India-China Border: భారత్, చైనా మధ్యలో రాహుల్.. ఎడతెగని వాదోపవాదాలు.. పాంగాంగ్ ఉపసంహరణ వెనుక మర్మమేంటి?

ఇండో-చైనా బోర్డర్ టెన్షన్ దేశంలో రాజకీయరచ్చకు దారితీస్తోంది. ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధాన్ని తీవ్రం చేస్తోంది. రెండు దేశాల బలగాల ఉపసంహరణపై ఇరు పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్రమయ్యాయి.

  • Rajesh Sharma
  • Publish Date - 2:45 pm, Sat, 13 February 21
India-China Border: భారత్, చైనా మధ్యలో రాహుల్.. ఎడతెగని వాదోపవాదాలు.. పాంగాంగ్ ఉపసంహరణ వెనుక మర్మమేంటి?

Severe fight between BJP and Congress over Indo-China border tension: భారత్, చైనా బోర్డర్ వ్యవహారం దేశంలో రెండు ప్రధాన పార్టీల మధ్య చిచ్చు రాజేసింది. ఇన్ ఫాక్ట్… చిచ్చు రాజేసింది అనడం కంటే చిచ్చు పీక్ లెవెల్‌కు చేర్చింది అనడం సబబుగా వుంటుందేమో. గత ఏడాది కాలంగా రెండు దేశాల మధ్య తూర్పు లద్ధాక్ ప్రాంతంలోని పాంగాంగ్ వద్ద తీవ్ర స్థాయిలో ఉద్రిక్తత నెలకొనడం.. రెండు దేశాల సైన్యాల మధ్య జరగిన ఘర్షణల్లో ఇరువైపులా ప్రాణనష్టం జరగడంతో చాలా కాలంగా సరిహద్దుకు సంబంధించిన వార్తలు మీడియాలో పతాక శీర్షకలను ఆక్రమించాయి. ఒకవైపు కరోనాతో యుద్దం చేస్తున్న భారత ప్రభుత్వం.. అటు సరిహద్దు వ్యవహారాలపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది.

రోజురోజుకూ మన దేశ భూభాగంపైకి దూసుకువస్తున్న డ్రాగన్ సైన్యాన్ని నిలువరించే క్రమంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛనివ్వడం గత సంప్రదాయాలకు భిన్నమైనది. ఈ సాహసోపేతమైన నిర్ణయంతో మోదీ ప్రభుత్వం సైనిక బలగాలలో మెప్పును సాధించింది. గతంలో సైన్యాన్ని ఢిల్లీ పాలకులు నియంత్రించే వారు. ఇందుకు డెబ్బై నాలుగేళ్ళ స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. కానీ గత ఏడాది ఒకవైపు కరోనా పాండమిక్ సిచ్యువేషన్ కొనసాగుతుండగా.. అదను చూసి చొరబాట్లకు ప్రయత్నించిన డ్రాగన్ సైన్యానికి భారత సైనికులు ధీటైన సమాధానమిచ్చారు. వారికి మోదీ ప్రభుత్వం ఇచ్చిన పూర్తి స్వేచ్ఛే ప్రధాన కారణమని రక్షణ రంగ నిఫుణులు పలువురు అభిప్రాయపడుతున్నారు. రెండు దేశాల మధ్య జరిగిన పరస్పర దాడులలో మన దేశానికి చెందిన 23 మంది సైనికులు మరణించగా.. డ్రాగన్ సైన్యంలో ప్రాణనష్టం అంతకు మూడింతలుంటుందని అంఛనా.

అయితే, రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని నిరోధించేందుకు భారత ప్రభుత్వం దౌత్య విధానాలను కూడా అవలంభించింది. దానికి తోడు అంతర్జాతీయ సమాజం నుంచి చైనాపై ఒత్తిళ్ళు కూడా పెరగడంతో ఆ దేశ పాలకులు సైతం భారత్‌తో చర్చలకు మొగ్గు చూపారు. ఈ చర్చలు ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్నట్లు సుదీర్ఘంగా సాగాయి. చివరికి రెండు దేశాల సైన్యాలు పాంగాంగ్ నుంచి ఉపసంహరణ చర్యలను ఫిబ్రవరి 10వ తేదీన ప్రారంభించాయి. అంతా మంచే జరుగుతుందనుకుంటున్న సమయంలో దేశంలో రెండు ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. భారత భూభాగాన్ని చైనాకు ధారదత్తం చేశారంటూ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించడం.. దానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ధీటుగా స్పందించడంతో వాదోపవాదాలు పతాక శీర్షికలకు ఎక్కాయి.

తూర్పు లద్దాక్ బోర్డర్‌లోని పాంగాంగ్‌ సరస్సు వద్ద బలగాల ఉపసంహరణ కోసం చైనాతో అగ్రిమెంటులో భాగంగా మన భూభాగాన్ని ఏమాత్రం వదులు కోలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. దానికి ప్రతిగా రాహుల్ గాంధీ ఎదురుదాడికి దిగారు. దాంతో ఈ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సైనిక దళాల సత్తా, సామర్థ్యాలపై మోదీ ప్రభుత్వం పూర్తి విశ్వాసాన్ని ఉంచడం వల్లే తూర్పు లద్దాక్‌లో దేశ ప్రయోజనాలను కాపాడి.. మన భూభాగాన్ని రక్షించుకోగలిగామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటులో స్పష్టం చేశారు. భారత భూభాగం ఫింగర్‌-4 వరకూ ఉందన్న వాదన తప్పని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు రాహుల్ గాంధీ పలు మార్లు చేసిన కామెంట్లు దేశ ప్రజలను తప్పుదారి పట్టించేవిగా వున్నాయని రక్షణ మంత్రి ఆరోపించారు. ‘‘పాంగాంగ్ ప్రాంతంలో ఇరు దేశాలకూ చాలాకాలంగా పర్మనెంటు క్యాంపులున్నాయి. భారత శిబిరం ఫింగర్‌-3 వద్ద ఉన్న ధన్‌సింగ్‌ థాపా పోస్టు వద్ద ఉండగా.. చైనాకు సంబంధించి ఫింగర్‌-8కి తూర్పున ఉంది’’ అని రాజ్ ‌నాథ్ సింగ్ పార్లమెంటు ముందుంచిన పత్రంలో వెల్లడించారు.

‘‘భారత సైనికుల త్యాగాలతో సాధించుకున్న విజయాలను అనుమానించేవారు.. మన బలగాలను ఇన్‌సల్ట్ చేస్తున్నట్లే భావించాలి.. మ్యాప్‌లో భారత భూభాగం మొత్తాన్ని వెల్లడించాం.. 1962 యుద్ధ కాలంలో అనాటి ప్రభుత్వాల వైఫల్యాల కారణంగా చైనా ఆక్రమణలో ఉన్న 43వేల చదరపు కిలోమీటర్ల భూభాగం కూడా తాజా మ్యాపులో ఉంది. భారత వాదన ప్రకారం చూసుకున్నా వాస్తవాధీన రేఖ ఫింగర్‌-8 వద్ద ఉంది.. ఫింగర్‌-4 వద్ద కాదు. అందువల్లే ఫింగర్‌-8 వరకూ గస్తీ నిర్వహించే హక్కు మనకు ఉందని వాదిస్తూ వచ్చాం’’ అని రక్షణ శాఖ ఓ నివేదికలో పేర్కొన్నది. చైనాతో ఒప్పందం కారణంగా భారత్‌ తన భూభాగాన్ని అంగుళం కూడా వదులుకోలేదని తెలిపింది. దానికి తోడు వాస్తవాధీన రేఖకు డ్రాగన్ దేశం కట్టుబడి వుండేలా చేశామని, యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చకుండా అడ్డుకున్నామని స్పష్టం చేసింది. హాట్‌ స్ప్రింగ్స్‌, గోగ్రా, దెప్సాంగ్‌ సహా అనేక ప్రాంతాల్లో అపరిష్కృత వివాదాలు ఉన్నాయని రక్షణ మంత్రి గత వారం చేసిన ప్రకటనలో తెలిపిన సంగతిని రక్షణ శాఖ తన నివేదికలో పేర్కొన్నది. పాంగాంగ్‌ సరస్సు వద్ద బలగాల ఉపసంహరణ ముగిసిన 48 గంటల్లో.. ఈ సమస్యలపై దృష్టి సారిస్తామని రక్షణ మంత్రి చెప్పినట్లు డిఫెన్స్ మినిస్ట్రీ గుర్తుచేసింది.

అయితే, రక్షణ మంత్రి.. రక్షణ శాఖ.. ఆర్మీ నివేదికలు వెల్లడైన తర్వాత కూడా రాహుల్ గాంధీ ప్రభుత్వంపై దాడి కొనసాగించారు. తూర్పు లద్దాక్‌లో భారత భూభాగాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం చైనాకు వదులుకుందన్న తన గత ప్రకటనకే రాహుల్‌ గాంధీ కట్టుబడి వున్నారు. చైనాతో కుదిరిన ఒప్పందాన్ని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై ప్రధాన మంత్రి ఎలాంటి ప్రకటన చేయలేదని, రాజ్‌నాథ్‌ సింగ్‌ పార్లమెంటులో చేసిన ప్రకటన పేలవంగా వుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ‘‘రక్షణ మంత్రికి ఆ బాధ్యతను ఎందుకు అప్పగించారు. భారత భూభాగాన్ని చైనాకు అప్పగించామని ప్రధానమంత్రే ప్రకటన చేసి ఉండాల్సింది’’ అని విమర్శించారు. భారత బలగాలు ఇప్పుడు పాంగాంగ్‌ సరస్సు రేవులోని ఫింగర్‌-3 వద్ద మోహరించాల్సి ఉంటుందన్నారు. ‘‘ఫింగర్‌-4 కూడా మన ప్రాంతమే. మనం అక్కడే మోహరించాలి. కానీ ఫింగర్‌-4 నుంచి ఫింగర్‌-3కు వచ్చేశాం. మన భూభాగాన్ని మోదీ ఎందుకు చైనాకు అప్పగించారు’’ అని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు. కైలాస్‌ పర్వతశ్రేణిని స్వాధీనం చేసుకోవడానికి భారత సైన్యం ఎంతో శ్రమించిందని, అక్కడి నుంచి మన బలగాలను ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారని ప్రశ్నించారు. ‘‘వ్యూహాత్మకంగా ముఖ్యమైన దెప్సాంగ్‌ మైదాన ప్రాంతాల నుంచి చైనా ఎందుకు వెనక్కి తగ్గలేదు? గోగ్రా-హాట్‌ స్ప్రింగ్స్‌ నుంచీ చైనా ఉపసంహరణ ఎందుకు జరగలేదు. చైనాకు ఎదురొడ్డి నిలబడే సత్తా ప్రధానమంత్రికి లేదు. సైన్యం త్యాగాలను ఆయన కించపరుస్తున్నారు’’ అని కాంగ్రెస్ నేత మండిపడ్డారు.

దూకుడు పెంచిన బీజేపీ

రక్షణ మంత్రి, సంబంధిత శాఖ అన్ని క్లారిటీస్ ఇచ్చిన తర్వాత కూడా రాహుల్ గాంధీ సైన్యాన్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే సమయంలో రాహుల్ పైనా.. కాంగ్రెస్ పార్టీపైనా కమల నాథులు ఎదురు దాడి ప్రారంభించారు. ఇండియన్ భూభాగాన్ని చైనాకు ధారదత్తం చేశారంటూ రాహుల్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జయ్ ప్రకాశ్ నడ్డా స్పష్టం చేశారు. ట్విట్టర్ వేదికగా నడ్డా కాంగ్రెస్‌పై ఎదురు దాడి చేశారు. ‘‘ కాంగ్రెస్ సర్కస్‌లో న్యూ చాప్టర్ ప్రారంభమైంది. బలగాల ఉపసంహరణ, ఇండియాకు నష్టదాయకమని ఎందుకు అంత మొండిగా వాదిస్తున్నారు? ఈ వాదన చైనాతో కాంగ్రెస్ పార్టీకి వున్న ఒప్పందంలో భాగమా?’’ అని జేపీ నడ్డా ట్వీట్ చేశారు. తన వాదనకు అనకూలంగాను, కాంగ్రెస్ గతంలో సైన్యాన్ని పట్టించుకోలేదు అనడానికి సాక్ష్యంగాను వున్న ఓ మాజీ వైమానిక దళ అధికారి వీడియోను కూడా నడ్డా ట్వీట్ చేశారు. మరో బీజేపీ నేత, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ కూడా రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. 43 వేల చదరపు కిలో మీటర్ల భారత భూభాగాన్ని చైనాకు వదిలేని కాంగ్రెస్ పరిపాలకులను ఈ దేశ ప్రజలు ఎన్నటికీ క్షమించబోరని జోషీ వ్యాఖ్యానించారు.

Also read: కాంగ్రెస్ పార్టీలో కొలిక్కి రాని లుకలుకలు! ముసలం ముప్పు మళ్ళీ?