తిరుమల లడ్డూ ప్రసాదం
తిరుమల శ్రీవారి లడ్డూ మహా ప్రసాదాన్ని భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. అందుకే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ లడ్డూలను కొనుగోలు చేసి.. తమకు తెలిసిన అందరికీ పంచిపెడుతారు. ప్రతి రోజూ తిరుమల ఆలయంలో 3.5 లక్షల లడ్డూలను భక్తులకు పంపిణీ చేస్తున్నారు. ప్రతియేటా దాదాపు 12-13 కోట్ల లడ్డూలను తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డూ ప్రసాదాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించే ఆనవాయితీ 1715 ఆగస్టు 2న ప్రారంభమయ్యింది. అంటే తిరుమల లడ్డూ మహా ప్రసాదానికి 300 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. 2008లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డూ ప్రసాదానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ట్యాగింగ్ కోసం అప్లై చేసుకోగా.. 2009లో దీనికి ఆమోదం లభించింది. 2017లో తిరుమల లడ్డూపై ఇండియా పోస్ట్ పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది.
లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా టీటీడీ దాదాపు రూ.500 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. లడ్డూ పోటులో దాదాపు 600 మంది శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు లడ్డూ తయారీలో నిత్యం నిమగ్నమవుతారు. లడ్డూల దయారీ కోసం రోజూ 16 టన్నుల నెయ్యిని వినియోగిస్తున్నారు. దీని కోసం ప్రతి ఆరు మాసాలకు ఒకసారి 36 లక్షల కేజీల నెయ్యి కోసం టీటీడీ టెండర్లు ఆహ్వానిస్తోంది. లడ్డూ తయారీ కోసం ఆలయానికి సమీపంలో 85 టన్నుల నెయ్యి నిల్వ కోసం ట్యాంకును ఏర్పాటు చేశారు. లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వును వాడినట్లు ల్యాబ్ రిపోర్ట్‌లో నిర్థారణ కావడం పెను దుమారంరేపుతోంది.