Covid Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారా? టీకా మెరుగ్గా పని చేయాలంటే ఏం చేయాలో తెలుసుకోండి..
కరోనా వ్యాక్సిన్ వేయించుకునే వారికి అత్యంత కీలకాంశాలను సూచిస్తున్నాయి వైద్య వర్గాలు. ఈ సూచనలు పాటించకుండా వ్యాక్సిన్ వేయించుకున్నా ఉపయోగం లేదంటున్నారు డాక్టర్లు. మరి ఈ సూచనలు, వాటి వివరాలు తెలుసుకుందామా?
Things to do for better effect of corona vaccine: ఏడాది కాలంగా యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి అంతానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైన సంగతి అందరికీ తెలిసిందే. మనదేశంలో జనవరి 16వ తేదీన వ్యాక్సినేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టగా నేటికి (ఫిబ్రవరి 16) నెల రోజులు పూర్తి అయ్యింది. తొలి రోజుల్లో టీకా తీసుకున్న వారిలో చాలా మంది రెండో డోసు కూడా తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల వ్యాక్సిన్ వేయించుకున్న వారికి ఇబ్బందులు ఎదురైనట్లు (అధికారికంగా ధృవీకరించబడలేదు) వార్తలొచ్చినా.. మొత్తమ్మీద వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగానే సాగుతోంది. నెల రోజుల తర్వాత గణాంకాలను పరిశీలిస్తే మనదేశంలోనే దాదాపు 90 లక్షల మందికి వ్యాక్సిన్ వేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. మనదేశంతోపాటు ఇక్కడ తయారైన వ్యాక్సిన్లు ప్రపంచంలోని మొత్తం 17 దేశాలకు సరఫరా చేశారు. మానవతా దృక్పథంతో భారత్ పంపిన కరోనా వ్యాక్సిన్లపై అంతర్జాతీయంగా పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
సుదీర్ఘ కాలం పాటు సాగే టీకాల తయారీని శరవేగంగా పూర్తి చేశారు శాస్త్రవేత్తలు. మానవాళి సంక్షోభంలో పడినపుడు శాస్త్రవేత్తలు వారి బాధ్యతలను ఆశించిన దానికంటే ఎక్కువ బాధ్యతతో నిర్వర్తించారనడానికి శరవేగంగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేవడమే చక్కని ఉదాహరణ. ఎన్నో పరిశోధనలు.. ఎన్నో ప్రయోగాలు.. ఎన్నో సవరణలు.. ఎన్నో పరీక్షలు.. ఇంతగా శ్రమించి రూపొందించిన వ్యాక్సిన్‌లు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలంటే మనం కూడా చేయాల్సిన పనులు కొన్ని వున్నాయంటున్నారు వైద్యులు. ఈ వ్యాక్సిన్లు కొందరిలో సమర్థవంతంగా పనిచేస్తే.. మరికొందరిలో పెద్దగా ప్రభావం చూపలేవని చెబుతున్నారు. దీనికి కారణమేంటని ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయాలను చెబుతున్నాయి వైద్యవర్గాలు.
మన శరీర స్వభావం మాట అటుంచితే ఇతరత్రా అంశాలేవైనా ఇందుకు దోహదం చేస్తాయా అంటే అవుననే అంటున్నారు. కుంగుబాటు (డిప్రెషన్), మానసిక ఒత్తిడి (స్ట్రెస్), చెడు అలవాట్లు మన శరీర రోగ నిరోధక వ్యవస్థను బలహీనపరుస్తాయి. ఆయా టీకాల సామర్థ్యం తగ్గడంలో పాలు పంచుకుంటున్నాయని వైద్య వర్గాలు వివరిస్తున్నాయి. కోవిడ్-19 వ్యాక్సిన్లకు ఇదే సూత్రం వర్తిస్తుంది. మన అలవాట్లు, ప్రవర్తన మార్పులతో టీకాలకు శరీరం మరింత మెరుగ్గా స్పందించేలా చూసుకోవచ్చంటున్నాయి వైద్య వర్గాలు. వ్యాక్సిన్ వేగంగా, సమర్థంగా పనిచేసేలా మన కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా చూసుకోవచ్చని చెబుతున్నాయి.
కలుపుగోలు తనం బెటర్
ఎప్పుడు ఒంటరిగా ఏదో కోల్పోయినట్లుగా వుండడం మంచిది కాదంటున్నారు డాక్టర్లు. ఒంటరితనంతో విచారం, దిగులు మనల్ని ఆవహిస్తాయని చెబుతున్నారు. ఇవి రోగనిరోధక వ్యవస్థ పనితీరు నెమ్మదించేలా చేస్తాయి. దాంతో టీకాకు యాంటీబాడీల ప్రతిస్పందన తగ్గుతుంది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో సన్నిహితంగా ఉండటం ఎవరికైనా మంచిదే. నలుగురితో కలివిడిగా ఉండటం వల్ల మానసిక బలం పెరుగుతుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థ చురుకుగా పనిచేయటానికి ఉపయోగపడుతుందని డాక్టర్లు సూచిస్తున్నారు.
మద్యానికి గుడ్‌బై
వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఒక రోజు ముందు నుంచి మద్యం జోలికి వెళ్ళకపోవడం బెటర్ అంటున్నారు వైద్యులు. వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందు రోజు, టీకా తీసుకున్న తర్వాత మద్యం జోలికి వెళ్లకుండా ఉండటమే ఉత్తమమంటున్నారు. అతిగా మద్యం తాగితే రోగ నిరోధక కణాల పనితీరు అస్తవ్యస్తమవుతుంది. ఇది శరీరం వైరస్‌ను ఎదుర్కోవటానికి అవసరమైన శక్తిని తగ్గిస్తుంది. మద్యం జోలికి వెళ్లకపోవటం, ఒకవేళ అలవాటుంటే పరిమితం చేసుకోవటం ఎంతైనా అవసరమంటున్నారు వైద్యులు.
ఎక్సర్‌సైజ్ అనివార్యం
శారీరక శ్రమ లేకుండా బద్ధకంగా కూర్చొనే వారితో పోలిస్తే తగినంత శారీరక శ్రమ చేసేవారిలో రోగనిరోధక వ్యవస్థ బాగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకోవటానికి 15 నిమిషాల ముందు నడవటం వంటి వ్యాయామాలు చేసినవారిలో టీకాలకు యాంటీబాడీల ప్రతిస్పందన మరింత ఎక్కువగా కనిపిస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక్క టీకా కోసమే కాదు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ఆరోగ్యానికి అన్ని విధాలా మేలు చేసేదేనని డాక్టర్లు సూచిస్తున్నారు.
పై మూడు సూచనలతోపాటు మరిన్ని అంశాలపై వైద్య వర్గాలు పలు సూచనలు చేస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ వేయించుకునే వారు ఒత్తిడికి దూరంగా వుండాలని చెబుతున్నారు. ఒత్తిడితో బాధపడేవారిలో టీకాలకు యాంటీబాడీల ప్రతిస్పందన బలహీనపడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అదే టీకా తీసుకునే రోజున మానసికంగా ఉత్సాహంగా ఉన్నవారిలో యాంటీబాడీల ప్రతిస్పందన బలంగా ఉంటోందని వివరిస్తున్నాయి. కాబట్టి ఒత్తిడికి దూరంగా ఉండటం, టీకా తీసుకునే సమయంలో ప్రశాంతంగా ఉండటం మంచిది. రోజూ ధ్యానం, ప్రాణాయామం వంటివి చేస్తుంటే ఒత్తిడి బారినపడకుండా కాపాడుకోవచ్చు.
వ్యాక్సిన్ వేయించుకునే ముందు రోజు నిద్ర సరిగా పట్టనివారితో పోలిస్తే కంటి నిండా నిద్రపోయినవారిలో రోగనిరోధక వ్యవస్థ చాలా చురుకుగా పనిచేస్తున్నట్టు పరిశోధనలు పేర్కొంటున్నాయి. ఇది యాంటీబాడీల ప్రతిస్పందన బలంగా ఉండటానికి తోడ్పడుతుంది. కాబట్టి నిద్ర బాగా పట్టేలా చూసుకోవటం అన్ని విధాలా మంచిది. ఇది టీకా తీసుకునే సమయంలో భయం, ఆందోళన తగ్గటానికి ఉపయోగపడుతుంది.
కరోనా వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకున్న తర్వాత 28 రోజులకు రెండో డోసు విధిగా వేయించుకోవాల్సి వుంటుంది. ఆ తర్వాత కూడా 20 రోజుల పాటు జాగ్రత్తగా వుండాల్సి వుంటుంది. వ్యాక్సిన్ వేయించుకోగానే ఇక కరోనా రాదన్న ధీమాతో మాస్కు తీసేయడం, శానిటైజర్ వినియోగాన్ని మానేయడం, సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం మంచిది కాదంటున్నాయి వైద్య వర్గాలు. వైద్య వర్గాల సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మేరకు స్పష్టమైన నిబంధనలను వ్యాక్సిన్ కేంద్రాల్లో ఏర్పాటు చేసింది. వాటిని కూలంకషంగా చదువుకుని, శ్రద్ధతో పాటించడం ద్వారా కరోనాతో యుద్ధంలో విజేతలుగా నిలవాలని వైద్యులంటున్నారు.
Also Read: పుదుచ్ఛేరిలో రాజకీయ సంక్షోభం.. ఎమ్మెల్యేల రాజీనామాల వెనుక రహస్యమిదే!
Also Read: టీవీ, ఫ్రిడ్జ్ వున్నాయా? అయితే మీ తెల్ల రేషన్ కార్డు హుళక్కే..!
Also Read: యూటీ ప్రకటనతో రాజకీయ కలకలం.. అసదుద్దీన్ వ్యూహమేంటి?
Also Read: ప్రజల మీదికి ఖైదీల అస్త్రం.. సైన్యం నిర్ణయంపై ఆగ్రహం