AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కింగ్ కోబ్రా గూడును ఎప్పుడైనా చూశారా.. అరుదైన రాచనాగు ప్రత్యేకత ఇదే!

కింగ్ కోబ్రా గూడును ఎప్పుడైనా చూశారా.. అరుదైన రాచనాగు ప్రత్యేకత ఇదే!

Phani CH
|

Updated on: Aug 07, 2026 | 4:20 PM

Share

అనకాపల్లి జిల్లా తూర్పు కనుమల్లో గుర్తించిన అరుదైన కింగ్ కోబ్రా గూడును అటవీశాఖ, ఈస్టర్న్ ఘాట్స్ వైల్డ్ లైఫ్ సొసైటీ, గ్రామస్తులు సంయుక్తంగా సంరక్షించారు. గుడ్ల నుంచి 24 బేబీ కింగ్ కోబ్రాలు సురక్షితంగా బయటకు రావడంతో వాటిని రిజర్వ్ అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ అరుదైన సంరక్షణ చర్యను పలువురు అభినందిస్తున్నారు.

కింగ్‌ కోబ్రా పేరు వినగానే భీకరమైన రూపం, దాని కోరల్లో ఉండే కాలకూట విషం గుర్తుకొస్తాయి. అంతరించిపోతున్న అత్యంత అరుదైన సర్పజాతుల్లో ఈ గిరినాగు ఒకటి. ఆ రాచనాగు గూడును ఎప్పుడైనా చూశారా? ఆ పాము పిల్లలు ఎలా ఉంటాయో మీకు తెలుసా? అనకాపల్లి జిల్లాలో గుడ్లతో కూడిన కింగ్ కోబ్రా గూడు కనిపించడంతో, దాన్ని సంరక్షించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 24 బేబీ కింగ్ కోబ్రాలు గుడ్ల నుంచి బయటకు వచ్చాయి. ఆ అరుదైన విశేషాలు మీకోసం. కింగ్‌ కోబ్రా….ఆకారం భీకరం. దాని కోరల్లో ఉండే విషం అతి భయంకరం. అది కాటు వేస్తే అంత పెద్ద ఏనుగు కూడా నిమిషాల్లో పీనుగగా మారుతుంది. దాదాపు 20 అడుగుల పొడవుండే ఈ రాచనాగు, పడగ విప్పి పైకి లేస్తే, ఆరడుగుల కంటే ఎక్కువ ఎత్తే ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన, విషపూరిత సర్పంగా ఈ గిరినాగుకు పేరుంది. సాధారణంగా పాములు వేరే జంతువులు తవ్విన బొరియల్లో లేదా పుట్టల్లో నివసిస్తుంటాయి. కానీ సర్పజాతి మొత్తంలోనే ఈ రాచనాగుకు ఓ విశిష్టత ఉంది. అది ఆకులు, అలములతో స్వయంగా గూడు కట్టుకుంటుంది. దాడి చేయాలంటే నిటారుగా నిల్చుని అమాంతంగా కాటేయడం ఈ సర్పరాజం నైజం. గూడు కట్టి, గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేయడం ఆ విష సర్పం సహజ లక్షణం. గిరి నాగు గూడును ఎప్పుడైనా చూశారా..? చిన్నతనంలో ఆ పాము పిల్లలు ఎలా ఉంటాయో తెలుసా..? ఇవిగో ఇలా ఉంటాయి. అనకాపల్లి జిల్లా చోడవరం రేంజ్‌లోని తూర్పు కనుమల్లో కింగ్ కోబ్రాల సంరక్షణకు గ్రామస్తులు, అటవీ శాఖ, ఈస్టర్న్‌ ఘాట్స్‌ వైల్డ్ లైఫ్ సొసైటీ చేతులు కలిపాయి. వాళ్లు గిరి నాగు గూడును సంరక్షించి, ఆ గుడ్ల నుంచి 24 పిల్లలు సురక్షితంగా బయటకు వచ్చేలా చూశారు. రెండు నెలల క్రితం శంకరం పంచాయతీ రాజంపేట శివారులో కింగ్ కోబ్రా గూడును గ్రామస్తులు గుర్తించారు. జూన్ 6న ఈ సమాచారం ఈస్టర్న్‌ ఘాట్స్‌ వైల్డ్ లైఫ్ సొసైటీ సభ్యులకు అందింది. వెంటనే అటవీశాఖ సహకారంతో ఆ టీమ్‌ సభ్యులు గిరినాగు గూడుకు దోమతెరలతో రక్షణ కంచెను ఏర్పాటుచేశారు. ఇతర జంతువులు ఆ గుడ్లను తినెయ్యకుండా కాపాడారు. ఉష్ణోగ్రత, తేమను నమోదు చేసే డేటా లాగర్లు, కెమెరాలు ఏర్పాటుచేసి మొత్తం ప్రక్రియను శాస్త్రీయంగా పర్యవేక్షించారు. గుడ్ల నుంచి బయటకు వచ్చిన బేబీ కింగ్‌ కోబ్రాలను శంకరం రక్షిత అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు. గత ఏడాది కూడా 30వరకు కింగ్ కోబ్రా పిల్లలను సంరక్షించి రిజర్వ్ ఫారెస్టులో విడిచిపెట్టారు. అనకాపల్లి జిల్లాలోని అటవీ ప్రాంతంలో గిరినాగులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి జీడి తోటల్లో తిరుగుతుంటాయి. అప్పుడప్పుడు రైతుల కంటపడుతుంటాయి కూడా. వాటిని పట్టుకుని, అడవుల్లో విడిచిపెడుతుంటారు. ఇవి అనకాపల్లి జిల్లాతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా కనిపిస్తాయి. 24 గిరినాగు పిల్లలను సంరక్షించిందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కూడా ఈ వైల్డ్ లైఫ్‌ టీమ్‌ను అభినందించారు. అంతరించిపోతున్న సర్పజాతుల్లో గిరినాగు కూడా ఒకటి. ఇది విషసర్పమైనా, ఈ పాము కాటుతో మనుషులు చనిపోయిన ఘటనలు ఇప్పటివరకు నమోదు కాలేదని చెబుతారు. ఎందుకంటే మనుషులను చూస్తే…ఈ పాము అక్కడ్నించి మెల్లగా జారుకుంటుంది. ఇక ఈ గిరినాగు మెనూలో విషసర్పాలు ఉంటాయి. తాచుపాము, కట్లపాము, రక్తపింజర లాంటి విషసర్పాలను ఇది ఆహారంగా తీసుకుంటుంది. దీంతో పాముల సంతతి నియంత్రణలో ఉంటుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నేనూ చదువుకుంటాను.. స్కూల్లో కొత్త అతిథిని చూసి హడలిపోయిన విద్యార్ధులు

సేవింగ్స్ ఖాతాలో డబ్బు ఉందా? ఈ చిన్న ట్రిక్‌తో డబుల్ వడ్డీ!

150 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగి వచ్చిన పుస్తకం.. ఫైన్ రూ.19 లక్షలు.. కానీ షాకింగ్ ట్విస్ట్!

Follow Us