Tirumala Laddu: లడ్డూ ప్రసాద మాధుర్యం స్వామివారి మహిమే..! శ్రీవారికి ఎన్ని నైవేద్యాలు పెడతారు..?

తిరుమల శ్రీవారి లడ్డూ... గత కొద్ది రోజులుగా ఈ శ్రీనివాసుని ప్రసాదమే దేశ వ్యాప్తంగా ప్రధాన వార్తగా మారిపోయింది. లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కూడా కలుస్తోందన్న ఆరోపణలపై తాజాగా ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. లడ్డూ మీద ప్రస్తుతం జరుగుతున్న వివాదాన్ని కాసేపు పక్కనపెడితే.. ఇంతకీ శ్రీవారికి ఏయే నైవేద్యాలు పెడుతారు? వాటిలో లడ్డూ ప్రసాదానికి ఎందుకంత ప్రాధాన్యత? ఇప్పుడు చూద్దాం..

Tirumala Laddu: లడ్డూ ప్రసాద మాధుర్యం స్వామివారి మహిమే..! శ్రీవారికి ఎన్ని నైవేద్యాలు పెడతారు..?
Tirumala Laddu
Follow us

| Edited By: TV9 Telugu

Updated on: Sep 25, 2024 | 11:16 AM

తిరుమల శ్రీవారి లడ్డూ… గత కొద్ది రోజులుగా ఈ శ్రీనివాసుని ప్రసాదమే దేశ వ్యాప్తంగా ప్రధాన వార్తగా మారిపోయింది. లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కూడా కలుస్తోందన్న ఆరోపణలపై తాజాగా ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. లడ్డూ మీద ప్రస్తుతం జరుగుతున్న వివాదాన్ని కాసేపు పక్కనపెడితే.. ఇంతకీ శ్రీవారికి ఏయే నైవేద్యాలు పెడుతారు? వాటిలో లడ్డూ ప్రసాదానికి ఎందుకంత ప్రాధాన్యత?  లడ్డూ చరిత్ర ఏంటి? ఇప్పుడు చూద్దాం..

నిజానికి శ్రీవారి లడ్డూ గురించి తెలియని వారుండరు. ఆ లడ్డూ మాధుర్యాన్ని రుచి చూడని వారు కూడా ఉండరనే చెప్పాలి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ లడ్డూలను కొనుగోలు చేసి.. తమకు తెలిసిన అందరికీ పంచిపెడుతారు. తిరుమల కొండకు వెళ్లకున్నా.. ఆ లడ్డూ ప్రసాదాన్ని తీసుకుని స్వామివారిని దర్శించుకున్నంత భక్తి భావంతో పులకించిపోతాడు సామాన్య భక్తుడు. ఈ నేపథ్యంలో అసలు ఆ లడ్డూకి అంత రుచి ఎలా వస్తుందో తెలుసుకోవాలన్న ఆసక్తి అందర్లోనూ ఉంటుంది. దాన్ని ఎలాగైనా కాపీ చెయ్యాలని చాలా మంది చేసిన ప్రయత్నాలు ఎలా ఫలించకుండా పోయాయి.

Tirumala Laddu History

Tirumala Laddu History

తిరుమల లడ్డూ చరిత్ర ఇదీ..

తిరుమలలో శ్రీవారి దర్శనం ఎంత ముఖ్యమో.. ఆ తర్వాత లడ్డూ ప్రసాదం కూడా ప్రతి భక్తునికి అంతే ముఖ్యం. నిజానికి ఈ తిరుమల లడ్డూకి శతాబ్దాల చరిత్ర ఉంది. 1715 ఆగస్టు 2న తీపి బూందీ పేరతో ప్రారంభయ్యిందని చెబుతారు. కాల క్రమంలో అంటే.. 1940లో లడ్డూగా మారిది. 1950లో జరిగిన పాలక మండలి సమావేశంలో లడ్డూ విక్రయాలకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి తిరుపతి లడ్డూ జగద్విఖ్యాతి పొందింది.

లడ్డూ కొలమానంలో భాగంగా పడి అంటారు. పడి అంటే 51 లడ్డూలు. లడ్డూలోని వినియోగించే శనగపిండి, ఆవు నెయ్యి, ఏలకులు, బెల్లం, పటిక పంచదార, ఎండు ద్రాక్ష తదితర వస్తువుల్ని ఈ పడినే కొలమానంగా తీసుకుంటారు. లడ్డూలను తయారూ చేసే వంటశాలను లడ్డూ పోటు అంటారు. ఇందులో పని చేసే వారంతా మీరాశీ వ్యవస్థ నుంచి వచ్చిన వైష్ణవ స్వాములే. అయితే లడ్డూ తయారీ విషయంలో వీరికి ఎలాంటి ప్రత్యేక శిక్షణ ఉండదు. సాధారణంగా సీనియర్ల నుంచి చూసి జూనియర్లు నేర్చుకుంటూ ఉంటారు. అయితే బూందీలో నెయ్యి కాచే సమయంలో కొంత శిక్షణ ఇస్తారు. లడ్డూ పట్టిన తర్వాత కొంత సేపు గాలికి ఆరనించి ట్రేలలో సర్దేస్తారు. స్వామికి గర్భాలయంలో నివేదించే లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదాలన్నింటినీ శ్రీ వైష్ణవ స్వాములే తయారు చేస్తారు. లడ్డూ పోటులో దాదాపు 600 మంది శ్రీ వైష్ణవ స్వాములు రాత్రింబవళ్లు లడ్డూ తయారీలో నిమగ్నమవుతారు. ప్రతి రోజూ ఉదయాన్ని లడ్డూ ప్రసాదాన్ని స్వామి వారికి నివేదిస్తారు. అలా నివేదించిన లడ్డూలను తిరిగి భక్తులకు ఇచ్చే లడ్డూలలో కలుపుతారు. వాటినే ప్రసాదంగా అందజేస్తారు.

తిరుమల లడ్డూల్లో వివిధ రకాలు

ఇక లడ్డూలలో రకాల విషయానికొస్తే సాధారణంగా మూడు రకాల లడ్డూలు స్వామికి నైవేద్యంగా పెడతారు. మొదటిది కల్యాణం లడ్డూ దాన్నే మనం పెద్ద లడ్డూ అని కూడా అంటాం. కల్యాణ సమయంలో స్వామికి నివేదించి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఆ తర్వాత ఆస్థానం లడ్డూ. తిరుమలలో ఏటా ఆణివార ఆస్థానం ఉగాది ఆస్థానం, దీపావళి ఆస్థానాలు జరుగుతుంటాయి. ఆ సందర్భంలో స్వామికి నివేదించే లడ్డూ ఆస్థానం లడ్డూ. స్వామికి ఇలాంటి విశేష పడి అయిన లడ్డూను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. అలాగే ప్రసాదంగా విక్రయించే లడ్డూలు వాటితో పాటు దర్శనం తర్వాత క్యూ లైన్లలో వచ్చే భక్తులకు చిన్న లడ్డూ. ఇలా మొత్తం 3 రకాల లడ్డూలుంటాయి. సాధారణంగా స్వామికి తెల్లవారు జామున మొదటి గంటలో అలాగే రాత్రి నివేదన సమయంలో కూడా చిన్న లడ్డూలనే నివేదిస్తారు.

ఈ చిన్న లడ్డూలను భక్తుల రద్దీని బట్టి ఒక్కోసారి లక్షన్నర వరకు అలాగే బ్రహ్మోత్సవాలు, వేసవి రద్దీ సమయాల్లో మూడున్నర లక్షల వరకు తయారు చేస్తారు. స్వామి దర్శనం చేసుకునే భక్తులకు కోరినన్ని లడ్డూలు ఇస్తున్నారిప్పుడు. అలాగే దర్శనం చేసుకోలని భక్తులు కూడా లడ్డూలు తీసుకోవచ్చు. అయితే వారి ఆధార్ కార్డ్‌ను చూపించి కేవలం రెండు మాత్రమే తీసుకునేలా కొద్ది రోజుల క్రితం నిబంధనలు సవరించారు.

Tirumala Laddu

Tirumala Laddu

స్వామి మహిమే లడ్డూ రుచికి కారణమా?

ఈ లడ్డూ రుచి కేవలం తిరుమలకే పరిమితం. ఎంతో మంది ఎన్నో సార్లు ప్రయత్నించినప్పటికీ ఆ రుచి సాధ్యం కాలేదు. ఇదంతా స్వామి మహిమే అంటారు భక్తులు. సాధారణంగా 75 గ్రాముల లడ్డూ ప్రసాదం తయారీకి 40 గ్రాముల ఆవు నెయ్యి , 40 గ్రాముల శనగపిండి.. చక్కెర, వాటితో పాటు జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష, పచ్చ కర్పూరం, ఇతర దినుసులు కలిపి మరో 70 గ్రాములు వినియోగిస్తారు. వీటిలో ఆవు నెయ్యి నాణ్యత, సువాసన అత్యంత కీలకం. రోజూ టీటీడీ సుమారు 16 వేల కేజీల ఆవు నెయ్యిని వినియోగిస్తుంది. ఈ లడ్డూకు ఉన్న విశిష్టత, ప్రాధాన్యం దృష్టిలో పెట్టుకుని.. టీటీడీ దీనికి జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ ట్యాగ్‌ రిజిస్టర్‌ చేసింది. టీటీడీ తప్ప మరొకరు ఇలాంటి లడ్డూ తయారు చేయకూడదు.. అమ్మకూడదు. 2009లో పేటెంట్‌ కూడా పొందారు. అత్యంత ప్రసిద్ధి సాధించిన తిరుమల లడ్డూతో 2017లో పోస్టల్‌ శాఖ తపాలా స్టాంపు కూడా విడుదల చేసింది.

ఇక లడ్డూ తయారీలో వినియోగించే స్వచ్ఛమైన, సువాసన కల్గిన ఆవు నెయ్యి కోసం ఏటా సుమారు 250 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఏటా సమారు 12 నుంచి 13 కోట్ల లడ్డూలను విక్రయిస్తుంది. వీటి విక్రయాల ద్వారా టీటీడీ ఏటా సుమారు 500 కోట్ల రూపాయలు ఆర్జిస్తోంది.

Tirumala Laddu

Tirumala Laddu

శ్రీవారికి సమర్పించే ఇతర నైవేద్యాలు..

తిరుమల వెళ్లే భక్తులకు ప్రసాదం అంటే ఒక్క లడ్డూ మాత్రమే గుర్తొచ్చినా… స్వామి వారికి ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు వివిధ సందర్భాల్లో పెట్టే వివిధ రకాల ప్రసాదాల సంఖ్య సుమారు 50 వరకు ఉంటుంది. వీటిల్లో లడ్డూ, వడ.. ఈ రెండింటిది ప్రముఖ స్థానం. ఇక అన్న ప్రసాదాల విషయానికి వస్తే ఉప్పు పొంగలి, చక్రపొంగలి, దద్దోజనం, పులిహోర ఉంటాయి. వీటితో పాటు ఇతర ప్రసాదాల విషయానికొస్తే.. దోశలు, అప్పాలు, కదంబం, నువ్వుల ప్రసాదం ఇలా చాలా ఉంటాయి. వాటితో పాటుగా ప్రతి ఆదివారం అమృత కలశం పేరిట విశేష ప్రసాదం కూడా ఉంటుంది. నిత్య హారతుల్లో పళ్లు, డ్రైఫ్రూట్స్, ఆవు పాలు ఇలా అనేక ప్రసాదాలుంటాయి.

మరిన్ని ప్రీమియం కథనాల కోసం.. TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి