Ponguru Narayana: నెల్లూరులో కనిపించని మాజీ మంత్రి నారాయణ..! అజ్ఞాతం వీడేదెప్పుడో..?
Amaravati land scam: పొంగూరు నారాయణ.. ఇరు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేరు. 2014 వరకు నారాయణ విద్యా సంస్థల అధినేతగా తెలిసిన పొంగూరు
( Murali, Nellore, TV9 Reporter )
Amaravati land scam: పొంగూరు నారాయణ.. ఇరు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేరు. 2014 వరకు నారాయణ విద్యా సంస్థల అధినేతగా తెలిసిన పొంగూరు నారాయణ. ఎన్నికల అనంతరం టిడిపి అధికారంలోకి వచ్చాక అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. ఎమ్మెల్యే కానప్పటికీ చంద్రబాబు క్యాబినెట్ లో చోటు దక్కించుకున్నారు. మున్సిపల్ శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఏపీకి కొత్త రాజధానిగా అమరావతి నిర్ణయం జరిగిన అనంతరం.. నారాయణకు సి.ఆర్.డి.ఏ చైర్మన్ గా అప్పటి సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పజెప్పారు. కొత్త రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ పద్దతి ద్వారా భూసేకరణ చేపట్టారు. రైతుల నుంచి 32 వేల ఎకరాల భూమిని సేకరించారు. ఇందులో మాజీమంత్రి నారాయణ కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర మంత్రిగా, సి.ఆర్.డి.ఏ చైర్మన్ గా ఎంత కీలకంగా ఉన్నారో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కూడా నారాయణ అంతే కీలకపాత్ర పోషించారు. జిల్లాలో రాజకీయంగా, అభివృద్ధి పరంగా ఎలాంటి నిర్ణయమైనా నారాయణదే తుది నిర్ణయం.
జిల్లాలో ఎవరికి ఎలాంటి పదవులు ఇవ్వాలన్నా తాను అనుకున్న వారికి పదవులు ఇప్పించడంలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడిని ఒప్పించగలిగే వారు. అమరావతిలో ఎంత బిజీగా ఉన్నా నెలలో 20 రోజులు నెల్లూరు జిల్లాలో నేతలకు, ప్రజలకు అందుబాటులో ఉండేవారు. పగలు అమరావతిలో ఉంటే రాత్రికి రాత్రి నెల్లూరుకు చేరుకునే వారు. అప్పట్లో నారాయణకు చీకటి మంత్రి అని ప్రతిపక్షాలు పేరును సైతం పెట్టాయి. అయినా సరే నారాయణ ఓ వెలుగు వెలిగారు. అలా వెలిగిన నేత నారాయణ ఇప్పుడు జిల్లాలో పూర్తిగా కనిపించడం లేదు. ఎక్కడ ఉన్నారో కూడా జిల్లా వాసులకు తెలియదు. 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసిన నారాయణ ప్రస్తుత మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఆతర్వాత జిల్లా, నగర ప్రజలకు ఎక్కడా అందుబాటులో లేరు. ప్రభుత్వ నిర్ణయాలు, ప్రజా సమస్యలపై ఇతర నేతలు స్పందిస్తున్నారే తప్ప ఇక్కడి నుంచి పోటీ చేసిన నారాయణ మాత్రం ఏనాడూ ఖండించారన్న దాఖలాలు లేవు.
జిల్లా విషయం అలా ఉంచితే అమరావతి, హైదరాబాద్‌లో కూడా నారాయణ బయటకు వచ్చిన సందర్భాలు లేవు. ఒకటి రెండు సందర్భాల్లో మాత్రమే చంద్రబాబుతో కలిసి మీడియాకి కనిపించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక అమరావతి భూముల విషయంలో అనేక ఆరోపణలు వచ్చాయి.. ఇటీవల సిఐడి నారాయణకు నోటీసులు ఇచ్చిన సందర్భంలో కూడా ఆయన ఎక్కడా స్పందించలేదు. ఇక తాజాగా అప్పటి సి.ఆర్.డి.ఏ కమీషనర్ చెరుకూరి శ్రీధర్ అమరావతి భూముల ఆల్రమలపై విచారణ జరుపుతున్న సిఐడి ముందు వాంగ్మూలం ఇచ్చారు. భూముల సేకరణలో సమస్యలు వస్తాయని చెప్పినా నారాయణ పట్టించుకోలేదని.. తాను చెప్పినట్లు చేయాలని అదేశించారని చెప్పడంతో మరోసారి అమరావతి భూముల వ్యవహారం చర్చకు వచ్చింది. కనీసం ఇప్పుడైనా మాజీమంత్రి నారాయణ స్పందిస్తారని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు.
అయితే.. నారాయణ కొంతకాలంగా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం నారాయణ నెల్లూరులోని తన నివాసంలో కూడా లేరు.. ఎక్కడ ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేసినా.. ఫోన్లో కూడా అందుబాటులోకి రాలేదు. దీంతో నెల్లూరు వాసులకు నారాయణని చూసే భాగ్యం ఎప్పుడు కలుగుతుందోనని పలువురు బహిరంగంగా చర్చించుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read: