AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP politics మద్యం అమ్మకాలపై రాజకీయ రగడ

రాష్ట్రంలో మద్యం అమ్మకాలను ప్రారంభించాలన్న జగన్ ప్రభుత్వం నిర్ణయం రాజకీయ రగడకు దారితీస్తుంది. ఒకవైపు కరోనా వైరస్ ఉంటే దాని వ్యాప్తి నిరోధించాల్సిన ప్రభుత్వం మద్యం అమ్మకాల పేరిట జన జాతరకు తెరలేపిందని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోంది.

AP politics మద్యం అమ్మకాలపై రాజకీయ రగడ
Rajesh Sharma
| Edited By: |

Updated on: May 04, 2020 | 1:57 PM

Share

రాష్ట్రంలో మద్యం అమ్మకాలను ప్రారంభించాలన్న జగన్ ప్రభుత్వం నిర్ణయం రాజకీయ రగడకు దారితీస్తుంది. ఒకవైపు కరోనా వైరస్ ఉంటే దాని వ్యాప్తి నిరోధించాల్సిన ప్రభుత్వం మద్యం అమ్మకాల పేరిట జన జాతరకు తెరలేపిందని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోంది. కొందరు తెలుగుదేశం నాయకులు మద్యం దుకాణాల సందర్శనకు బయలుదేరారు. మందుబాబుల హల్‌చల్‌ని ప్రభుత్వం నిరోధించలేదని టిడిపి నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దాదాపు ఇదే అభిప్రాయాన్ని సిపిఐ, సిపిఎం, జనసేన పార్టీ నాయకులు కూడా వ్యక్తం చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శాసనమండలిలో విపక్ష నేత యనమల రామకృష్ణుడు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు. కరోనా నేపథ్యంలో ప్రజలపై అదనపు భారం మోపిన ప్రభుత్వం ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ తప్ప మరొకటి లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఒకవైపు రాష్ట్ర ప్రజలు అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే మరోవైపు మద్యం ధరలను 25 శాతం పెంచడాన్ని టిడిపి వ్యతిరేకిస్తుందని యనమల రామకృష్ణుడు అన్నారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మద్యం దుకాణాలను సందర్శించారు. వైన్సుల ముందు భారీగా గుమికూడిన మందుబాబులను చూసి ఇలాగైతే కరోనా నియంత్రణ సాధ్యమేనా అని ఆయన ప్రశ్నించారు.

మాజీ మంత్రి జవహర్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. మద్య నిషేధం అమలు చేస్తానని మేనిఫెస్టోలో పేర్కొన్న జగన్. తీరా అధికారంలోకి వచ్చాక మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారని విమర్శించారు. సాక్షాత్తు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నాటుసారా ప్రభావం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేయడం.. ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. గ్రామ వాలంటీర్లతో సారా, అధికారులతో మద్యం అమ్మిస్తున్నారంటూ ప్రభుత్వాన్ని విమర్శించారాయన. లాక్ డౌన్ ప్రారంభమైనప్పటికీ, వైన్సుల రీఓపెనింగ్ టైంకి వున్న మద్యం నిల్వల లెక్క తేల్చాలని, వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మరోవైపు సిపిఐ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మద్యం అమ్మకాలపై తప్పుపట్టింది. లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో మద్యం విక్రయాలు ప్రారంభించుకోవచ్చని కేంద్రం ఎలా చెబుతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు.