Banking Rules: బ్యాంకింగ్ రూల్స్‌లో భారీ మార్పులు.. ఆర్బీఐ కొత్త నిబంధనలు.. మారనున్న నియమాలు ఇవే..
బ్యాంకులకు ఆర్బీఐ కొత్త నియమాలు జారీ చేసింది. బీమా పాలసీలు, క్రెడిట్ కార్డుల విక్రయానికి సంబంధించి కఠిన నియమాలు జారీ చేసింది. జులై 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కస్టమర్లు ఈ కొత్త వాటి గురించి తెలుసుకోండి.

బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాకిచ్చింది. క్రెడిట్ కార్డులు, బీమా పాలసీలు విక్రయించే బ్యాంకులకు కఠిన నిబంధనలు విధించింది. బ్యాంకులు తప్పుగా పాలసీలు, క్రెడిట్ కార్డులు సింగిల్ క్లిక్‌తో విక్రయించడం నిషేధం విధించింది. కస్టమర్ల అనుమతి లేకుండా అలా విక్రయించడం చట్టవిరుద్ధమని తెలిపింది. వాటిని అమ్మేముందు స్పష్టమైన, ప్రత్యేక ఆమోదం అవసరమని స్పష్టం చేసింది. ఇందుకోసం ఆర్బీఐ కొత్త నియమాలను జారీ చేసింది. వీటి గురించి ఒకసారి తెలుసుకుందాం.
జులై 1 నుంచి అమల్లోకి..
మీరు బ్యాంక్‌కు ఏదైనా రుణం తీసుకోవడానికి లేదా బ్యాంక్ అకౌంట్ కోసం వెళ్లారనుకుందాం. బ్యాంకులు మీకు రుణంతో పాటు బీమా సౌకర్యం, క్రెడిట్ కార్డులను ఆటోమేటిక్‌గా జారీ చేస్తాయి. ఇక ఆన్‌లైన్‌లో కూడా ఏదైనా బ్యాంక్ సర్వీస్ పొందే సమయంలో బీమా, క్రెడిట్ కార్డుల ఆప్షన్‌పై సింగిల్ క్లిక్ చేసి పొందవచ్చని సూచిస్తూ ఉంటాయి. ఇలాంటి వాటిపై ఆర్బీఐ నిబంధనలు ప్రవేశపెట్టింది. బ్యాంకులు కస్టమర్ల అనుమతి లేకుండా ఒకే క్లిక్‌తో బీమా పాలసీలు, క్రెడిట్ కార్డుల లాంటి వాటిని విక్రయించకూడదని ఆర్బీఐ తెలిపింది. మిస్ సెల్లింగ్,డార్క్ ప్యాటర్న్‌లను నిషేధించింది. జులై 1వ తేదీ నుంచి ఈ నియమాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
కస్టమర్ల అనుమతి తప్పనిసరి
సింగిల్ క్లిక్‌ను సెలక్ట్ చేసుకుని తీసుకోవడం వల్ల కస్టమర్లకు ప్రొడక్ట్స్ గురించి పూర్తి వివరాలు తెలియకపోవచ్చు. మీరు ఆన్‌లైన్‌లో ఏదైనా బ్యాంకింగ్ సర్వీసును యాక్సెస్ చేసే సమయంలో ఐ అగ్రీ బటన్‌ను నొక్కడం వల్ల బహుళ సేవలు ఆటోమేటిక్‌గా కన్ఫార్మ్ అవుతాయి. ఆ తర్వాత కానీ తెలియకుండా తీసుకన్నామని కస్టమర్లకు అర్థమవుతుంది. ఇలాంటి కార్యకలాపాలు కస్టమర్ల ప్రయోజనాలకు అనుకూలంగా లేవని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీంతో ఇక నుంచి బ్యాంకులు విడిగా, స్పష్టంగా కస్టమర్ల అనుమతి పొందాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.
ఇక నుంచి వెరిఫికేషన్ తప్పనిసరి
ఇక నుంచి బ్యాంకులు అలా ప్రొడక్ట్స్ అమ్మాలంటే కస్టమర్ల అవసరాలు, ప్రొఫైల్‌కు సరిపోతుందా.. లేదా అనేది నిర్ధారించుకోవాలి. పరిమిత ఆదాయం సంపాదించేవారికి ఎక్కువ మొత్తం చేసే ప్రొడక్ట్స్‌ను విక్రయించడం మోసపూరితంగా పరిగణించబడుతుంది. కస్టమర్ల ఆర్ధిక పరిస్థితికి సరిపోని ఉత్పత్తులు అమ్మడం తప్పుగా భావిస్తామని ఆర్బీఐ హెచ్చరించింది. ఇక బ్యాంకులు ఉత్పత్తులు విక్రయించే ముందు తమ బ్యాంక్ నుంచి వచ్చిందా.. లేదా వేరే కంపెనీదా అనేది స్పష్టంగా తెలపాల్సి ఉంటుంది.
డార్క్ ప్యాట్రన్స్ నిషేధం
డార్క్ ప్యాటర్న్స్ అని పిలువబడే డిజిటల్ పద్ధతులను కూడా ఆర్బీఐ తప్పు పట్టింది. కస్టమర్లను తప్పుదారి పట్టించడానికి ఇలాంటి వ్యూహాలు వద్దని తెలిపింది. ప్రీ-టిక్ చేసిన సమ్మతి పెట్టెలు, నేడే చివరి అవకాశం వంటి గడియారాన్ని ప్రదర్శించడం ద్వారా ఒత్తిడిని సృష్టించే ప్రకటనలు వద్దని హెచ్చరించింది.
