కొత్త పార్టీ ఏర్పాటుపై వైఎస్ షర్మిల ముమ్మర కసరత్తు.. ముఖ్యనేతల భేటీతో సందడిగా మారిన లోటస్‌పాండ్‌

హైదరాబాదు లోటస్ పాండ్ లో వైఎస్సార్ అభిమానులు, సన్నిహితులతో సమావేశమై తన మనోభావాలను పంచుకున్న షర్మిల మరో సమావేశానికి సిద్ధమయ్యారు.

కొత్త పార్టీ ఏర్పాటుపై వైఎస్ షర్మిల ముమ్మర కసరత్తు.. ముఖ్యనేతల భేటీతో సందడిగా మారిన లోటస్‌పాండ్‌
వైఎస్ షర్మిల రెడ్డి
Follow us

|

Updated on: Feb 15, 2021 | 4:39 PM

YS Sharmila Key Meeting : తెలంగాణలో పార్టీ ప్రారంభించేందుకు ఉత్సాహంగా ఉన్న వైఎస్ షర్మిల ఆ దిశగా తన కార్యాచరణ ముమ్మరం చేశారు. ఇటీవలే హైదరాబాదు లోటస్ పాండ్ లో వైఎస్సార్ అభిమానులు, సన్నిహితులతో సమావేశమై తన మనోభావాలను పంచుకున్న షర్మిల మరో సమావేశానికి సిద్ధమయ్యారు. దీంతో హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌ మళ్లీ సందడిగా మారింది. ఇటీవల వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్నానని ప్రకటించారు. దీంతో కీలక నేతలు, కార్యకర్త రాకతో లోటస్‌పాండ్ కలకలలాడుతోంది. బెంగళూరు నుంచి తిరిగొచ్చాక షర్మిల ముఖ్యనేతలు, శ్రేయాభిలాషులతో మంతనాలు జరుపుతున్నారు.

రాజన్నరాజ్యమే లక్ష్యంగా తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నానని గతవారం ప్రకటించారు వైఎస్‌ షర్మిల. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కూతురి నిర్ణయం రెండు తెలుగురాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ఎన్నో పార్టీలు వచ్చిపోయాయని.. తెలంగాణలో తమ నేత చరిస్మా ముందు అంత ఈజీ కాదంటూ టీఆర్‌ఎస్‌ నేతలు రియాక్ట్‌ అయ్యారు. ఆంధ్రా నేతలొచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారంటూ…షర్మిల ప్రకటన వెనుక వేరే లెక్కలున్నాయని కాంగ్రెస్‌ నేతలు విమర్శలు చేశారు. అటు, వైసీపీ.. షర్మిల నిర్ణయంపై ఆచితూచి స్పందించింది. అన్న వైఎస్‌ జగన్‌తో కొన్ని అభిప్రాయభేదాలున్నా విభేదాలు మాత్రం లేవని ప్రకటించారు పార్టీ ముఖ్య నేతలు. రాజకీయంగా దారులు వేరయినా, కుటుంబం ఒకే మాటమీదుంటారని సంకేతాలిస్తున్నారు.

మరోవైపు, దివగంత నేత వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి బతికుండగా ఆయన వెంట నడిచినవారు, అండగా నిలిచినవారు తనతో కలిసిరావాలని కోరుతున్నారు షర్మిల. తాను త్వరలో పెట్టబోయే పార్టీలో చేరాలంటూ పిలుపునిస్తున్నారు. ఇందులో భాగంగా లోటస్‌పాండ్‌కి కొందరు ముఖ్యనేతలొచ్చి ఆమెను కలుసుకుంటున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి లోటస్‌పాండ్‌లో షర్మిలతో భేటీ అయ్యారు. నల్గొండ డీసీసీ మాజీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి షర్మిలను కలుసుకున్నారు. ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు కె.రామచంద్రమూర్తి కూడా లోటస్‌పాండ్‌కొచ్చి షర్మిలతో భేటీ కావడం ఆసక్తికరపరిణామంగా భావిస్తున్నారు. ముందుకొచ్చే నేతలతో మొదట ఆత్మీయ సమావేశాల తర్వాత రాజకీయంగా అడుగు ముందుకేయాలనుకుంటున్నారు వైఎస్‌ షర్మిల. కొందరు నేతలకు లోటస్‌పాండ్‌నుంచి ఫోన్లు చేసి పార్టీలో చేరాలంటూ ఆహ్వానం పంపుతున్నట్లు సమాచారం.

మరోవైపు, లోటస్‌పాండ్‌లో 20వ తేదీ ఉదయం హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల వైఎస్‌ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్‌ 10వరకు అన్ని జిల్లాల నాయకులతో ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగుతాయి. చివరిగా ఖమ్మం జిల్లా ఆత్మీయ సమ్మేళనం ఉంటుంది. అన్ని పార్టీల నేతలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారన్నారని షర్మిల ముఖ్య అనుచరుడు కొండా రాఘవరెడ్డి తెలిపారు. రాజశేఖర్‌రెడ్డి ఫ్యామిలీ ఎవరికీ బీ టీంగా ఉండదన్నారు కొండా స్పష్టం చేశారు.

ఇదీ చదవండి….  PM Modi: ‘అత్మనిర్భర్ భారత్’కు కేంద్రం మరో ముందడుగు.. మ్యాపింగ్ విధానంలో కీలక మార్పులు..