AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress Party: శర్మను కాదని ఖర్గేకు ఛాన్స్.. కాంగ్రెస్ పార్టీలో కొలిక్కి రాని లుకలుకలు! ముసలం ముప్పు మళ్ళీ?

కాంగ్రెస్ పార్టీ మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. సీనియర్ నేతలమంటూ గతంలో పార్టీపై ధ్వజమెత్తిన వారి విషయంలో పార్టీ అధిష్టానం ఆచీతూచీ వ్యవహరిస్తుందనడానికి తాజా నిర్ణయం చక్కని ఉదాహరణ అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Congress Party: శర్మను కాదని ఖర్గేకు ఛాన్స్.. కాంగ్రెస్ పార్టీలో కొలిక్కి రాని లుకలుకలు! ముసలం ముప్పు మళ్ళీ?
Rajesh Sharma
|

Updated on: Feb 12, 2021 | 2:25 PM

Share

Mallikarjuna Kharge to lead Congress RS MPs: శతాధిక సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ 2014 తర్వాత గతంలో ఎన్నడూ లేని దీనస్థితికి చేరుకుంది. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ పరిస్థితి మరింతగా కునారిల్లింది. సారథ్య బాధ్యతలను వద్దని గాంధీ వారసుడు రాహుల్ గాంధీ చెప్పినా ఆయనకే పట్టి పట్టి పదవినివ్వాల్సిన దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తోంది. గాంధీ, నెహ్రూ కుటుంబ వారసులు మినహా కాంగ్రెస్ పార్టీ ఫేట్‌ను మార్చలేరన్న ట్రెడిషనల్ టైపు ఆలోచనకే కాంగ్రెస్ పెద్దలు పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం జూలు విదిల్చి లేఖాస్త్రం రాసిన 23 మంది కాంగ్రెస్ సీనియర్లు అప్పట్లో మీడియాలో హెడ్డింగులను ఆక్రమించారు. ఆ లేఖాస్త్రాన్ని సీరియస్‌గానే తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు కనిపించింది. కొందరిని బుజ్జగించగలిగింది కూడా. అయితే ఈ ముసలం తాలూకూ ప్రభావం ఇంకా పార్టీని వీడలేదా ? అంటే నిజమేనని తాజాగా పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం చాటిచెబుతోంది.

సుమారు 28 ఏళ్ళ పాటు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించి, చాలా ఏళ్ళ పాటు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభా పక్షానికి సారథిగా వ్యవహరించిన కశ్మీరీ నేత గులాం నబీ ఆజాద్ ఫిబ్రవరి 15వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఇటీవల రాజ్యసభ ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా గులాం నబీ ఆజాద్ దక్షతపైనా, దేశభక్తిపైనా ప్రశంసలు కురిపించారు. ఒక దశలో ఆజాద్ సౌభ్రాతృత్వాన్ని పొగుడుతూ మోదీ గద్గద స్వరభరితులయ్యారు. ఆ తర్వాత ఆజాద్ కూడా తన రాజకీయ ప్రస్థానంలో కొన్ని ఘట్టాలను వివరిస్తూ కన్నీటిని ఆపుకోలేకపోయారు. నిజంగా ఆనాడు రాజ్యసభలో రాజకీయాలకు అతీతంగా ప్రసంగాలు వినిపించాయి.

అయితే, ఆజాద్ స్థానంలో రాజ్యసభలో ఎల్.ఓ.పీ. (లీడర్ ఆఫ్ అపోజిషన్)గా ఎవరికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అవకాశం కల్పిస్తుందనేది చర్చనీయాంశమైంది. ఆజాద్ తర్వాత డిప్యూటీ లీడర్‌గా వున్న మరో సీనియర్ నేత ఆనంద శర్మ నియమితులవుతారని అంతా భావించారు. అయితే.. కాంగ్రెస్ అధిష్టానం అనూహ్యంగా ఆనంద శర్మను కాదని.. గాంధీల కుటుంబానికి వీర విధేయునిగా పేరున్న కన్నడ దళిత నేత మల్లికార్జున ఖర్గేకు అవకాశమిచ్చింది. రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గేకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఖర్గే పేరును ప్రతిపాదిస్తూ రాజ్యసభ ఛైర్మన్‌కు కాంగ్రెస్‌ పార్టీ లేఖ రాసింది. కాంగ్రెస్‌ పార్టీకి మరీ ముఖ్యంగా గాంధీ ఫ్యామిలీ వీర విధేయుల్లో ఒకరైన మల్లికార్జున్‌ ఖర్గేకు రాహుల్‌గాంధీతో మంచి సాన్నిహిత్యం ఉంది. గతంలో 2014-19 మధ్య కాలంలో లోక్ సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన మల్లికార్జున ఖర్గేకు కాంగ్రెస్ అధిష్టానం మరో అవకాశమిచ్చింది. ఖర్గే ఎంపిక పెద్దగా ఆశ్చర్యపరచనప్పటికీ.. చాలా కాలంగా రాజ్యసభలో కాంగ్రెస్ పక్షానికి డిప్యూటీ లీడర్‌గా వ్యవహరిస్తున్న ఆనంద శర్మను ఎందుకు పక్కన పెట్టారన్నదిపుడు చర్చగా మారింది.

ఆజాద్ పదవీ విరమణ అంశం తెరమీదికి వచ్చినప్పట్నించి పార్టీలో సీనియర్లుగా భావించే దిగ్విజయ్ సింగ్, ఆనంద్ శర్మ, చిదంబరం, కపిల్ సిబల్ వంటి కీలక నేతల పేర్లు రాజ్యసభలో విపక్ష నేత స్థానం రేసులో వినిపించాయి. వీరిలో ఆనంద శర్మకు అవకాశాలు మెండుగా వున్నాయని పలువురు భావించారు. అయితే.. అందుకు భిన్నంగా పార్టీ ఖర్గేకు ఛాన్సిచ్చింది. ఆనంద శర్మకు షాకిచ్చింది. అయితే దీని వెనుక కారణాలను రాజకీయ విశ్లేషకులు అంఛనా వేస్తున్నారు. పార్టీలో సంస్కరణలు అవసరమంటూ ఇటీవల కాంగ్రెస్‌ అధిష్ఠానానికి లేఖ రాసిన 23 మంది సీనియర్ నేతల్లో ఆనంద్‌ శర్మ కూడా ఉండటంతో ఆయనకు అవకాశం ఇవ్వలేదని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

పాలిటిక్స్ అంటేనే ఎప్పటికప్పుడు వ్యూహప్రతివ్యూహాలతో నిత్యం అలర్ట్‌గా వుండాల్సిన పరిస్థితి. జాతీయ స్థాయిలో సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఆ అవసరం మరింత ఎక్కువగానే వుంది. ప్రజలకు తమ వాదనను సమర్థవంతంగా తీసుకువెళ్ళగలిగే నాయకత్వం కావాలి. గెలుపు, ఓటములను సమీక్షించుకుని.. తగిన విధంగా వ్యూహాలను మార్చుకుంటూ వెళ్ళే సత్తా వుండాలి. దురదృష్టవశాత్తు శతాధిక సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకిపుడు ఇదే కొరవడినట్టు కనిపిస్తోంది. ఎంతో ఘన చరిత్ర కలిగిన పార్టీ ఇప్పుడు ఉనికి కాపాడుకోవడానికే తిప్పలు పడుతోంది. అంతర్గత సమస్యలు, విభేదాలు, నేతల మధ్య సమన్వయం కొరవడటం, నాయకత్వం బలంగా లేకపోవడం కాంగ్రెస్‌ను ఇబ్బంది పెడుతున్నాయి. వరుస ఓటములతో పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోంది. ఇవి చాలవన్నట్లు తరచూ సీనియర్‌ నేతల వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్ఠను మసక బారుస్తున్నాయి.

ఇటీవల జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. బీహార్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మూటగట్టుకున్న ఘోర పరాజయం నేపథ్యంలో మరోసారి సీనియర్ నేతలు గళమెత్తారు. సీనియర్ నేత కపిల్‌ సిబల్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను దేశ ప్రజలు ప్రత్యామ్నాయంగా భావించడం లేదని, పార్టీలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని ఆయన కామెంట్ చేశారు. సమస్యలున్నాయని తెలిసినా ఎవరూ పరిష్కారం కోసం చొరవ చూపడం లేదని, ఇలాగే కొనసాగితే పార్టీ గ్రాఫ్‌ పడిపోతుందని కపిల్ సిబల్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది. సిబల్‌ వ్యాఖ్యలకు చిదంబరం తనయుడు, కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరం మద్దతు పలికారు. పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని ట్వీట్‌ చేశారు.

మరోవైపు కపిల్ సిబల్‌ తరహాలోనే మరో సీనియర్‌ నేత చిదంబరం పార్టీ వైఫల్యాలపై తనదైన శైలిలో అసహనం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో సంస్థాగతమైన ఉనికిని కాంగ్రెస్‌ పార్టీ కోల్పోయిందనే విషయాన్ని బీహార్ ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయని చిదంబరం అభిప్రాయపడ్డారు. బీహార్లో కాంగ్రెస్‌ తనకున్న బలానికి మించి ఎక్కువ సీట్లలో పోటీ చేసిందని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం పేర్కొన్నారు. గుజరాత్, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, కర్నాటక ఉపఎన్నికల్లో వచ్చిన ఫలితాలు తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయని అన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ సంస్థాగతంగా ఉనికిని కోల్పోవడం లేదా గణనీయంగా బలహీనపడిందనడానికి ఇవి నిదర్శనమని చిదంబరం వ్యాఖ్యానించారు.

2020 ఆగస్టులో 23 మంది పార్టీ సీనియర్లు పార్టీలో సమూల ప్రక్షాళన జరగాలని, సంస్కరణలు అవసమని ఏకంగా అధిష్టానానికే లేఖ రాశారు. అందులో కూడా కపిల్ సిబల్ వంటి నేతలున్నారు. ఇలా వరుసగా సీనియర్‌ నేతలు వ్యాఖ్యలు చేయడంపై పార్టీ అధిష్టానం ఆగ్రహంతో వున్నా.. పైకి మాత్రం గుంభనంగా వ్యవహరిస్తోంది. తాజాగా రాజ్యసభలో విపక్ష నేత ఎంపిక విషయంలో వినిపించిన పేర్లన్నింటినీ తోసి పుచ్చడానికి గత ఆగస్టు లేఖే కారణమన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఆనంద శర్మ, కపిల్ సిబల్, చిదంబరం పేర్లను నిరసన గళాలు వినిపించిన కారణంగానే పక్కన పెట్టి.. మల్లికార్జున ఖర్గే వంటి విశ్వాసపాత్రుని వైపే సోనియా, రాహుల్ గాంధీలు మొగ్గు చూపి వుంటారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

మరోవైపు గులాం నబీ ఆజాద్‌ను మరోసారి రాజ్యసభకు తీసుకురావాలని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్‌ నాటికి కేరళకు చెందిన 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిలో ఒకటి కాంగ్రెస్‌కు దక్కుతుంది. ఈ స్థానం నుంచి గులాం నబీ ఆజాద్‌ను రాజ్యసభకు పంపించే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆజాద్ మరోసారి రాజ్యసభ మెట్లిక్కితే.. మళ్ళీ ఆయనకే రాజ్యసభలో విపక్ష నేత హోదా ఇస్తారా? అంటే ఖర్గేకు పదవి మూణ్ణాళ్ళ ముచ్చటేనా? ఇలాంటి ఊహాగానాలు ఇపుడు జాతీయ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

Also read: 5 దశాబ్దాల తర్వాత మళ్ళీ అదే నినాదం.. తెర వెనుక అసలు కథ ఇదే!