Hyderabad Union Territory: యూటీ ప్రకటనతో రాజకీయ కలకలం.. అసదుద్దీన్ వ్యూహమేంటి? రాజకీయ రచ్చకు రీజనేంటి?
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు అది చర్చల్లో అంశం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దాదాపు ఏడేళ్ళ తర్వాత మళ్ళీ తెరమీదికి వచ్చింది. ఆ అంశంపై రాజకీయ రగడ...
The uproar over Hyderabad as Union territory: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు అది చర్చల్లో అంశం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దాదాపు ఏడేళ్ళ తర్వాత మళ్ళీ తెరమీదికి వచ్చింది. ఆ అంశంపై రాజకీయ రగడ రాజుకునేందుకు దారి తీసిన కారణమేంటి? కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? అదే హైదరాబాద్ మహానగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయడం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు పలువురి నోట వినిపించిన మాట ఇది. హైదరాబాద్ మహానగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేస్తూ.. మిగిలిన తెలంగాణ జిల్లాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కొందరి నోట అప్పట్లో వినిపించింది.
తెలంగాణ ప్రాంతానికి నట్టనడుమన వుండి.. ఒకప్పటి హైదరాబాద్ సంస్థానానికి ఆయువుపట్టుగా వున్న భాగ్యనగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ఏ ఒక్క తెలంగాణ బిడ్డ ఒప్పుకోడు. కానీ కొందరి రాజకీయ ప్రయోజనాల కోసం అప్పట్లో వినిపించిందీ నినాదం. అప్పట్లో ఎవరు ఎందుకు హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనుకున్నారు? అందుకోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఈ విషయాలు ప్రస్తుతానికి అప్రస్తుతం. కానీ తాజాగా హైదరాబాద్ మహానగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. దానికి కారణమేంటి? అసలీ మాట కేంద్ర ప్రభుత్వ అధినేతల నుంచి వచ్చిందా? లేక ఎవరైనా రాజకీయ నాయకులు వ్యూహాత్మకంగా ఈ అంశాన్ని తెరమీదికి తెచ్చారా?
గతవారం లోక్‌సభ వేదికగా జమ్మూకశ్మీర్ బిల్లు ఆమోదం పొందింది. ఈ సందర్భంగా సభలో కాస్త వాడీవేడీ చర్చే జరిగింది. ఈ చర్చ అంతా జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా మళ్ళీ ఇస్తారా? ఇవ్వరా? అనే అంశంపై జరుగుతుంటే హైదరాబాద్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆశ్చర్యకరంగా.. ఒకరకంగా చెప్పాలంటే కాస్త హైపోథిటికల్ (ఊహాత్మక) వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, అహ్మదాబాద్, లక్నో వంటి మహానగరాలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేయాలని అనుకుంటుందని ఓవైసీ చెప్పుకొచ్చారు. అయితే దీనికి ఆయన ఎలాంటి సాక్ష్యాలను, కేంద్ర ప్రభుత్వం డాక్యుమెంట్లను, ప్రతిపాదనాత్మక (డ్రాఫ్టు) డాక్యుమెంట్లను కానీ ఆయన సభ ముందుంచలేదు. కనీసం కేంద్ర హోం శాఖ మంత్రి నుంచి వివరణ కూడా కోరలేదు. కేవలం ఆ మహానగరాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేయాలన్న కుట్రను మోదీ సర్కార్ చేస్తుందని ఓ ప్రకటన చేసి ప్రభుత్వ స్పందన కోసం కూడా చూడకుండా సభ నుంచి ఆయన వెళ్ళిపోయారు.
ఓవైసీ కామెంట్లను అప్పటికప్పుడు చర్చకు సమాధానమిచ్చిన కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా ఖండించారు. పరిస్థితులు అనుకూలంగా మారితే జమ్మూ కశ్మీర్‌కే రాష్ట్ర హోదాను పునరుద్దరించే ఆలోచన చేస్తున్న తమకు మరిన్ని రాష్ట్రాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేయాలన్న ఉద్దేశం ఎంత మాత్రం లేదని అమిత్ షా కుండ బద్దలు కొట్టారు. పరిస్థితులను గాడిలో పెట్టేందుకే జమ్మూ కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేశామని, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం ద్వారా అక్కడ ప్రజాస్వామ్యాన్ని గాడిలో పెట్టే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అమిత్ షా సభ సాక్షిగా వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా కశ్మీరీ యువత ప్రశాంత వాతావరణం పట్ల మొగ్గు చూపారని ఆయన వ్యాఖ్యానించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలను కశ్మీర్‌లో నెలకొల్పడం ద్వారా విద్యా రంగంలో కశ్మీర్ యువత తమ ప్రతిభాపాటవాలను చాటుకునే వీలును కల్పిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అమిత్ షా ప్రకటనతో ఓవైసీ కామెంట్లలో పస లేదని అప్పటికప్పుడు తేలిపోయింది. దాంతో ఆ అంశం ముగిసినట్లయ్యింది.
కానీ ఓవైసీ కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపాయి. అసలే బీజేపీతో ఉప్పు నిప్పుగా వున్న తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు హైదరాబాద్ మహానగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే ఊరుకోమని ప్రకటనలు మొదలు పెట్టారు. కాంగ్రెస్ నేతలు మరో అడుగు ముందుకేసి.. బీజేపీకీ బీ టీమ్ అయిన ఎంఐఎం అధినేత యూటీ కామెంట్లు చేశారంటే దాని వెనుక సాక్షాత్తు అమిత్ షా వుండి వుంటారన్న ప్రకటనలు మొదలు పెట్టారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు హైదరాబాదును యూటీ చేస్తే ఊరుకోమని చెప్పుకొచ్చారు. సంగారెడ్డి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి అయితే ఏకంగా అసద్‌కు, అమిత్‌షాకు లింకు పెట్టేశారు. అమిత్ వదిలిన హింటే అసద్ నోటి వెంట వెలువడిందని జగ్గారెడ్డి అన్నారు.
అసలా ఉద్దేశమే లేదని బీజేపీ నేతలు పలువురు చెప్పుకొచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ.కిషన్ రెడ్డి కూడా కేంద్ర పాలితం చేయాలన్న ప్రతిపాదనేదీ లేదని ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి మరీ క్లారిటీ ఇచ్చారు. ఇక బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అయితే.. అసదుద్దీన్‌ను ఏకి పారేశారు. ఆయన చేసింది బుద్ది లేని ప్రకటన అని కామెంట్ చేశారాయన. అయితేనేం అధికార టీఆర్ఎస్ నేతల ఆరోపణలు ఆగడం లేదు. తాజాగా తెలంగాణ మంత్రి శ్రీనివాస్ యాదవ్.. హైదరాబాద్ మహానగరాన్ని యూటీగా చేస్తే చూస్తూ ఊరుకోమని కమలనాథులకు హెచ్చరికలు జారీ చేశారు.
కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర పాలిత ప్రాంతాల ఏర్పాటు డ్రాఫ్టులేవీ సిద్దం కావడం లేదని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు లాంటి వారు స్పష్టత ఇచ్చినా ప్రకటనలపర్వం ఆగడం లేదు. సరికదా.. ఇంకాస్త తీవ్ర రూపం సంతరించుకుంటోంది. టీఆర్ఎస్ పార్టీకి మిత్ర పక్షం ఎంఐఎం ఎంపీ చేసిన ప్రకటన ఆధారంగా గులాబీ నేతలు స్పందించడం కాస్త విడ్డూరంగానే కనిపిస్తోంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ విషయాన్ని అక్కడికక్కడే ఖండించినా ఈ విషయంపై రగడ కొనసాగడం విశేషం. అసదుద్దీన్ వదిలిన యూటీ బాణం వెనుక ఎవరున్నారన్న చర్చ ఇపుడు తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తోంది.
ఒకప్పుడు హైదరాబాద్ నగరానికే పరిమితమైన ఎంఐఎం పార్టీ ఇపుడు దేశంలోని పలు రాష్ట్రాలలో వేళ్ళూనుకుంటోంది. మహారాష్ట్రలో పాగా వేసింది. బీహార్‌లో సత్తా చాటింది. యూపీలో కాస్త బలంగానే కనిపిస్తోంది. త్వరలో జరగనున్న బెంగాల్, తమిళనాడు ఎన్నికలపై ప్రస్తుతం దృష్టి సారించింది. ఇలా దేశవ్యాప్తంగా విస్తరించాలంటే కాస్త నిఖార్సయిన కామెంట్లతోనే సాధ్యమన్న వ్యూహంతో అసద్ ప్రకటన చేస్తే.. దాని ఆధారంగా తెలంగాణ రాజకీయ పార్టీలు రచ్చ మొదలు పెట్టాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మంట పుట్టించే ప్రకటనలతో రచ్చ రాజేస్తే పలు రాష్ట్రాలలో తమ ఎంట్రీ సులభతరమవుతుందన్నది అసద్ వ్యూహం కావచ్చని వారు చెప్పుకుంటున్నారు. కంట్రీ వైడ్‌గా కైట్ ఎగరాలంటే ఖతర్నాక్ ప్రకటనలతోనే సాధ్యమన్నది ఓవైసీ స్ట్రాటెజీ కావచ్చంటున్నారు.
అసద్ వదిలిన బాణం బీజేపీకి బాగానే గుచ్చుకుంది. అసద్ చేసిన ప్రకటనపై కమలనాథులు క్లారిటీ ఇచ్చేందుకు పోటీ పడుతున్నారు. అయితే.. పార్లమెంటులో కామెంట్ చేసిన ఓవైసీ.. కనీసం ప్రభుత్వం నుంచి క్లారిటీ కూడా తీసుకోకుండానే.. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే లోగానే పార్లమెంటు నుంచి జారుకున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఒక్క జమ్మూ కశ్మీర్ మినహా కొత్తగా యూటీలను ఏర్పాటు చేయలేదని, యూటీలనే రాష్ట్రాలుగా మార్చారని ఆయన గుర్తు చేశారు. కశ్మీర్‌లోని ప్రత్యేక పరిస్థితులు, దశాబ్దాలుగా 370 ఆర్టికల్ చూపిన ప్రభావం వల్ల కశ్మీర్‌ను కొంత కాలం కోసం యూటీగా చేయాల్సి వచ్చిందని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
క్లారిటీ కోసం కామెంట్ చేసినా.. లేక ప్రభుత్వాన్ని ప్రశ్నించినా వేరేలా వుండేది కానీ.. కామెంట్ చేసి వెళ్ళిపోయిన అసదుద్దీన్ వెనుక పార్టీ విస్తరణ కాంక్ష, వ్యూహం మాత్రమే వున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అసద్ విసిరిన బాణం వెనుక వ్యూహాన్ని అర్థం చేసుకోకుండా బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు పరస్పర కామెంట్లతో రాజకీయాన్ని మరింత వేడెక్కించారని అనుకుంటున్నారు.
Also read: ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్యలో బీజేపీ.. ఈసారి త్రిముఖపోటీ ఖాయం!
Also read: భారత్, చైనా మధ్యలో రాహుల్.. పాంగాంగ్ ఉపసంహరణ వెనుక మర్మమేంటి?