AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల్లిదండ్రులు చేసే ఈ చిన్న పొరపాటుతో పిల్లల ప్రాణాలకే ముప్పు.. ఈ తప్పు అస్సలు చేయొద్దు..

పిల్లలకి జ్వరం వస్తే చాలు.. చాలామంది తల్లిదండ్రులు కంగారులో ఇంట్లో ఉన్న పెద్దల మాత్రలనే సగానికి విరిచి వేసేస్తుంటారు. సగం విరిచి ఇస్తే డోస్ తగ్గిపోతుందని, పిల్లలకి సురక్షితం అని అనుకుంటే మీరు పొరపాటు చేస్తున్నట్లే. తల్లిదండ్రులు అమాయకత్వంతో చేసే ఈ ఒక్క చిన్న పొరపాటు.. పిల్లల కాలేయం, కిడ్నీలపై ఎలాంటి ఘోరమైన ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం..

తల్లిదండ్రులు చేసే ఈ చిన్న పొరపాటుతో పిల్లల ప్రాణాలకే ముప్పు.. ఈ తప్పు అస్సలు చేయొద్దు..
Can You Give Children Half An Adult Tablet
Krishna S
|

Updated on: Jul 03, 2026 | 11:55 AM

Share

సాధారణంగా ఇంట్లో పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరం లేదా ఒంటి నొప్పులు వంటి సాధారణ ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు చాలామంది తల్లిదండ్రులు కంగారుపడిపోతుంటారు. ఆ సమయంలో ఇంట్లో పిల్లల మందులు లేకపోతే.. పెద్దల మాత్రలను సగానికి లేదా పావు వంతుకు విరిచి తమ పిల్లలకు వేసేస్తుంటారు. ఇలా సగం విరిచి ఇవ్వడం వల్ల పిల్లలకు సరైన మోతాదు అందుతుందని, జ్వరం తగ్గిపోతుందని చాలామంది భావిస్తుంటారు. దాదాపు ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక సందర్భంలో ఈ పొరపాటు జరుగుతూనే ఉంటుంది. కానీ ఇలా చేయడం పిల్లల ప్రాణాలకే అత్యంత ప్రమాదకరమని ప్రముఖ శిశువైద్యులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులు అమాయకత్వంతో చేసే ఈ పద్ధతి పిల్లల ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావాలను చూపిస్తుందో, దీని వెనుక ఉన్న అసలు వైద్య కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పెద్దల మాత్రను విరిచి ఇవ్వడం ఎందుకు ప్రమాదకరం?

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పిల్లలకు ఇచ్చే మందుల మోతాదును కేవలం వయస్సు ఆధారంగా మాత్రమే నిర్ణయించరు. దాని వెనుక చాలా లెక్కలు ఉంటాయి.

బరువు – తీవ్రత: పిల్లల శరీర బరువు, వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, వ్యాధి తీవ్రత, ఆ మందు యొక్క స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని వైద్యులు డోసేజ్ నిర్ధారిస్తారు.

మందు సమానంగా ఉండదు: ఒక పెద్ద మాత్రను మనం చేత్తోనో లేదా కత్తితోనో సగానికి విరిచినప్పుడు.. ఆ మాత్రలో ఉండే మందు కణాలు రెండు వైపులా సమానంగా పంపిణీ అవ్వవు. దీనివల్ల ఒక భాగంలో మందు ఎక్కువగానో, మరో భాగంలో తక్కువగానో ఉండిపోతుంది. ఇది శరీరంలోకి ప్రవేశించినప్పుడు డోస్ ఎక్కువ లేదా తక్కువ అయ్యే ప్రమాదం ఉంది.

ప్రత్యేక పూత పూసిన మాత్రలు: మార్కెట్లో దొరికే కొన్ని ప్రత్యేక రకాల మాత్రలపై CR, SR , MR అని రాసి ఉంటుంది. ఇవి శరీరంలోకి వెళ్లాక చాలా నెమ్మదిగా కరగడానికి వీలుగా వాటిపై ప్రత్యేక పూత పూస్తారు. ఇలాంటి మాత్రలను విరిస్తే.. ఆ పూత దెబ్బతిని మందు మొత్తం ఒకేసారి శరీరంలోకి విడుదలవుతుంది. ఇది తీవ్ర దుష్ప్రభావాలకు దారితీస్తుంది.

ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తుతాయి?

పిల్లల కాలేయం, కిడ్నీలు పెద్దవారి అంతగా బలంగా అభివృద్ధి చెంది ఉండవు. అందువల్ల పెద్దల మందులు ఇవ్వడం వల్ల కింది సమస్యలు రావచ్చు.

టాక్సిసిటీ : మోతాదు ఎక్కువైతే అది పిల్లల శరీరంలో విషపూరితంగా మారే ప్రమాదం ఉంది.

తీవ్రమైన అలర్జీలు: చర్మంపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు.

ఓవర్ డోస్ లేదా అండర్ డోస్: మందు ఎక్కువైతే అవయవాలపై భారం పడుతుంది. తక్కువైతే అసలు రోగమే తగ్గదు.

యాంటిబయాటిక్స్ ప్రమాదం: ముఖ్యంగా యాంటిబయాటిక్స్, హార్మోన్లు, గుండె సంబంధిత మందుల విషయంలో ఈ రకమైన ప్రయోగాలు చేస్తే ఫలితాలు అత్యంత ఘోరంగా ఉంటాయి.

తల్లిదండ్రులు ఏం చేయాలి?

సొంత ప్రయోగాలు వద్దు: పిల్ల అనారోగ్యానికి గురైనప్పుడు ఇంట్లో ఉన్న పెద్దల మాత్రలలో సగాన్ని మీ అంతట మీరే ఇవ్వడం పూర్తిగా స్వస్తి పలకండి.

పిల్లల కోసమే ప్రత్యేక మందులు: పిల్లల కొరకు ప్రత్యేకంగా తయారు చేసిన సిరప్‌లు, చుక్కల మందులు లేదా పెడియాట్రిక్ మాత్రలను మాత్రమే వాడాలి.

వైద్యుడి సంప్రదింపు మస్ట్: ఏ చిన్న మందునైనా ప్రారంభించే ముందు ఖచ్చితంగా మీ శిశువైద్యుడిని సంప్రదించి, వారు రాసిన ప్రిస్క్రిప్షన్ ప్రకారమే మందులు వేయాలి.

Follow Us