చలికాలంలో ఫ్రిజ్‌లో వీటిని అస్సలు పెట్టొద్దు.. పెడితే ఈ సమస్యలు పక్కా..
చాలా మంది కూరగాయలను ఫ్రిజ్‌లో నిల్వ చేస్తారు. కానీ కొన్నింటిని చలికాలంలో రిఫ్రిజిరేటర్‌లో ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల వాటి పోషకాలు తగ్గి ఆరోగ్యానికి హానికరం. ఉల్లిపాయలు, వెల్లుల్లి, టమాటాలు, బంగాళాదుంపలు, అల్లం వంటి వాటిని ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల రుచి, ఆకృతి కోల్పోయి, త్వరగా పాడైపోతాయి. వాటిని బయట సరైన వాతావరణంలో నిల్వ చేయడం వల్ల తాజాగా పోషకాలతో ఉంటాయి.

సాధారణంగా చాలా మంది వారానికి సరిపడా కూరగాయలు, పండ్లు ఒకేసారి కొనుగోలు చేసి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తారు. వాతావరణం ఎంత చల్లగా ఉన్నా.. అవి తాజాగా ఉంటాయని రిఫ్రిజిరేటర్‌లో ఉంచుతారు. అయితే చలికాలంలో కొన్ని రకాల కూరగాయలను ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదని ఆరోగ్య నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఇలా నిల్వ చేయడం వల్ల వాటి సహజ లక్షణాలు, పోషక విలువలు తగ్గిపోయి.. మన ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. మరి ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడని ఆ ముఖ్యమైన కూరగాయలు ఏంటో ఎందుకు నిల్వ చేయకూడదో తెలుసుకుందాం.
వెల్లుల్లి – ఉల్లిపాయలు
ఈ రెండింటిని నిల్వ చేయడానికి ఉత్తమ మార్గం గది ఉష్ణోగ్రత వద్ద వంటగదిలోని బుట్టలో ఉంచడం. రిఫ్రిజిరేటర్‌లో తేమ ఎక్కువగా ఉంటుంది. తొక్క తీసి లేదా పేస్ట్‌గా చేసి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే వాటి పోషక విలువలు గణనీయంగా తగ్గుతాయి. ఉల్లిపాయలు మెత్తగా మారి రుచి మారుతుంది.
టమాటా
టమాటాలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి సహజ రుచి, ఆకృతి రెండూ చెడిపోతాయి. అతి శీతల వాతావరణం టమాటాలలోని యాంటీఆక్సిడెంట్లను కూడా నాశనం చేస్తుంది. చలికాలంలో టమాటాలను బయట ఉంచినా కనీసం వారం రోజుల పాటు చెడిపోకుండా తాజాగా ఉంటాయి.
బంగాళాదుంపలు
బంగాళాదుంపలను చల్లని వాతావరణంలో ముఖ్యంగా ఫ్రిజ్‌లో నిల్వ చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఫ్రిజ్‌లో ఉంచితే అవి త్వరగా మొలకెత్తుతాయి. ఇంకా ముఖ్యంగా వాటిలోని స్టార్చ్ త్వరగా చక్కెరగా మారుతుంది. ఇది ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులతో పాటు అందరి ఆరోగ్యాన్నీ ప్రభావితం చేస్తుంది.
అల్లం
అల్లంను ఫ్రిజ్‌లో ఉంచితే అధిక తేమ కారణంగా దానిపై త్వరగా శిలీంధ్రాలు పెరిగి చెడిపోతుంది. ఈ రకమైన ఫంగస్ పట్టిన అల్లాన్ని తినడం వల్ల మూత్రపిండాలు, కాలేయంపై హానికరమైన ప్రభావాలు ఉండే అవకాశం ఉంది.
ఆకుకూరలు – ఇతర కూరగాయలు
నిపుణుల సిఫార్సు ప్రకారం.. ఆకుపచ్చ కూరగాయలను రిఫ్రిజిరేటర్‌లో 12 గంటలు మాత్రమే నిల్వ ఉంచాలి. ఎక్కువసేపు నిల్వ చేయడం వల్ల వాటి సహజ రుచి, ఆకృతి, పోషక విలువలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాలీఫ్లవర్, క్యారెట్‌లను కూడా ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు ఉంచకూడదు. ఈ కూరగాయలను చల్లని, పొడి ప్రదేశంలో ఉంచడం ద్వారా వాటి పోషకాలను, రుచిని ఎక్కువ కాలం కాపాడుకోవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




