడానికి సమయం లేకపోతే, ఈ సులభమైన పద్ధతులను పాటించడం ద్వారా మీరు ఇంట్లోనే హెయిర్ స్పా ప్రయోజనాలను పొందవచ్చు. అదెలానో ఇప్పుడు చూద్దాం.
ఇలా సింపుల్‌గా ఇంట్లోనే హెయిర్ స్పా చేసుకోండి.
హెయిర్ స్పా ప్రాసెస్ ఎప్పుడూ నూనె రాయడంతోనే మొదలవుతుంది. కాబట్టి ముందుకు మీ జుట్టుకు నూనె రాయాల్సి ఉంటుంది. మీ కిచెన్‌లో ఉండే కొబ్బరి నూనె, బాదం నూనె లేదా ఒలీవ్ ఆయిల్‌ను కొద్దిగా గోరువెచ్చగా చేయండి. ఈ నూనెను తలకు పట్టించి, 10 నుండి 15 నిమిషాల పాటు చేతి వేళ్లతో మెల్లగా మసాజ్ చేయండి. దీనివల్ల రక్తప్రసరణ మెరుగై, జుట్టు కుదుళ్లకు మంచి పోషణ అందుతుంది.
జుట్టుకు స్టీమ్ ఇవ్వండి
ఇప్పుడు నూనె జుట్టు కుదుళ్లలోకి బాగా ఇంకడానికి స్టీమింగ్ చాలా అవసరం. దీనికోసం ఎలాంటి మిషన్లు అవసరం లేదు. ఒక తువ్వాలును వేడి నీళ్లలో ముంచి, గట్టిగా పిండేయండి. ఆ వేడి తువ్వాలును తలకు చుట్టేసి ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచండి. స్టీమ్ ఇచ్చిన తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఇందుకోసం తక్కువ రసాయనాలు ఉండే ఏదైనా మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి. దీనివల్ల తలలోని మురికి, జిడ్డు వదిలిపోతుంది. అయితే, తలస్నానానికి మరీ ఎక్కువ వేడి నీటిని అస్సలు వాడకూడదు.
హెయిర్ మాస్క్ వేసుకోండి
హెయిర్ స్పాలో అత్యంత ముఖ్యమైన భాగం హెయిర్ మాస్క్. మీరు మార్కెట్లో దొరికే మంచి హెయిర్ మాస్క్ వాడవచ్చు లేదా ఇంట్లోనే అరటిపండు, పెరుగు, తేనె, అలోవెరా కలిపి ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఈ మాస్క్‌ను జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా రాసి, 20 నుండి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆపై నార్మల్ నీటితో కడిగేయండి.
చివరగా జుట్టుకు కండిషనర్ అప్లై చేయండి. జుట్టుకు కండిషనర్ రాసి 2 నుండి 3 నిమిషాల పాటు ఉంచి, ఆపై చల్లటి నీటితో కడిగేయండి. ఇది జుట్టులో తేమను లాక్ చేసి, జుట్టును సాఫ్ట్‌గా, సిల్కీగా మారుస్తుంది. మంచి ఫలితాల కోసం ప్రతి రెండు వారాలకు ఒకసారి ఈ పద్ధతిలో ఇంట్లోనే హెయిర్ స్పా చేసుకోండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




