AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pralhad Joshi: కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి.. ముందున్న సవాళ్లు ఇవే..

కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ బాధ్యతలను కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి అప్పగించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు అమోదం తెలిపిన రాష్ట్రపతి ముర్ము.. ప్రధాని సూచన మేరకు విద్యాశాఖ బాధ్యతలను ప్రహ్లాద్ జోషికి అదనంగా అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో ఆయన ముందు కొన్ని కీలక సవాళ్లు ఉన్నాయి.

Pralhad Joshi: కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి.. ముందున్న సవాళ్లు ఇవే..
Pralhad Joshi To Take Charge As Education Minister
Krishna S
|

Updated on: Jul 25, 2026 | 9:29 PM

Share

కేంద్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయగా, దానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సలహా మేరకు, ప్రస్తుత కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యామంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలను అప్పగించేందుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. రాష్ట్రపతి భవన్ ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న పోర్ట్‌ఫోలియోలతో పాటు ప్రహ్లాద్ జోషి ఇకపై విద్యా మంత్రిత్వ శాఖ బాధ్యతలను కూడా అదనంగా కొనసాగించనున్నారు.

ఉత్కంఠ రేపిన నీట్-యూజీ వివాదం

మే 3న జరిగిన నీట్ పరీక్షల అనంతరం పేపర్ లీకేజీ ఆరోపణలు వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి. పరీక్ష నిష్పక్షపాతంగా జరగలేదంటూ విద్యార్థులు చేపట్టిన ఉద్యమం సోషల్ మీడియా నుంచి వీధుల్లోకి చేరింది. ఈ పరిణామాలన్నింటి మధ్య తీవ్ర ఒత్తిడి నెలకొనడంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, ఆయన స్థానంలో ప్రహ్లాద్ జోషికి బాధ్యతలు దక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రహ్లాద్ జోషి ముందున్న అతిపెద్ద సవాళ్లు ఇవే..

ఇప్పుడు అందరి దృష్టి నూతన విద్యాశాఖ బాధ్యుడిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి పైనే ఉంది. ఆయన ముందు ప్రస్తుతం ప్రధానంగా మూడు పెద్ద సవాళ్లు ఉన్నాయి.

విద్యార్థుల్లో విశ్వాసం నింపడం: నీట్ వివాదంతో తీవ్ర ఆందోళనలో ఉన్న లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో మళ్లీ నమ్మకాన్ని పునరుద్ధరించడం జోషికి అత్యంత ప్రాధాన్యమైన అంశం.

పరీక్షల నిర్వహణలో పారదర్శకత: జాతీయ స్థాయిలో జరిగే పోటీ పరీక్షల విధానంలో లోపాలను సరిదిద్ది, భవిష్యత్తులో ఎలాంటి పేపర్ లీక్‌లు లేదా అక్రమాలు జరగకుండా నిరోధించేలా కఠిన సంస్కరణలు తేవాల్సి ఉంది.

ఆందోళనలకు స్వస్తి పలకడం: రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్న యువతతో చర్చించి, వారికి సరైన భరోసా ఇవ్వడం ఆయన ముందున్న సున్నితమైన బాధ్యత.

పరిపాలనా అనుభవం ఉన్న ప్రహ్లాద్ జోషి ఈ క్లిష్టమైన సమయంలో విద్యాశాఖను ఎలా గట్టెక్కిస్తారు? దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకుంటారు? అనేది వేచి చూడాల్సి ఉంది.

Follow Us