Jahnavi Kandula: అహంకారం వీడి.. దిగొచ్చిన అమెరికా! యువతి మరణానికి రూ.262 కోట్ల పరిహారం!
ఆమె ఒక సాధారణ వ్యక్తి. ఆమె మరణానికి విలువ లేదు'.. ఇదీ జాహ్నవి కందుల మరణంపై అమెరికాలోని సియాటెల్ పోలీస్ చేసిన వెకిలి కామెంట్. ఒక మనిషి ప్రాణంపై అంత హేళనగా మాట్లాడిన అమెరికానే.. తలదించుకుంటూ, క్షమాపణ కోరుతూ, పరిహారం ఇస్తామంటూ రాజీకొచ్చింది. ఒక ప్రాణం పోతే మానవత్వం చూపాల్సింది పోయి వెకిలిగా నవ్వడం అమెరికన్ సొసైటీ కూడా ఒప్పుకోలేదు. ఇప్పుడా కేసులో 262 కోట్ల రూపాయల పరిహారం ఇచ్చేందుకు సియాటెల్ నగరం ముందుకొచ్చింది

కర్నూలు జిల్లా ఆదోని ఎంఐజీ కాలనీకి చెందిన జాహ్నవి కందుల.. హైయర్ స్టడీస్ కోసం 2021లో అమెరికా వెళ్లారు. సియాటెల్‌లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీలో జాయిన్ అయ్యారు. 2023 జనవరి 23న కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తూ రోడ్డు దాటుతుండగా.. పోలీస్ పెట్రోలింగ్ కార్ ఢీకొట్టింది. ఆ రాత్రి సమయంలో అక్కడ నడపాల్సిన వేగం కేవలం 40కిలోమీటర్ల స్పీడ్ మాత్రమే. కాని, పోలీస్ ఆఫీసర్ కెవిన్ గంటకు 119 కిలోమీటర్ల వేగంతో నడిపాడు. ఆ స్పీడ్‌లో ఢీకొట్టడంతో జాహ్నవి దాదాపు 100 అడుగుల దూరం వరకు ఎగిరి పడి స్పాట్‌లోనే చనిపోయారు జాహ్నవి కందుల.
ఈ కేసులో అత్యంత దారుణమైన ఘట్టం.. ఓ వెకిలినవ్వు. 2023 సెప్టెంబర్‌లో ఈ కేసు దర్యాప్తులో ఉన్న మరో పోలీసు అధికారి డేనియల్ ఆడెరర్.. జాహ్నవి మరణం గురించి ఫోన్‌లో మాట్లాడుతూ పగలబడి నవ్వాడు. ‘ఆమె విలువ జస్ట్ 11వేల డాలర్లు’ అని డిసైడ్ చేసేశాడు డేనియల్. ఏముంది.. సియాటెల్ సిటీ ఒక చెక్ ఇస్తుంది, కేస్ క్లోజ్ అవుతుంది అని చులకన మాట్లాడాడు. ఇదంతా బాడీ కెమెరాలో రికార్డ్ అయింది. మనిషి ప్రాణానికి వెల కట్టిన తీరు, సాటి మనిషి చనిపోతే వ్యవహరించిన తీరుపై అమెరికన్ సొసైటీ సహా ప్రపంచం మొత్తం మండిపడింది.
ఈ కేసు విషయంలో అందరూ నిర్ఘాంతపోయింది 2024 ఫిబ్రవరిలో. అంటే జాహ్నవి చనిపోయిన ఏడాది తరువాత.. సాక్ష్యాధారాలు లేని కారణంగా కెవిన్‌పై క్రిమినల్ ఛార్జ్ తీసుకోవడం లేదని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ ఆఫీస్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. సీనియర్ అటార్నీలతో విచారణ చేశాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అప్పట్లో ప్రకటించింది. బట్.. సియాటెల్ భారత రాయబార కార్యాలయం ఈ స్టేట్‌మెంట్‌ను సీరియస్‌గా తీసుకుంది. ఆ నిర్ణయంపై రివ్యూ కోరింది.
ఓవైపు వెకిలి నవ్వు, మరోవైపు సాక్ష్యాధారాలు లేవని చెప్పడం.. ఇదంతా చూశాక అమెరికన్ సొసైటీలోనూ ఆగ్రహజ్వాలలు రేగాయి. ముఖ్యంగా ఆఫీసర్ డేనియల్ వ్యవహరించిన తీరుపై. దీంతో 2024 జూలైలో డేనియల్‌ను డిస్మిస్ చేశారు. జాహ్నవి మరణానికి కారణమైన కెవిన్‌పై క్రిమినల్ కేసు వేసే పరిస్థితి లేదని సియాటెల్ సిటీ తేల్చేయడంతో.. 2024 చివర్లో సియాటెల్ నగరంపై సివిల్ దావా వేసింది జాహ్నవి ఫ్యామిలీ. పోలీసుల నిర్లక్ష్యానికి, తమ కూతురిని కోల్పోయిన బాధకు పరిహారం కావాలని కోరారు.
కెవిన్‌పై క్రిమినల్ ఛార్జెస్ తీసుకోలేదు గానీ.. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు 2025 జనవరిలో ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. ఇక ఈ ఫిబ్రవరిలో సియాటెల్ సిటీ తన తప్పు ఒప్పుకుంటూ జాహ్నవి కుటుంబంతో రాజీకి వచ్చింది. మొత్తం 262 కోట్ల రూపాయల భారీ నష్టపరిహారాన్ని చెల్లించేందుకు అంగీకరించింది. ఈ డబ్బు జాహ్నవి ప్రాణానికి కట్టిన విలువ కాదు.. అహంకారంతో మాట్లాడిన వ్యవస్థకు గట్టి చెంపపెట్టు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
