AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Update: హమ్మయ్య.. ఇక చల్లబడినట్లే రేపటి నుంచి దంచికొట్టనున్న వర్షాలు

Weather Update: హమ్మయ్య.. ఇక చల్లబడినట్లే రేపటి నుంచి దంచికొట్టనున్న వర్షాలు

Phani CH
|

Updated on: Jun 09, 2026 | 6:05 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించి వేగంగా విస్తరిస్తున్నాయి. తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ కాగా, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఎండలు కొనసాగనున్నాయి. రైతుల్లో ఖరీఫ్ సాగుపై ఆశలు చిగురిస్తున్నాయి.

వేసవి తాపంతో అల్లాడిపోతున్న తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ ఎంతో ఉపశమనం కలిగించే చల్లని కబురును అందించింది. ఎప్పుడెప్పుడా అని రైతాంగం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించి శరవేగంగా అన్ని దిక్కులకూ విస్తరిస్తున్నాయి.ఈ నెల 4న కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు.. తాజాగా వర్షాకాలం ప్రారంభానికి సూచనగా చెప్పే మృగశిర కార్తె తొలిరోజునే జోగుళాంబ గద్వాల జిల్లా మీదుగా తెలంగాణలోకి ఎంటర్ కావడం విశేషం. నిరుటితో పోలిస్తే 8 రోజులు ఆలస్యంగా రుతుపవనాలు రాష్ట్రంలోకి వచ్చాయి. వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. ఈ నైరుతి రుతుపవనాలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు కీలక ప్రాంతాలను తాకాయి. పశ్చిమ మధ్య, తూర్పు మధ్య అరేబియా సముద్రంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలోని చాలా భాగాలకు ఇవి వేగంగా విస్తరించాయి. వానాకాలం ఆరంభంతో అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. రాబోయే ఖరీఫ్ సాగు పనులకు సమాయత్తం అయ్యేందుకు ఈ తొలకరి వర్షాలు ఎంతో అనుకూలంగా మారనున్నాయి. రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఎండల ప్రభావం ఉండగా.. దక్షిణ జిల్లాల్లో పూర్తిగా తగ్గాయి. అత్యధికంగా కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని వంకులంలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లా తాండూరులో 42.7, పెద్దపల్లి జిల్లా మల్యాలపల్లిలో 42.5, జగిత్యాల జిల్లా గుళ్లకోటలో 42.2, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెళ్లపాడులో 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 7 జిల్లాల్లో 41 డిగ్రీలు, 6 జిల్లాల్లో 40 డిగ్రీల మేర రికార్డ్ అయ్యాయి. మిగతా అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీల లోపు నమోదయ్యాయి. అత్యల్పంగా మహబూబ్ నగర్ జిల్లాలో 34.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యింది. వికారాబాద్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో 35 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. కాగా హైదరాబాద్ లోనూ 40 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో ఇవి రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో విస్తరించనున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గాలుల వేగాన్ని బట్టి జూన్ 11 లేదా 12 నాటికి ఇవి హైదరాబాద్ మహా నగరానికి చేరుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఒకవైపు రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకగా.. మరోవైపు ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు సముద్ర మట్టానికి సమాంతరంగా ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ రెండు వాతావరణ వ్యవస్థల ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రోజుల్లో వర్షాల తీవ్రత మరింత పెరగనుంది. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేశారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని అన్నారు. జూన్ 14 వరకు రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఇలాగే చల్లగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు విస్తారంగా వర్షాలు కురిశాయి.అత్యధికంగా సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెద్దవీడు గ్రామంలో 11.1 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. అలాగే రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం రాచులూరులో 8.7 సెంటీమీటర్లు, మహేశ్వరంలో 7.3 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా దామరచర్లలో 7.2 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని ఐకెపి ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన జొన్నలు సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తడిసి ముద్దాయాయి. కేంద్రాల వద్ద కాటాలు చేసినప్పటికీ వాటిని తరించకపోవడం భారీ వర్షానికి పూర్తిగా తడిసిపోయాయి. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు పొలం పనులకు వెళ్లకుండా కేంద్రాల వద్దని పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో తెలంగాణలో రుతుపవనాలు వస్తాయని అధికారులు తెలుపగా రైతులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు కాటాలను త్వరగా ముగించి జొన్నలను తరలించాలని రైతులు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రానున్న 24 గంటల్లో భిన్నమైన వాతావరణం నెలకొననుంది. ఒకవైపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉండగా, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే అల్లూరి సీతారామరాజు, మార్కాపురం జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వానలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా జల్లులు పడవచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలో వర్షం పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ కింద నిలబడవద్దని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. మరోవైపు ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిని సోమవారం భారీ వర్షం ముంచెత్తింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడి కుండపోత వాన కురవడంతో రోడ్లన్నీ నీటమునిగాయి. ఆర్టీసీ బస్టాండ్ నుండి సత్యమ్మ గుడి వరకు రోడ్డు పూర్తిగా జలమయమైంది. రహదారిపై మోకాలి లోతున నీరు ప్రవహించడంతో వాహనదారులు, స్థానికులు ప్రయాణించడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. గ్రామ దేవత సత్తెమ్మ దేవాలయం చుట్టూ భారీగా నీరు చేరడంతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఒకవైపు కుండపోత వర్షం పడుతూనే.. మరోవైపు ఎండ కాయడంతో జనం ఆశ్చర్యపోయారు. రుతుపవనాలు వచ్చినా.. ఏపీలో ఎండల తీవ్రత కొనసాగుతూనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలలో సోమవారం భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నెల్లూరు జిల్లా గూడూరు ప్రాంతంలో 41.7 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం పరిధిలోని చిట్యాలలో 41.4 డిగ్రీల మేర ఎండ తీవ్రత రికార్డయింది. అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరంలో 41.2 డిగ్రీలు, కృష్ణా జిల్లా వెదపారుపూడిలో 41.0 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం పది గంటల నుండే ఎండలు తీవ్రం కావడంతో రోడ్లన్నీ జనసంచారం లేక నిర్జనంగా మారుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, ఏలూరు జిల్లాలలో మాత్రం భానుడి ప్రతాపం కొనసాగనుందని తెలిపారు. అక్కడ గరిష్టంగా 42°C నుంచి 43°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖ సహా పలు కోస్తా జిల్లాల్లో కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు. రాబోయే రెండు మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మరింత చల్లబడి వానల తీవ్రత పెరగనుంది. నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రంలోని మరికొన్ని సువిశాల ప్రాంతాలతో పాటుగా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని మిగిలిన భాగాలకు పూర్తిగా విస్తరించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల దిశగా రుతుపవనాలు పయనిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది దేశవ్యాప్తంగా ముందస్తుగానే విస్తారంగా వర్షాలు కురిసే వాతావరణం నెలకొంది. కర్ణాటక రాష్ట్రం బెల్గాంలో వరుణుడు భీభత్సం సృష్టించడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. బైలహోంగల్ పట్టణాన్ని ముంచెత్తిన కుండపోత వర్షం కారణంగా రోడ్లన్నీ నదులుగా మారిపోయాయి. రోడ్లపై ప్రవాహం ఉధృతంగా ఉండటంతో కళ్లముందే ద్విచక్ర వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. రోడ్డు పక్కన పార్క్ చేసిన వాహనాలు సైతం వరద తాకిడికి కొట్టుకుపోతుంటే స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. కొట్టుకుపోతున్న తమ బైకులను పట్టుకోవడానికి వాహనదారులు ప్రాణాలకు తెగించి ఆరాటపడ్డారు. అకస్మాత్తుగా ముంచెత్తిన ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా బెల్గాం జిల్లాలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి.

Follow Us