ఉరిశిక్ష వేసి ఏడాదిన్నర ఆపినట్టుంది.. వ్యవసాయ చట్టాల అమలుపై సీపీఐ రామకృష్ణ మండిపాటు
కొత్త వ్యవసాయ చట్టాల అమలును ఏడాదిన్నపాటు ఆపేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ఆఫర్ ఇచ్చిందని... ఉరిశిక్ష వేసి ఏడాదిన్నరపాటు..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై దేశం అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. రైతుల పొట్టగట్టి, కార్పొరేట్లకు లాభం చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం వైఖరి ఉందంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ఢిల్లీ శివారుల్లో తిష్ట వేసిన రైతులు రెండు నలలుగా ఆందోళను చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో రైతుల సంఘాలతో చర్చించిన ప్రభుత్వం చట్టాల అమలును ఏడాదిన్నర పాటు వాయిదా వేస్తామని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రైతు సంఘాలతో పాటు వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
బీజేపీతో దేశానికి పెద్ద ముప్పు ఉందని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. కొత్త వ్యవసాయ చట్టాల అమలును ఏడాదిన్నపాటు ఆపేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ఆఫర్ ఇచ్చిందని… ఉరిశిక్ష వేసి ఏడాదిన్నరపాటు ఆపడానికి, దీనికి మధ్య తేడా లేదని విమర్శించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ లౌకికవాది అని, బీజేపీతో పొత్తు నుంచి ఆయన బయటకు రావాలని సూచించారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ కూడా రాకుండా చిత్తుగా ఓడించాలని ఓటర్లను కోరారు.