Cow Swallows Gold: బంగారు నెక్లెస్‌ను మింగేసిన ఆవు.. నెల రోజుల తర్వాత ఏం జరిగిందంటే..?
ప్రమాదవశాత్తు ఆవు బంగారు గొలుసు మింగేసింది. ఎలాగైన పేడ రూపంలో బయటకు వస్తుందని భావించిన ఆ కుటుంబానికి నిరాశే ఎదురైంది.
Karnataka Cow Swallows Gold Chain: ప్రమాదవశాత్తు ఆవు బంగారు గొలుసు మింగేసింది. ఎలాగైన పేడ రూపంలో బయటకు వస్తుందని భావించిన ఆ కుటుంబానికి నిరాశే ఎదురైంది. తమ నెక్లెస్‌ను ఎలాగైనా దక్కించుకోవడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఫ్యామిలీ.. ఓ నిర్ణయానికి వచ్చింది. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఉత్తర కన్నడ జిల్లాలోని సిర్సి తాలూకాలోని హిప్నహళ్లిలో శ్రీకాంత్ హెగ్డే కుటుంబం నివసిస్తున్నారు. కుటుంబానికి 4 సంవత్సరాల ఆవు, ఒక దూడ ఉంది. దీపావళి ముందురోజు గోపూజ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా స్నానం చేసి ఆవు, దూడకు పూజలు చేశారు.
ఆ ప్రాంతంలో దీపావాళి వేడుకల్లో ప్రజలు ఆవులను పూజించడం అనవాయితీ. ఈ క్రమంలోనే ఆవును హారాలు, రంగురంగుల పూలతో అలంకరించారు. కొంతమంది ఆవును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అందుకే ఆవులను బంగారు ఆభరణాలతో అలంకరించి పూజించి మంచి ఆహారం తినిపించి ఆ ఆభరణాలను వెనక్కి తీసుకుంటారు. సాంప్రదాయం ప్రకారం, హెగ్డే కుటుంబం కూడా దూడ మెడలో 20 గ్రాముల బంగారు గొలుసును వేశారు. అనంతరం గొలుసు తీసి ఆవు ముందు పూలు, ఇతర వస్తువులను ఉంచారు. దానికి ఆ గొలుసును కూడా మేతగా భావించి అమాంతం మింగేసింది ఆవు. కొద్ది నిమిషాల్లోనే బంగారు గొలుసు మాయమైంది. గృహస్థులు ఎక్కడికక్కడ గొలుసుల కోసం వెతకడం ప్రారంభించారు. అయితే, గొలుసు కనిపించకపోవడంతో ఆవు మింగేసి ఉండొచ్చని కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేశారు.
ఈ సంఘటన జరిగిన 30 35 రోజులపాటు ప్రతిరోజూ హెగ్డే కుటుంబం ఆవు, దూడ పేడలో గొలుసుల కోసం వెతికారు. అయితే, గొలుసు లేకపోవడంతో విసుగు చెందిన ఆ కుటుంబం చివరకు పశువైద్యుని ఆశ్రయించింది. ఆవు కడుపులో గొలుసు ఉందా లేదా అని వైద్యుడు మెటల్ డిటెక్టర్‌ని ఉపయోగించి పరీక్షించారు. ఆవు పొట్టను స్కాన్ చేసి గొలుసు ఎక్కడ ఉందో కనిపెట్టారు. అనంతరం శస్త్రచికిత్స చేసి ఆవు కడుపులో ఉన్న బంగారు గొలుసును తొలగించారు. బంగారు గొలుసును తొలగించిన తర్వాత దాని బరువు 2 గ్రాములు తగ్గి,18 గ్రాములు మాత్రమే మిగిలింది. గొలుసు కూడా తెగిపోయింది. దీంతో 2 గ్రాముల బంగారం పోయినా.. గొలుసు తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read Also… Vaccine Certificate: వైద్య, ఆరోగ్య సిబ్బంది నిర్వాకం.. చనిపోయిన ఆరు నెలలకు వ్యాక్సిన్ సర్టిఫికేట్..!