Piles Surgery Death: ప్రాణం తీసిన పైల్స్ సర్జరీ.. యువకుడి మృతిపై ఆరోగ్య శాఖ దర్యాప్తు..!
మేడ్చల్ జిల్లా మల్లాపూర్‌లో 17 ఏళ్ల విద్యార్థి పైల్స్ సర్జరీ వికటించి మరణించడం తీవ్ర విషాదం నింపింది. అర్హత లేని వైద్యులు చేసిన ఆపరేషన్, ఆ తరువాత తీవ్ర రక్తస్రావం, వైద్య నిర్లక్ష్యం కారణంగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఇలాంటి సంఘటన వరంగల్‌లోనూ జరగడంతో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తీవ్రంగా స్పందించింది. చికిత్స తీసుకునే ముందు వైద్యుల అర్హతలను తప్పకుండా తనిఖీ చేసుకోవాలని TGMC సూచించింది.

మేడ్చల్ జిల్లా మల్లాపూర్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. పైల్స్ సర్జరీ వికటించడంతో 17ఏళ్ల ఇంటర్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థి గత కొద్ది రోజులుగా పైల్స్‌తో ఇబ్బందిపడుతున్నాడు. ఈ క్రమంలోనే నవంబర్ 11న హయత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు క్లినిక్‌కు తీసుకెళ్లారు తల్లిదండ్రులు. అక్కడ సాహిల్, అతని భార్య బాలుడిని పరీక్షించి వెంటనే సర్జరీ చేయాలని సూచించారు. దాదాపు రూ. 7,000 ల ఖర్చుతో ఈ ఆపరేషన్ చేయించారు. ఆ రోజు రాత్రి ఆస్పత్రిలోనే ఉన్నారు బాధిత బాలుడు, అతని కుటుంబం.
ఒక రోజంతా ఆస్పత్రిలోనే ఉన్న తరువాత మరుసటి రోజు ఇంటికి తిరిగి వచ్చారు. కానీ, మరుసటి రోజే ఆ బాలుడికి తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే క్లినిక్ కు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆ రోజు నుంచి కుటుంబ సభ్యులు ప్రతి రోజూ చికిత్స కోసం అతన్ని క్లినిక్ కు తీసుకెళ్తున్నారు. ఇది నవంబర్ 21 వరకు కొనసాగింది, ఆ తర్వాత బాలుడి పరిస్థితి మరింత దిగజారి జ్వరం, ఇతర సమస్యలు వచ్చాయి. క్లినిక్ వెంటనే అతన్ని చైతన్యపురిలోని మరో ఆసుపత్రికి రిఫర్ చేసింది. కానీ, అదే రోజు రాత్రి, అతన్ని మళ్ళీ మార్చి ఎల్బీ నగర్ లోని మరో ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్టుగా బాలుడి తల్లి తన ఫిర్యాదులో పేర్కొంది.
నవంబర్ 22న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఎల్బీ నగర్ ఆసుపత్రి వైద్యులు అతని పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అతన్ని వెంటనే మరేదైన పెద్ద ఆస్పత్రికి మార్చమని సూచించారు. దీంతో తల్లిదండ్రులు అతన్ని నీమ్స్‌కు తీసుకెళ్లారు. కానీ, దురదృష్టవశాత్తు ఆస్పత్రికి చేరుకునే లోపుగానే బాలుడు మరణించినట్టుగా నీమ్స్ వైద్యులు ప్రకటించారు. అధిక రక్తస్రావం, సంబంధిత సమస్యలే బాలుడి మృతికి కారణమని డ్యూటీ వైద్యులు తెలిపారు.
ఇదిలా ఉంటే, ఇలాంటి సంఘటనే ఈ నెల ప్రారంభంలో వరంగల్‌లో చోటు చేసుకుంది. నర్సంపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పైల్స్ సర్జరీ చేయించుకున్న తర్వాత 29 ఏళ్ల వ్యక్తి పరిస్థితి విషమంగా మారింది. పోలీసు దర్యాప్తులో ఇద్దరు అర్హత లేని వ్యక్తులు ఒక వృద్ధురాలు, ఆర్‌ఎంపీ డాక్టర్ కలిసి పైల్స్ ఆపరేషన్ చేశారని తేలింది. వైద్యం వికటించటంతో వెంటనే MGM ఆసుపత్రికి తీసుకెళ్లడంతో రోగి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటనపై సుమోటోగా చర్య తీసుకుంటామని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (TGMC) తెలిపింది. నిందితులపై NMC, తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ ప్రకారం సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామని చెప్పారు.
పైల్స్ సర్జరీని జనరల్ సర్జన్ మాత్రమే చేయాలి. అర్హత లేని వైద్యులు శస్త్రచికిత్సలు చేయడం, పైల్స్‌ను కాల్చడం వంటి అశాస్త్రీయ పద్ధతులను ఉపయోగించడం సరైనది కాదని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనల కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. చికిత్స పొందే ముందు సంబంధిత డాక్టర్ అర్హతలను తప్పనిసరిగా తెలుసుకోవాలని టిజిఎంసి వైస్ చైర్మన్ డాక్టర్ జి శ్రీనివాస్ అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..








