Narendra Modi: కొత్త చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..! ప్రపంచ నేతల నుంచి అభినందనల వెల్లువ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత రాజకీయ చరిత్రలో మరో అరుదైన మైలురాయిని చేరుకున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును అధిగమిస్తూ దేశంలో అత్యధిక కాలం నిరంతరంగా ఎన్నికై పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా నిలిచారు. ఈ సందర్భంగా పలు దేశాల ప్రధాన మంత్రులు ఆయన నాయకత్వాన్ని ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. మంగళవారం ఆయన భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ పేరిట ఉన్న అత్యధిక కాలం ఎన్నికై ప్రధానిగా కొనసాగిన రికార్డును అధిగమించారు. 2014 మే 26న తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ, వరుసగా మూడు సార్లు ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చి 4,399 రోజుల నిరంతర పదవీకాలాన్ని పూర్తి చేశారు. దీంతో నెహ్రూ 4,398 రోజుల రికార్డును బ్రేక్ చేశారు.
ఈ చారిత్రాత్మక మైలురాయిపై ప్రపంచ నాయకుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే స్పందిస్తూ.. భారత ప్రజలు మోదీ నాయకత్వంపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనంగా అభివర్ణించారు. అలాగే పపువా న్యూ గినియా ప్రధాని జేమ్స్ మారాపే మోదీని ఆదర్శ నాయకుడిగా ప్రశంసిస్తూ, పేదరిక నిర్మూలనలో ఆయన పాత్రను కొనియాడారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కమలా పర్సాద్-బిస్సేసర్ భారతదేశం ప్రపంచ వ్యవహారాల్లో కీలక స్వరంగా ఎదగడంలో మోదీ నాయకత్వం ప్రధాన కారణమని పేర్కొన్నారు.
గత 12 ఏళ్లలో మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం, డిజిటల్ విప్లవం, మౌలిక సదుపాయాల విస్తరణ, అంతర్జాతీయ వేదికలపై ప్రభావం పెరగడం వంటి మార్పులు చోటుచేసుకున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. అదే సమయంలో ప్రతిపక్షాలు ఆయన పాలనపై విమర్శలు కూడా కొనసాగిస్తున్నాయి. ఈ మైలురాయితో మోదీ పేరు భారత ప్రజాస్వామ్య చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు ఆయన మూడో పదవీకాలంలో భారత్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే దిశగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
