షాకింగ్: అడగకుండానే అప్పులిచ్చి.. బ్రతుకంతా బజారుకీడ్చి, చచ్చేవరకూ వేధిస్తున్న వైనాలు.. మనుష్యుల ప్రాణాలతో చెలగాటమాడుతోన్న ‘ఆన్ లైన్ లోన్’ యాప్స్
నో డాక్యుమెంట్స్, నో ష్యూరిటీ.. ఒక్క క్లిక్ చేస్తే చాలు మీ అకౌంట్‌లో డబ్బులు పడిపోతాయి. ఇలాంటి ఆసక్తికర ప్రకటనలతో ఆకట్టుకుంటారు...

నో డాక్యుమెంట్స్, నో ష్యూరిటీ.. ఒక్క క్లిక్ చేస్తే చాలు మీ అకౌంట్‌లో డబ్బులు పడిపోతాయి. ఇలాంటి ఆసక్తికర ప్రకటనలతో ఆకట్టుకుంటారు. చెప్పినట్లుగానే క్షణాల్లో డబ్బులు జమ చేస్తారు. కానీ వడ్డీలు మాత్రం వాచిపోతాయి. ఇక గడువులోగా డబ్బులు చెల్లించకపోతే అంతే సంగతులు. అక్కడి నుంచి అసలు వేధింపులు మొదలు పెడతారు. ఆన్‌లైన్ లోన్ యాప్ ఇన్‌స్టాల్ చేసే సమయంలోనే మీ ఫోన్‌లో ఉన్న నంబర్‌లన్నీ వాళ్లకు వెళ్లిపోతాయి. అంతేకాదు మీ పర్సనల్ డేటా మొత్తం వారి చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఇక డబ్బులు అనుకున్న సమయానికి చెల్లించలేకపోతే… ఆ ఫోన్ నంబర్‌లు, పర్సనల్ డేటా పట్టుకుని బెదిరింపులకు దిగారు. వాట్సాప్ గ్రూపుల్లో మీ బంధువులను యాడ్ చేసి మరీ మిమ్మల్ని మోసగాడిగా చిత్రీకరిస్తారు. ఇదో ఆన్ లైన్ వ్యాపారం. జనాల ప్రాణాలు తీసే కొత్తరకం బిజినెస్. క్రికెట్ బెట్టింగ్, ఆన్‌లైన్ రమ్మీ, పబ్జీలకంటే డేంజర్‌గా మారింది యాప్‌ల బిజినెస్. స్టూడెంట్స్, బ్యాచిలర్స్, నిరుద్యోగులే వీరి టార్గెట్. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా ఆన్‌లైన్ అప్పు ఇచ్చేస్తున్నారు. వెయ్యి రూపాయల నుంచి 2 లక్షల వరకూ అప్పు ఇచ్చేస్తున్నారు. సంతకాలు అవసరం లేదు. ఓన్లీ ఓ పది మంది కాంటాక్ట్ నంబర్లు ఇస్తే చాలు…సెకండ్ల వ్యవథిలో డబ్బు అకౌంట్లో పడిపోతుంది.
అంతే ఆ తర్వాత వేధింపులు మొదలవుతాయి. ఇలా, ఆన్‌లైన్ లోన్ యాప్స్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక యువతీ యువకులు ప్రాణాలు విడుస్తున్నారు. అవసరానికి డబ్బులు తీసుకుని ఆ తర్వాత చిక్కుల్లో పడుతున్నారు. చివరకు వేధింపులు తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయి. మొన్న సిద్ధిపేటలో మౌనిక, ఇప్పుడు రాజేంద్రనగర్‌కు చెందిన సునీల్… ఇద్దరు ఆన్‌లైన్ లోన్ నిర్వాహకుల వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇవి తెరపైకి వస్తున్న ఘటనలో తెరవెనుక ఇలాంటి వేధింపులకు బలవుతున్న జీవితాలెన్నో… మౌనిక సూసైడ్ ఘటన మరువక ముందే మరో ఘోరం జరిగింది. గుంటూరుకు చెందిన సునీల్ రాజేంద్రనగర్‌లోని కిస్మత్‌పూర్‌లో నివాసముంటున్నాడు. ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. కొద్ది కాలంగా సునీల్ ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా అప్పులు తీసుకోవడం మళ్లీ చెల్లించడం చేసేవాడు. కానీ లాక్‌డౌన్ సమయంలో తీసుకున్న లోన్ మాత్రం సకాలంలో చెల్లించలేకపోయాడు. అంతే దాని వడ్డీ ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. వెంటనే ఆ డబ్బులు చెల్లించాలని అతనిపై ఒత్తిడి పెంచారు. అక్కడితో ఆగకుండా అతనో మోసగాడని బంధువులందరికి మెసేజ్‌లు పంపారు. ఇది తెలిసి మనస్థాపానికి గురైన సునీల్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఓ కంపెనీలో AEOగా పనిచేస్తున్న మౌనిక ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు స్నాపిట్ నుంచి మెసేజ్ వచ్చింది. ఈజీ EMI, లో డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అని చెప్పడంతో అప్లై చేసింది. అప్లై చెయ్యగానే అప్పిచ్చిన ఆ సంస్థ రానురాను కర్కశంగా మారింది. తిరిగి చెల్లింపులు ఆలస్యం అయితే చాలు భౌతికంగా బెదిరించకపోయినా.. సోషల్ మీడియాలో పరువు తీయడం మొదలుపెట్టింది. ఆమె వాట్సాప్‌లో ఉన్న కాంటాక్ట్‌లందరికీ ఆమె అప్పు చెల్లించలేదని చెబుతూ ఫోటోతో సహా ప్రచారం మొదలుపెట్టింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన మౌనిక సూసైడ్ చేసుకుంది. అంతకుముందు ఆన్‌లైన్ యాప్‌లో లోన్ తీసుకుని విశాఖజిల్లా గాజువాకలో ఆహ్లాద అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె చేతి ఖర్చుల కోసం 9 యాప్‌ల నుంచి వివిధ సందర్భాల్లో లోన్లు తీసుకుంది. ఆ తీసుకున్న లోన్ కూడా కొద్ది మొత్తాలే. తన ఫోన్ కాంటాక్టు లిస్టులో ఉన్న 10 మంది ఫోన్ నంబర్లను తీసుకున్నారు. అదే ష్యూరిటీ. 40వేలు లోన్ తీసుకుని.. లక్షా 20 వేల వరకూ వసూలు చేశారు. అయినా.. వదిలిపెట్టలేదు. గంటకోసారి యాప్ నిర్వాహకులు ఫోన్ చేసి…మానసికంగా విసిగించారు. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఆహ్లాద మనస్తాపానికి లోనైంది. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. ఇదీ.. వాళ్ల టార్చర్ లెవెల్.



